అంతా..అక్రమమే!

ABN , First Publish Date - 2020-03-02T11:03:22+05:30 IST

బషీరాబాద్‌ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. ఆనుమతులు తీసుకోకుండానే హద్దు రాళ్లు పాతి

అంతా..అక్రమమే!

  • బషీరాబాద్‌లో ఇష్టారీతిగా పుట్టుకొస్తున్న వెంచర్లు
  • అనుమతులు లేకుండానే జోరుగా ఇళ్ల నిర్మాణాలు 
  • ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
  • కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం అమలును పట్టించుకోని వైనం
  • నష్టపోతున్న సామాన్యులు
  • చోద్యం చూస్తున్న అధికారులు 

బషీరాబాద్‌/తాండూరురూరల్‌: బషీరాబాద్‌ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. ఆనుమతులు తీసుకోకుండానే హద్దు రాళ్లు పాతి ఇష్టారాజ్యంగా ప్లాట్ల  విక్రయాలు చేపడుతున్నారు. నిబంధనలు పాటించకపోవడంతో పంచాయతీల ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ విషయంలో పంచాయతీ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమ లేఆవుట్ల దందా ఊపందుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బషీరాబాద్‌ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట సర్వే నంబర్‌ 56, 57లో సుమారు 10 ఎకరాలు, స్థానిక రైల్వే గేటు సమీపంలో, జీవన్గి  రోడ్డు మార్గం పక్కన ఎకరా భూమిలో, నవాంద్గీ రోడ్డు మార్గం పక్కన సర్వే నంబర్‌ 54లో కొత్తగా వెలసిన సుమారు 6 ఎకరాల వెంచర్‌ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకు దగ్గరగా హద్దులు పాతడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిలో ఏ ఒక్కదానికి అనుమతి లేకపోగా, వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి రియల్టర్లు విక్రయానికి ఉండడం గమనార్హం. ఎంపీడీవో కార్యాలయం ఎదుట, బషీరాబాద్‌- జీవన్గి రోడ్డు మార్గం పక్కన మైనార్టీ కాలనీ వెనక భాగంలో అక్రమ వెంచర్లలో జోరుగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు.


లే అవుట్లు లేకుండానే నిర్మాణాలు..


 బషీరాబాద్‌లో పలు అక్రమ వెంచర్లలో లే ఆవుట్లు లేకుండానే కొందరు ప్లాట్లు కొని ఇప్పటికే ఇళ్లను నిర్మించుకోగా, మరి కొందరు జోరుగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. కొత్త వెంచర్ల అనుమతుల కోసం వస్తున్న వారిని పంచాయతీ అధికారులు వ్యవసాయయేతర భూమిగా మార్చుకుని రావాలని రియల్టర్లను తిప్పి పంపిస్తున్నారు. దీంతో లే అవుట్లు లేని ప్లాట్లు కొని అమాయక ప్రజలు నిత్యం మోసపోతున్నారు. అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో మౌనంగా ఉంటున్నారని చర్చ సాగుతోంది.


నిబంధనలు ఇవీ..


