పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

ABN , First Publish Date - 2020-05-17T09:30:06+05:30 IST

జిల్లా పరిషత్తు నిధులతో ప్రారంభించి అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

తాగునీటి సమస్యలు పరిష్కరించండి

పారిశుధ్య పనులు మెరుగుపరచండి

సమీక్షా సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి

 

వికారాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్తు నిధులతో ప్రారంభించి అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులను వెంటనే  పూర్తి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం జడ్పీ కార్యాలయంలో పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ ఇంజనీర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. మండలాల్లో గ్రామాల వారీగా పనులను గుర్తించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపరిషత్తు నుంచి గతంలో మంజూరు చేసిన పనులు ఇప్పటి వరకు పూర్తికాకపోతే వాటిని రద్దు చేయాలని ఆమె చెప్పారు. రద్దుచేసే పనుల స్థానంలో అవసరమైన చోట్ల తిరిగి కొత్త పనులు మంజూరు చేస్తామని తెలిపారు.


నిర్ణీత కాలవ్యవధికి సంబంధించి మంజూరైన పనులను పూర్తి చేయలేకపోతే ఆపనులు రద్దయినట్లేనని స్పష్టం చేశారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు, భవననిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్‌ అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వేసవిలో తాగునీటి సమస్య ఉత్పన్నమవుతున్న గ్రామాల్లో వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు మెరుగయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో కృష్ణన్‌, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి మనోహర్‌రావు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు తదిరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-17T09:30:06+05:30 IST