సంపూర్ణ పారిశుధ్యం వైపు అడుగులు

ABN , First Publish Date - 2020-12-18T04:16:34+05:30 IST

గ్రామాల్లో పారిశుధ్యంపై మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాయంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

సంపూర్ణ పారిశుధ్యం వైపు అడుగులు
కీసర మండలం రాంపల్లిదాయరలోని డంపింగ్‌యార్డులో చెత్తను వేరు చేసేందుకు నిర్మించిన గదులు

  • రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు 
  • తడి, పొడి చెత్తను వేరుచేసే విధానంపై అవగాహన
  • డంపింగ్‌యార్డుల్లో చెత్తను వేరు చేసేందుకు గదుల నిర్మాణాలు
  • స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు
  • పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు 


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : గ్రామాల్లో పారిశుధ్యంపై మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాయంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. జిల్లాను సంపూర్ణ పారిశుధ్యం దిశగా మార్చేందుకు అడుగులు వేస్తోంది. అందుబాటులో ఉన్న నిధులతో అన్ని గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. గ్రామాలవారీగా నెలకొన్న సమస్యలపై సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు జిల్లా పంచాయతీ శాఖ తగిన చర్యలు తీసుకుంటుంది. గ్రామాల్లో రోడ్లపై చెత్తవేయడం, బహిరంగ మల, మూత్ర విసర్జన చేసిన వారికి జరిమానాలు వేయాలని గ్రామపంచాయతీలు తీర్మానం చేశాయి. జిల్లాలో మొత్తం 15 రెవెన్యూ మండలాలకుగానూ ఐదు గ్రామీణ మండలాలు ఉన్నాయి. కీసర, శామీర్‌పేట్‌, మూడుచింతలపల్లి, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ మండలాల్లో మొత్తం 61 గ్రామపంచాయతీలున్నాయి. వీటిలో మేజర్‌ గ్రామపంచాయతీలతోపాటు చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో జనాభా రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. జనానికి అనుగుణంగా కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలావరకు గ్రామాల్లో చెత్త, చెదారం అంతా రోడ్డుపైనే వేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు సరిపడా డంపింగ్‌ యార్డులు, మురికికాలువలు లేవు. దీంతో మురుగునీరు, చెత్త రోడ్డుపై వచ్చి చేరుతోంది. పరిసర ప్రాంతాలన్నీ అపరిశుభ్ర నిలయాలుగా మారుతు న్నాయి. దీంతో ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారు. పలు పంచాయతీల్లోని కాలనీలకు రోడ్డు సౌకర్యం లేదు. ఈ మేరకు పంచాయతీ శాఖ అధికారులు రోడ్ల నిర్మాణానికి తగినచర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్‌ జిల్లాలో డంపింగ్‌యార్డులు లేకపోవడంతో చెత్తను ఖాళీప్రదేశాల్లో వేస్తున్నారు. పరిసర ప్రాంతాలు కలుషితమై దోమలు వ్యాప్తి చెంది ప్రజలు అంటురోగాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలోనే ప్రతి గ్రామానికి డంపింగ్‌ యార్డులు తప్పనిసరిగా ఉండాలని జిల్లాయంత్రాంగం నిర్ణయించింది. గ్రామాల్లో డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు స్థలాలను కేటాయించింది. సాధారణంగా పల్లెల్లో ఇంట్లో ఊడ్చిన చెత్తను మొత్తం కలిపి పారేస్తుంటారు. అలా కాకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఇనుము, ప్లాస్టిక్‌ వస్తువులను కూడా చెత్త నుంచి వేరు చేస్తున్నారు. తద్వారా గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం నెలకొంటుంది. ఈ విధానాన్ని జిల్లా యంత్రాంగం పలు గ్రామాల్లో పైలెట్‌ (ప్రయోగత్మకంగా)ప్రాజెక్టు కింద చేపట్టింది. తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం కొన్ని గ్రామ పంచాయతీల్లో విజయవంతం కావడంతో అన్నిచోట్ల అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుంది. గ్రామపంచాయతీలన్నింటిలో డంపింగ్‌ యార్డుల్లో చెత్తను వేరేచేసే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. 


సమగ్ర సమాచారంతో గ్రామాల వారీగా మ్యాపులు

ప్రతి గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన చిత్రపటాలను (మ్యాప్‌) రూపొందించింది. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామమకంఠం భూమి ఎంత ఉంది అన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు అవకాశాలున్నాయో గుర్తిస్తున్నారు. ఆటస్థలాలు, పార్కులు, ఇంకుడుగుంతల నిర్మాణాలను చేపట్టేందుకు అనువైన స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద శ్మశాన వాటికల వద్ద మొక్కలు నాటేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం మేడ్చల్‌ జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారంతో నిధులు వెచ్చించి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు 

గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉండేలా జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. అన్ని గ్రామపంచాయతీల్లో ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నాం. డంపింగ్‌యార్డుల్లో తడి, పొడి చెత్తతోపాటు ఇతర వస్తువులను వేరు చేసేందుకుగానూ ప్రత్యేక గదులు నిర్మిస్తున్నాం. మేడ్చల్‌ జిల్లాలోని అన్ని గ్రామాల్లోని డంపింగ్‌యార్డుల్లో నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. రోడ్లపై చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.

- పద్మజారాణి, డీపీవో 



Updated Date - 2020-12-18T04:16:34+05:30 IST