వెంచర్లను ఏర్పాటు చేసేముందు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి పొందాలి. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం వెంచర్లు ఏర్పాటు చేసే సమయంలో ముందుగా సదరు వ్యవసాయ పొలాలన్నీ వ్యవసాయేతర స్థలం(నాలా)గా మారుస్తూ ఆర్డీవో దగ్గర అనుమతులు తీసుకోవాలి. అనంతరం రికార్డులను గ్రామ పంచాయతీకి అప్పగించాలి. వాటిని గ్రామ పంచాయతీ అధికారులు సాంకేతిక నిర్ణయం కోసం టౌన్‌ ఫ్లానింగ్‌ అధికారులకు పంపుతారు. రెండున్నర ఎకరాలకు జిల్లా స్థాయి, ఐదు ఎకరాలలోపు రీజియన్‌ స్థాయి, ఆపై దాటితే రాష్ట్ట్ర స్థాయి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సర్వే చేసి అనుమతులు ఇస్తారు. నివేదికను రెవెన్యూ, గ్రామ పంచాయతీల అధికారులకు పంపుతారు. దీనిపై పంచాయతీ పాలకవర్గం గ్రామ సభలో తీర్మానిస్తారు. వెంచర్‌లో అంతర్గత రోడ్లన్నీ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాలి. వెంచర్ల ఏర్పాటు చేసే స్థలం విస్తీర్ణంలో 10 శాతం భూమిని ప్రజా అవసారాలకు ఖాళీగా వదిలేయాలి..ఆ స్థలంలో పార్కులు, ఇతర అభివృద్ధి పనులను చేపడతారు.30 శాతం స్థలాన్ని రోడ్లకు వదిలేయాలి. మిగతా 60 శాతంలో మాత్రమే ప్లాట్లను ఏర్పాటు చేయాలి. మురుగు కాల్వల నిర్మాణం, విద్యుత్‌ సౌకర్యాం గ్రీనరీ లాంటి సౌకర్యాలు కల్పించాలి. వెంచర్లలో నిబంధనల ప్రకారం ప్లాట్‌ విస్తీర్ణం కనీసం 120 చదరపు గజాలు ఉండాలి. అయితే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరా రూ. లక్ష ఉంటే అందులో రూ. 10 వేల ఫీజు రెవెన్యూ అధికారులు వసూలు చేసి అనంతరం లేఅవుట్‌ మంజూరు చేస్తారు.  


గౌతాపూర్‌లో అక్రమ భూదందా


తాండూరు మండలం గౌతాపూర్‌ పంచాయతీ పరిధిలో పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారుల ప్రోద్భలంతో వ్యాపారులు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. తాండూరు-చించొళి రోడ్డు మార్గంలోని మోత్కుల వాగు సమీపంలో దాదాపు 2 ఎకరాలు, గ్రామ సమీపంలోని మల్లన్న కుంట వద్ద  వరకు అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. పంచాయతీ పరిధిలో దాదాపు 10 ఎకరాల్లో అక్రమ వెంచర్లు కొనసాగుతున్నాయి. మల్లన్న ఆలయం, సబ్‌స్టేషన్‌ సమీపంలో మల ్లన్న కుంట వెనుభాగంతోపాటు మోత్కుల వాడుక దారివెంబడి వెంచర్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతున్నారు. దీంతో పంచాయతీ ఆదాయానికి భారీ గండి పడే అవకాశం ఉంది. 


నోటీసులు పంపించాం


గౌతాపూర్‌ సమీపంలో వెంచర్లు ఏర్పాటు చేసే యజమానులకు నోటీసులు జారీ చేశాం. వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయకుండా గతేడాది బోర్డు ఏర్పాటు చేశాం. వెంచర్లను ధ్వంసం చేసినా అక్రమార్కులు మళ్లీ కట్టడాలు చేపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకుంటాం.  


- పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌రావు


ఏ వెంచర్‌కూ అనుమతుల్లేవు..


బషీరాబాద్‌ ఎంపీడీవో కార్యాలయం ఎదుట, జీవన్గి రోడ్డు మార్గం పక్కన, రైల్వేగేటు సమీపంలోని భూముల్లో  వెలసిన ఏ వెంచర్లకు అనుమతులు లేవు. ఈ భూములు నవాంద్గీ రెవెన్యూ పరిధిలోకి వస్తాయనేది ఇటీవల తెలిసింది. నవాంద్గీ రోడ్డు మార్గం పక్కన కొత్తగా వెలసిన 54 సర్వే నంబర్‌లో 6 ఎకరాల్లో  ప్లాట్లకు సంబందించి ఎన్‌ఓసీ ఇచ్చాం. ల్యాండ్‌ కన్‌వర్షన్‌కు సంబంధించి డ్యాకుమెంట్లు ఇవ్వలేదు. వ్యవసాయ భూములను, వ్యవసాయేతర భూములుగా మార్చకుండా, అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్నది వాస్తవమే. ఈవిషయమై మండల పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకుంటాం. 

- నర్సిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి 

Updated Date - 2020-03-02T11:03:22+05:30 IST