షాద్‌నగర్‌లో కలకలం

ABN , First Publish Date - 2020-04-01T11:25:14+05:30 IST

ఢిల్లీలోని నిజామొద్దీన్‌ ప్రాంత ంలోని మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన

షాద్‌నగర్‌లో కలకలం

ఢిల్లీలోని మర్కజ్‌లో మత ప్రచారానికి వెళ్లి వచ్చిన ముగ్గురిని గాంధీకి తరలింపు

కుటుంబ సభ్యులను రాజేంద్రనగర్‌ క్వారంటైన్‌ సెంటర్‌కు.. 

భయాందోళనలో పట్టణ ప్రజలు


షాద్‌నగర్‌/కొత్తూర్‌/నందిగామ: ఢిల్లీలోని నిజామొద్దీన్‌ ప్రాంత ంలోని మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ముగ్గురు అనుమానిత ముస్లింలను మంగళవారం ఉదయం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు మర్కజ్‌ వెళ్లినందున మరికొందరికి వైరస్‌ సోకే ప్రమాదముంది. దీంతో జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ వైద్య సిబ్బంది, పోలీసులను అప్రమత్తం చేశారు. వారిని గుర్తించి వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.


ఈ మేరకు పట్టణంలోని పటేల్‌రోడ్‌కు చెందిన ముగ్గురు ముస్లింలు మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లివచ్చినట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. వెంటనే షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌, వైద్యశాఖ ర్యాపిడ్‌ యాక్షన్‌ టీం అధికారి శ్రీనివాసులు నేతృత్వంలో వైద్య సిబ్బందితో పాటు షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ రామకృష్ణ, ఎస్సైలు కృష్ణ, విజయభాస్కర్‌, షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, జడ్పీటీసీ  వెంకట్రామిరెడ్డి, కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసు భద్రత మధ్య ఆ ముగ్గురిని  అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ మూడు కుటుంబాల్లో సుమారు 20మంది వరకు ఉంటారు. వారందరినీ కూడా ఓ డీసీఎంలో రాజేంద్రనగర్‌లోని జిల్లా క్వారంటైన్‌ సెంటర్‌కు పరీక్షల నిమిత్తం తరలించారు.


ఈ సందర్భంగా డిప్యూటీ డీఎం హచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌ మాట్లాడుతూ ఢిల్లీ నుంచి ఈ నెల 17న షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ముగ్గురు, నందిగామ మండలానికి చెందిన రెండు కుటుంబాలు వచ్చినట్లు సమా చారం అందిందని, వైద్య సిబ్బందితో విచారణ చేపట్టామని తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను సైతం రాజేంద్రనగర్‌లోని జిల్లా క్వారంటైన్‌ సెంటర్‌కు తరలిస్తున్నామని వివరించారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి 18న నందిగామ మండలంలోని జంగోనిగూడకు వచ్చిన నలుగురు వ్యక్తులకు వైద్యసిబ్బంది హోం క్వారంటైన్‌ విధించారు.


Updated Date - 2020-04-01T11:25:14+05:30 IST