యాసంగికి సన్నద్ధం

ABN , First Publish Date - 2020-12-21T04:18:44+05:30 IST

యాసంగికి సన్నద్ధం

యాసంగికి సన్నద్ధం
చందుపట్లగూడలో నాటుకు సిద్ధంగా ఉన్న వరినారు

  • వరినాట్లు వేసేందుకు సిద్ధమైన అన్నదాతలు 
  • ఈసీజన్‌ వరి విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం 
  • దుక్కులు సిద్ధం చేసుకుంటున్న రైతులు 
  • అందుబాటులోనే ఎరువులు 


ఘట్‌కేసర్‌: రైతులు యాసంగి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సంమృద్ధిగా కురువడంతో భూగర్భజలాలు పుష్కలంగా ఉండటంలో రైతులు వరివేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో బాగంగా రైతులు ఇప్పటికే నార్లు పోసుకొని దుక్కులు దున్నుకొని సిద్ధం చేసుకున్నారు. యాసంగి సీజన్‌లో 5వేల ఎకరాల్లో వరినాట్లు వేసే ఆవకాశముందని వ్యవసాయశాఖ అంచనాలు వేస్తోంది. ఈమేరకు ఎరువులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం చలితీవ్రత అంతగా లేకపోవడంతో నార్లు ఏపుగా పెరిగాయి. భారీ వర్షాల తాకిడికి చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో  పొలాల్లో నీరు ఊరి పారుతోంది. దీంతో నారు పెరగక రైతులు ఆందోళన చెందుతున్నారు. బావులు, బోర్లవద్ద పోసిన నార్లు నాటేందుకు సిద్ధమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో వరినాట్లు వేయనున్నట్లు రైతులు వివరించారు. చెరువులు, కుంటల కింద నీరు పారుతుండటంతో ఇప్పటికే రైతులు నాట్లు వేయడానికి దుక్కులను సిద్ధం చేసి పెట్టుకున్నారు. చాలా మంది రైతులు నార్లు ఆలస్యంగా పోయడం వలన ఈసీజన్‌లో వరి నాట్లు ఎక్కువకాలం కొనసాగే ఆవకాశముందని పలువురు రైతులు వివరిస్తున్నారు. గత సీజన్‌లో కంటే ఎక్కువ విస్తీర్ణంలో వరిసాగు చేసే అవకాశముండటంతో పాటు కరోనా భయంతో కొంత మంది వ్యవసాయ పనులకు దూరంగా ఉంటుండటంతో కూలీల సమస్య తలెత్తే అవకాశ ముందని రైతులు వివరిస్తున్నారు. దాదాపు నెలరోజుల పాటు వరినాట్లు వేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.  


నాట్లు వేసేందుకు దుక్కులు చేసుకున్నాం : సీహెచ్‌ నర్సింహారెడ్డి, రైతు, చందుపట్లగూడ 


వరినట్లు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నాం. నారు ఏతకు సిద్ధంగా ఉంది. ఎక్కువ మంది రైతులు వరి సాగు చేసేందుకు సన్నద్ధమవుతుండటంతో కూలీల సమస్య ఏర్పడే అవకావముంది. కొంత మంది రైతులు అలస్యంగా నార్లు పోసుకున్నందున కొంత కలిసి రావచ్చు.  


అవసరమైనంత ఎరువులు ఉన్నాయి : సురేష్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారి 


యాసంగి సీజన్‌కు అవసరమైన ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. అలస్యంగా నార్లు పోసుకున్న రైతులు తగుజాగ్రత్తలు చేపట్టాలి.  ప్రధానంగా రాత్రిసమయాల్లో నారుమడుల్లో నీరు ఉండకుండా చూసుకోవాలి. నాట్లు వేసుకునే రైతులు నారు తీయడానికి ఐదురోజుల ముందు గుళికలు చల్లుకోవాలి. 20నుంచి 30రోజుల్లో నాటు వేసుకునేలా చూడాలి.   

Updated Date - 2020-12-21T04:18:44+05:30 IST