ధారూరు మార్కెట్‌లో ధర తక్కువ

ABN , First Publish Date - 2020-12-14T04:39:30+05:30 IST

ధారూరు మార్కెట్‌లో ధర తక్కువ

ధారూరు మార్కెట్‌లో ధర తక్కువ
ధారూరు మార్కెట్‌కు వచ్చిన ధాన్యం, మొక్కజొన్న బస్తాలు

వరి, మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం 

ధాన్యం నాణ్యత లేదంటూ ఖరీదుదారుల కొర్రీలు 

కొరవడిన అధికారుల అజమాయిషీ

ధారూరు: ధారూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వరి, మొక్కజొన్న ఉత్పత్తులను ఖరీదుదారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల కన్నా తక్కువకు రైతుల నుంచి వ్యాపారులు ఖరీదు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కమీషన్‌ ఏజెంట్ల వద్ద పంట పెట్టుబడుల కోసం అప్పులు తీసుకున్న, ఆన్‌లైన్‌లో పేర్లు లేని రైతులు తప్పని పరిస్థితుల్లో తమ పంటలను మార్కెట్‌లో అమ్ముకుంటున్నా రు. ఇదే అదునుగా భావించిన ఖరీదుదారులు నాణ్యత లేదనే సాకుతో వరి, మొక్కజొన్న ఉత్పత్తులకు ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత గల సరుకుకు కూడా మద్దతు ధర పెట్టడం లేదు. 

వరికి రూ.1640, మొక్కజొన్నకు రూ.1489

ధారూరు వ్యసాయ మార్కెట్‌లో శనివారం జరిగిన బీట్లలో మొదటి రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1640, రెండో రకానికి రూ.1500, మూడోరకం రూ.1350 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్రంగా మోసపోయారు. మొక్కజొన్న క్వింటాకు గరిష్ఠంగా రూ.1489, కనిష్ఠంగా క్వింటాకు రూ.1350 ధర పలికింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి రూ.1888, మొక్కజొన్న క్వింటాకు రూ.1850కి కొనుగోలు చేస్తున్నారు. ధారూరు మార్కెట్‌లో మాత్రం ధర రాక రైతులు నిండా మునుగుతున్నారు. ధరపై అధికారులకు అజమాయిషీ లేకపోవడంతో మార్కెట్‌లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు. 

తేమ గుర్తించే యంత్రాలేవి?

మార్కెట్‌లో ధాన్యం, మొక్కజొన్న సరుకు నాణ్యతను నిర్ధారించేందుకు వ్యాపారుల వద్ద తేమ యంత్రాలు లేవు. ఖరీదుదారులు ధాన్యాన్ని అర చేతిలో వేసుకుని నలపడం, మొక్కజొన్నను నోటిలో వేసుకుని కొరికి చూడటం వంటి పాత పద్ధతులను అవలంబించి ధర ను నిర్ణయిస్తున్నారు. ఖరీదుదారులు కుమ్మకై ధరలు తగ్గించి నిలువునా ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేం ద్రాల్లో యంత్రాలతో తేమ గుర్తిస్తున్నట్లే మార్కెట్‌లో కూడా  యం త్రాల ద్వారా నాణ్యత గుర్తించాలని  రైతులు కోరుతున్నారు. 

ఖాళీ సంచికి రూ.80 డిపాజిట్‌పై ఏడీకి రైతుల ఫిర్యాదు

ధారూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక్క ఖాళీ సంచికి రూ.80 డిపాజిట్‌  పెడితేనే సంచులు ఇస్తామంటున్నారని ధారూరు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని మార్కెటింగ్‌ ఏడీకి ఫిర్యాదు  చేశామని వారు తెలిపారు. ధాన్యం నింపేందుకు అవసరమైన ఖాళీ సంచులకు ఎక్కువ డిపాజిట్‌ వసూలు చేయడంపై ఆందోళన చెందుతున్నారు. తమ సంచుల్లో ధాన్యం నింపుకుని వస్తే సంచులను పల్టీ చేయడానికి ఒక్కో సంచికి రూ.5 చెల్లించాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయమని వారు ప్రశ్నించారు. లేదంటే  ఖాళీ సంచులు లేవని అంటున్నారని తెలిపారు.


Updated Date - 2020-12-14T04:39:30+05:30 IST