పొలం గట్లపైనే పారబోత

ABN , First Publish Date - 2020-08-01T10:43:12+05:30 IST

కరోనా మహమ్మారికి రైతులు సైతం విలవిల్లాడిపోతు న్నారు. అన్నిరంగాలు మూతపడ టంతో ఎంతోమంది వ్యవసాయం వైపు దృష్టిసారిస్తున్నారు.

పొలం గట్లపైనే పారబోత

కరోనా ప్రభావంతో వంగరైతు విలవిల 

గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు 


మర్పల్లి: కరోనా మహమ్మారికి రైతులు సైతం విలవిల్లాడిపోతు న్నారు. అన్నిరంగాలు మూతపడ టంతో ఎంతోమంది వ్యవసాయం వైపు దృష్టిసారిస్తున్నారు. అయితే కరోనా ప్రభావంతో పంటలకు మార్కెట్‌లో సరైన ధర లేకపోవ డంతో తీవ్రంగా నష్టపోతున్నారు. లాభాలు తెచ్చిపెడుతుందని గంపెడాశతో రైతులు వంకాయ సాగు చేశారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక పొలంగట్లపైనే పారబోయాల్సిన పరిస్థితి దాపురిం చిందని వంకాయ సాగుచేసిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. 


కూరగాయల పంటలతో నష్టం వాటిల్లకుండా కాస్తో కూస్తో లాభాలు గడించవచ్చని మర్పల్లి మండలంలో సుమారుగా 200ఎకరాలకుపైగా రైతులు వంకాయ పం టను సాగుచేశారు. ఎకరాకు రూ.50వేల పెట్టుబడి పెట్టి ఆరు నెలల కింద పంటను వేశారు. ప్రస్తుతం ఆ పంట చేతికొచ్చింది. కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చడంతో నేటి వరకు పాఠశాలలు, కళాశాలలు తెరవకపోగా వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు వసతిగృహాలు కూడా మూతపడ్డాయి. దీంతో మార్కెట్‌లో వంకాయ ధర మరింత దారుణంగా పడిపోయింది. ఎంత లేదన్నా వంకాయ కిలో రూ.20 పలికేది. ప్రస్తుతం మార్కెట్‌లో వంకాయలను పంపిస్తామన్నా దళారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో మార్కెట్‌కు తరలించాల్సిన పంటను రోజుల తరబడి పొలాల వద్ద నిలువ చేస్తున్నారు. దీంతో వంకాయలు మురిగిపోయి నష్టం వాటిల్లుతున్నది. 


మార్కెట్‌లో కొనేవారు కరువు

వంకాయ పంటను మార్కెట్‌కు తరలిద్దామంటే మార్కెట్‌లో డిమాండ్‌ లేదు. వీటిని కొనుగోలు చేసేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపడం లేదు. కొనేవారు లేక పంటను మార్కెట్‌లోనే పారబోస్తున్నారు. వంకాయ కిలో ధర రూ.5 కూడా పలకడం లేదని దళారులు చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. రైతులు నేరుగా మార్కెట్‌కు వెళ్లి విక్రయించుకుందామంటే కరోనా భయంతో పట్టణాలకు వెళ్లలేకపోతున్నారు. గ్రామాలకు వెళ్దామంటే అక్కడి వారు రానిచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతు న్నారు. మంచి లాభాలు వస్తాయని పంటను సాగు చేస్తే.. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


పంట తెంపకపోవడంతో కుళ్లిపోతోంది 

గతేడాది హైదరాబాద్‌ మార్కెట్లలో వంకాయకు మంచి ధర లభించింది. ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందనుకుని ఎకరా పొలంలో రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టి వంకా య పంట సాగు చేశాను. వేసవిలో సమయానికి పంటకు నీరందించి మందులు కూడా పిచికారి చేశాను. కరోనా రాకాసి విజృంభిస్తుండటంతో మార్కెట్‌లో పంటను కొనేవారే కరువయ్యారు. కనీసం వారానికొకసారి కూడా తరలించలేని పరిస్థితి, అకాల వర్షం కారణంగా పంట తెంపకముందే కుళ్లు ముఖం పడుతోంది.  

- శ్రీనివాస్‌రెడ్డి, రైతు, మర్పల్లి

Updated Date - 2020-08-01T10:43:12+05:30 IST