మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు సతీవియోగం

ABN , First Publish Date - 2020-12-28T05:07:58+05:30 IST

మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు సతీవియోగం

మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు సతీవియోగం
శైలజ మృతదేహం వద్ద నివాళ్లర్పిస్తున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి, వికారాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గడ్డం ప్రసాద్‌కుమార్‌కు సతీవియోగం కలిగింది. ప్రసాద్‌కుమార్‌ సతీమణి గడ్డం శైలజ (48) హఠాన్మరణం చెందారు. శనివారం రాత్రి 10.30 గంటలకు ఆమె తమ నివాసంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురి కాగా, వెంటనే హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే శైలజ గుండెపోటుతో కన్నుమూశారు. ప్రసాద్‌కుమార్‌, శైలజ దంపతులకు కూతురు శ్రీఅనన్య, కుమారుడు ఈశ్వర్‌ ఉన్నారు. గత నెలలో కూతురు శ్రీఅనన్య వివాహం జరగగా,ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడాన్ని ఆ కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. శైలజ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, అభిమానులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. శైలజ మృతి చెందిన సమాచారం తెలియగానే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దంపతులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. శైలజ మృతి చెందిన సమాచారం తెలియగానే అదేరోజు రాత్రి వారు ఆసుపత్రికి చేరుకుని ఆమెకు నివాళ్లర్పించి ప్రసాద్‌కుమార్‌ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌, చేవెళ్ల, ఎల్‌బీ నగర్‌, అంబర్‌పేట్‌ ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య, సుధీర్‌రెడ్డి, వెంకటేష్‌, మాజీ డిప్యూటీ సీఎం దామోదరం రాజనర్సింహ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌, కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌, డీసీసీ వికారాబాద్‌  అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తదితరులు ప్రసాద్‌కుమార్‌ నివాసానికి వెళ్లి శైలజ మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళ్లర్పించారు. సాయంత్రం నగరంలోని అంబర్‌పేట శ్మశానవాటికలో జరిగిన శైలజ అంత్యక్రియలకు వికారాబాద్‌ జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు హాజరై ఆమె మృతికి సంతాపం తెలిపి, ప్రసాద్‌కుమార్‌కు సానుభూతిని వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-28T05:07:58+05:30 IST