శామీర్‌పేటలో యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు
ABN , First Publish Date - 2020-07-08T10:49:14+05:30 IST
అక్రమార్కులు అనుమతిలేని నిర్మాణాలను దర్జాగా నిర్మించేస్తున్నారు. ఒకవైపు అనుమతిలేని కట్టడాలపై అధికారులు..

అనుమతుల్లేకుండా దర్జాగా నిర్మాణాలు
చోద్యం చూస్తున్న అధికారులు
హెచ్ఎండీఏ ఖజానాకు గండి
శామీర్‌పేట: అక్రమార్కులు అనుమతిలేని నిర్మాణాలను దర్జాగా నిర్మించేస్తున్నారు. ఒకవైపు అనుమతిలేని కట్టడాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా అవి ఎక్కడా అమలు కావడంలేదు. శామీర్‌పేట మండలంలోని బొమ్మరాసిపేటలో ఏడాదిగా గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్- 484 లో దాదాపు 3-20 ఎకరాల పట్టా భూమిని కొందరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫోర్జరీ చేసి దొంగ డాక్యుమెంట్లను సృష్టించి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేయకుండానే లోలోపల పేపర్లపైనే అక్రమ లేవుట్, వెంచర్‌ను తయారు చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు, సిబ్బంది మాత్రం వ్యాపారులతో కుమ్మక్కై చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
మోసపోతున్న వినియోగదారులు
అక్రమ లేవుట్‌లో చేసిన ప్లాట్లను వ్యాపారులు, అక్రమార్కులు కొందరు అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి విక్రయిస్తూ లక్షలకు లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ వెంచర్లో ప్లాట్లను కొనుగోలు చేసి న వారు మోసపోతున్నారు.
పట్టించుకోని అధికారులు
ఈ అక్రమ లేవుట్, వెంచర్లో కొనుగోలు చేసిన ప్లాట్లల్లో సంబంధిత హుడా నుంచి గాని, గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొందరు వ్యక్తులు దర్జాగా ఇళ్ళు, ప్రహరీ, బేస్మెంట్ల నిర్మాణాలను చేపట్టారు. ఈ లేవుట్‌లో దర్జాగా జరుపుతున్నా నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ సంబంధిత మండల, పంచాయతీ అధికారులు వ్యాపారులు, అక్రమార్కులతో కుమ్మక్కై తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
మంత్రి ఆదేశాలు బేఖాతరు
బొమ్మరాసిపేట పరిధిలోని సర్వేనెంబర్-484లో గల అక్రమ వెంచర్లో జరుపుతున్న అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదుల మేరకు కఠిన చర్యలను తీసుకోవాలని ఇటీవల సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంబంధిత అధికారులు అదేశించారు. వాటిని ఆపకుండా, తొలగించకుండా మంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఆదాయానికి గండి
ఒక వ్యవసాయ భూమిని వెంచర్, లేవుట్ చేయాలంటే సంబంధిత రెవెన్యూ శాఖ ద్వారా నాలా అనుమతి, ల్యాండ్ కన్వర్జేషన్ చేసుకోవాలి. తర్వాత హెచ్ఎండీఏకు నిబంధనల ప్రకారం తగు ఫీజులను చెల్లించి అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం వ్యాపారులు కొంత స్థలాన్ని మాత్రమే ల్యాండ్ కన్వర్జేషన్ చేయించి, మిగతా స్థలాన్ని ల్యాండ్ కన్వర్జేషన్ చేయించకుండా, హెచ్ఎండిఎకు లక్షలాది నిధులను గండి కొడుతున్నారు.
విచారణ జరిపితే బయటపడనున్న అక్రమాలు
బొమ్మరాసిపేటలోని సర్వేనెంబర్-484లో అక్రమార్కులు చేసిన అక్రమ వెంచర్, లేవుట్‌పై, ఆ వెంచర్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి లోతుగా విచారిస్తే అక్రమాలన్నీ బయట పడుతాయి. గండిపడ్డ ఖజానా హెచ్ఎండీఏకు వస్తుందని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.