చివరి దశకు.. పూర్తికావస్తున్న ఆర్థిక గణన

ABN , First Publish Date - 2020-12-16T04:53:27+05:30 IST

ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు వికారాబాద్‌ జిల్లాలో నిర్వహిస్తున్న ఆర్థిక గణనను ఈనెలాఖరులోగా ముగించేందుకు వేగం పెంచారు.

చివరి దశకు.. పూర్తికావస్తున్న ఆర్థిక గణన


  • ఇంటింటికీ వెళ్లి సమాచార సేకరణ..
  • స్మార్ట్‌ ఫోన్‌లో వివరాల నమోదు
  • సర్వే పూర్తయిన ఇంటికి జియో ట్యాగింగ్‌ 
  • 16 అంకెల ఎకనామిక్‌ సెన్సెస్‌ నంబర్‌ కేటాయింపు
  • ఏప్రిల్‌ 30లోగా పూర్తిచేయాల్సి ఉన్నా కొవిడ్‌ కారణంగా ఆలస్యం
  • డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తిచేసేలా లక్ష్యం


వికారాబాద్‌ జిల్లాలో ఆర్థిక గణన వేగం పుంజుకుంది. ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ప్రభావంతో కొంత విరామం వచ్చినా.. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో సర్వేను తిరిగి ప్రారంభించారు. ఈసారి డిజిటల్‌ పద్ధతిలో అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలో 368 గ్రామ పంచాయతీలు, 3 మునిసిపాలిటీల్లో ఆర్థిక గణన కొనసాగుతోంది.


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు వికారాబాద్‌ జిల్లాలో నిర్వహిస్తున్న ఆర్థిక గణనను ఈనెలాఖరులోగా ముగించేందుకు వేగం పెంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఆర్థిక గణన కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయింది. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరువాత మళ్లీ జూలైలో ప్రారంభించి కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఆర్థిక గణనను కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రణాళిక, గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపడుతున్నారు. ఇంతకుముందు 2013లో ఆర్థిక సర్వే నిర్వహించగా, 2020లో 7వ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడే ళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వే నిర్వహిస్తూ వస్తోంది. మారుతున్న కాలానికనుగుణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మెరుగుపడుతుందనేది తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగడనుంది. ఇంతకుముందు ఆర్థిక సర్వేలను మాన్యువల్‌ విధానంలో నిర్వహిస్తూ రాగా, ఈసారి మాత్రం డిజిటల్‌ పద్ధతిలో వివరాలను సేకరిస్తున్నారు. గతంలో కుటుంబ సభ్యుల వారీగా సేకరించిన వివరాలను ప్రింటెడ్‌ పేపర్‌పైన నమోదు చేస్తే, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలో నమోదు చేస్తున్నారు. నేషనల్‌ శ్యాంపుల్‌ సర్వే అధికారులు ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో ఈ గణన కొనసాగుతోంది. 

500పైగా జనాభా ఉన్న గ్రామాలను ఆర్థిక గణన నిర్వహించేందుకు ఎంపిక చేశారు. వికారాబాద్‌ జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు, 4మునిసిపాలిటీలు ఉన్నాయి. వాటిలో 368 గ్రామ పంచాయతీలు, 3 మునిసిపాలిటీలను ఎంపికచేసి ఆర్థిక గణన చేపడుతున్నారు. పంచాయతీలు, పట్టణాల్లో ఒక కుటుంబ ఆదాయం ఏ విధంగా ఉంది.. ఆ కుటుంబానికి ఏయే రూపాల్లో ఆదాయ వనరులు సమకూరుతున్నాయి.. దేనిపై ఎక్కువగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు తదితర అంశాలపై స్పష్టమైన సమాచారం తెలుసుకునేందుకు ఈ ఆర్థిక గణన చేపడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవన శైలి, నివాసం, ఆర్థిక వనరులు, వ్యాపార సముదాయాల వంటి వివరాలు సేకరించనున్నారు. ఒక్కో ఇంట్లో కుటుంబ యజమాని వివరాలతోపాటు ఆ కుటుంబంలో ఎంత మంది నివసిస్తున్నారు, వారిలో ఎవరెవరు ఏయే పనిచేస్తున్నారు. ఆధారపడిన వృత్తి, ఆదాయ మార్గాలు తదితర వివరాలను అంశాల వారీగా నమోదు చేస్తున్నారు. 


ఇంటి కో ఎకనామిక్‌ సెన్సెస్‌ నెంబర్‌

వికారాబాద్‌ జిల్లాలో 18 మండలాలు, 4 మునిసిపాలిటీలు ఉన్నాయి. ఇంతకు ముందు చేసిన సర్వే ప్రకారం జిల్లాలో 1,94,956 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 9,27,140 ఉండగా, వారిలో 4,63,350 మంది పురుషులు, 4,63,790 మంది మహిళలు ఉన్నారు. జిల్లా జనాభాలో గ్రామీణ జనాభా 8,02,171 ఉండగా, పట్టణ జనాభా 1,24,969 ఉంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి సేకరించే కుటుంబ సభ్యుల సమాచారాన్ని అక్కడికక్కడే స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆర్థిక సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో ఎన్యూమరేటర్లు తాము సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. సర్వే పూర్తి చేసిన ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. సర్వే చేసిన ప్రతి ఇంటికీ ప్రత్యేకంగా 16 అంకెలు కలిగిన ఎకనామిక్‌ సెన్సెస్‌ (ఈసీ) నంబర్‌ను కేటాయించి నమోదు చేస్తున్నారు. 


స్మార్ట్‌ఫోన్‌లో నమోదు

జిల్లాలో ఆర్థిక సర్వే నిర్వహించేందుకు 191 మంది ఎన్యూమరేటర్లు, 64 సూపర్‌వైజర్లను నియమించారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల వారీగా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను కేటాయించారు.  ఏప్రిల్‌ నెలాఖరులోగా ఈ ఆర్థిక గణన పూర్తి చేయాల్సి ఉండగా, కొవిడ్‌ కారణంగా తీవ్ర ఆలస్యం జరిగింది. డిసెంబరు నెలాఖరులోగా జిల్లాలో ఆర్థిక గణన పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 368గ్రామపంచాయతీల్లో మంగళవారం వరకు 352 గ్రామాల్లో సర్వే ముగిసింది. వికారాబాద్‌, తాండూరు, పరిగి మునిసిపాలిటీలను 9యూనిట్లుగా విభజించగా, వాటిలో 4యూనిట్లలో సర్వే పూర్తి చేశారు. ఇంకా 16 గ్రామపంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో 5యూనిట్లలో సర్వే పూర్తి చేయాల్సి ఉంది. ఈ సర్వే ద్వారా ప్రజలు ఏ రంగాలపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారనేది స్పష్టత రానుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులు, కూలీలు తదితరులు ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. ఈ సమాచారం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ఆయారంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయింపులు చేస్తుంది.

Read more