భయం గుప్పిట్లో

ABN , First Publish Date - 2020-04-05T09:41:22+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన

భయం గుప్పిట్లో

కరోనా ప్రభావంతో విదేశాల్లో చిక్కుకుపోయిన జిల్లా వాసులు

బయటకు వెళ్లలేక.. స్వదేశానికి రాలేక అవస్థలు

భయాందోళనలో కాలం గడుపుతున్న వైనం


కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటికే అనేక దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. అయితే ఉన్నత చదువులు, ఉద్యోగ రిత్యా జిల్లా నుంచి వివిధ దేశాల్లో  స్థిరపడిన వారు అక్కడే చిక్కుకుపోయారు. వైరస్‌ విజృంభిస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.


ఆయా దేశాల్లో ఉండలేక  స్వదేశాలకు రాలేక ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నదాంతోనే కాలం గడుపుతున్నారు. బయటకు వెళ్తే ఎక్కడ వైరస్‌ బారిన పడతామోనని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. కుటుంబ సభ్యులు సైతం వారి రాక కోసం ఎదురుచూస్తున్నారు. 


దినదిన గండంలా ఉంది..విక్రమ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, న్యూయార్క్‌

దోమ: కరోనా అంటేనే నోటిమాట రాని పరిస్థితులు ఉన్నాయి. మాది వికారాబాద్‌ జిల్లా దోమ మండల పరిధిలోని బుద్లాపూర్‌ గ్రామం. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నాను. ఇక్కడి ప్రభుత్వ ఆదేశాలతో ఇంట్లో నుంచే పనిచేస్తున్నాం. హోటళ్లు, మాల్స్‌ మూసివేతతో ఆహారం కోసం ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా వ్యాప్తితో భయం గుప్పిట్లో బతుకుతున్నాం. ఈ నెల 4వ తేదీన సొంతూరికి రావాల్సి ఉంది. లాక్‌డౌన్‌తో  రాలేని పరిస్థితి.  తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడా. కరోనా ప్రభావం తగ్గి త్వరలోనే సాధారణ పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా.


క్షణక్షణం భయంతోనే..శివకుమార్‌గౌడ్‌, దిషిత, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, లండన్‌, కులకచర్ల: కరోనా వ్యాప్తితో క్షణక్షణం భయంతోనే గడుపుతున్నాం. మాది వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం తిర్మలాపూర్‌ గ్రామం. ప్రస్తుతం లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాను. మా పరిస్థితి దారుణంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన నెలకొంది. నిత్యావసర సరుకులకు కూడా బయటకు వెళ్లలని పరిస్థితి ఉంది. ఉన్నవాటితోనే సరిపెట్టుకుంటున్నాం. స్వగ్రామానికి రావాలన్నా రాలేని పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు మా గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 


ఇబ్బందులు పడుతున్నాం..గోటూరి అన్వే్‌షరెడ్డి, ఉద్యోగి, జర్మనీ షాద్‌నగర్‌ అర్బన్‌: కరోనా ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పడుతోంది. మాది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ రావిర్యాల గ్రామం. ప్రస్తుతం జర్మనీలోని బాడేన్‌ వుర్టెంబర్గ్‌ రాష్ట్రంలో గల ఆలేన్‌ నగరంలో ఉంటున్నాను. ఇక్కడ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. నేను ఉంటున్న రాష్ట్రంలో వేల మంది వ్యాధి బారిన పడ్డారు. బయటకు వెళ్లాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఏవైనా వస్తువులు తెచ్చుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నాం. 


బిక్కుబిక్కుమంటూనే..మల్గారి మహేందర్‌రెడ్డి, ఉద్యోగి, న్యూయార్క్‌ చేవెళ్ల:  ఏడు సం వత్సరాల క్రితం ఉన్న త చదువుల కోసం నూయార్క్‌ నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను. మాది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల మల్లారెడ్డిగూడ గ్రామం. కరోనాతో ఇక్కడి పరిస్థితి దారుణంగా ఉంది. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు  లాక్‌డాన్‌ విధించారు. మేము నలుగురు స్నేహితులం పక్కపక్క గదుల్లోనే ఉంటు న్నాం. అయినా బయటకు వచ్చి మాట్లాడుకునే పరిస్థితి లేదు. బయటకు వెళ్లి ఏవైనా వస్తువులు కొనాలన్నా భయాందోళన కలుగుతోంది. ఎక్కడ వైరస్‌ సోకుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాం. ఉన్నదాంట్లోనే సరిపెట్టుకుంటున్నాం. సొంత ఊరికి రావాలన్నా అవకాశం లేకుండా పోయింది. 

Updated Date - 2020-04-05T09:41:22+05:30 IST