మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు
ABN , First Publish Date - 2020-12-04T05:13:15+05:30 IST
మద్దతు ధర కల్పించాలంటూ మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు.

మర్పల్లి : మద్దతు ధర కల్పించాలంటూ మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. షరతులతో పంటను కొనుగోలు చేయడం సరికాదని మర్పల్లి న్యూబస్టాండ్ ఆవరణలో గురువారం బైఠాయించారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ మండల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రవీందర్, మల్లేష్ మాట్లాడుతూ, రైతులు ఏ పంటలు వేశారో సర్వే చేయకుండానే వ్యవసాయ అధికారులు ఇష్టానుసారంగా నివేదిక పంపారని వారు ఆరోపించారు. మండలంలోని వేలాది ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట వేస్తే... కేవలం 150 మందికి మాత్రమే కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు అనుమతి వచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి షరతులు విధించకుండా మొక్కజొన్న పంట కొనుగోలు చేసేంతవరకు ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం పోలీసులు రైతులను సముదాయించి ధర్నా విరమించేలా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ తులసీరాంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సలీం, దివాకర్, శేఖర్యాదవ్ పాల్గొన్నారు.