-
-
Home » Telangana » Rangareddy » Feeses
-
ప్రైవేటు పాఠశాలల ఫీ‘జులుం’
ABN , First Publish Date - 2020-12-07T04:24:13+05:30 IST
ప్రైవేటు పాఠశాలల ఫీ‘జులుం’

ఆన్‌లైన్ తరగతుల పేరిట ఫీజులకై ఒత్తిడి
నిలదీస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
తాండూరు : కొవిడ్ కారణంగా ఇప్పటికీ ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కానప్పటికీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే కరోనా సమయంలో పాఠశాలలు రద్దయి ఎటువంటి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించకున్నా ఫీజులు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలపై పేరెంట్స్ తిరగబడుతున్నారు. పదో తరగతికి రూ.25వేలు చెల్లిచాలని తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఒత్తిడి పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ఆన్‌లైన్ క్లాస్‌ల పేరిట తరచూ ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు దోరిశెట్టి సత్యమూర్తి పలువురు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, తాండూరు-చించొళి రోడ్డులో ఓ పాఠశాల అనుమతిని పేరు మార్చి, కరపత్రాలు పంపిణీ చేసి పేరెంట్స్‌ను మోసం చేసిన విషయమై ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.