అష్టదిగ్బంధం
ABN , First Publish Date - 2020-04-05T09:37:49+05:30 IST
రంగారెడ్డి జిల్లా చేగూర్ గ్రామంలో ఓ మహిళ కరోనా బారిన పడి మృతి చెందిన విషయం విధితమే. శనివారం కలెక్టర్ అమయ్‌కుమార్ గ్రామ సమీపంలోని కన్హా శాంతివనాన్ని

చేగూరును దిగ్బంధించిన అధికారులు
కరోనా సోకి మహిళ మృతితో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
కన్హా శాంతివనాన్ని సందర్శించిన కలెక్టర్ అమయ్‌కుమార్
గ్రామంలో వైద్య శిబిరం, సరిహద్దులో చెక్‌పోస్ట్ ఏర్పాటు
షాద్‌నగర్/నందిగామ: రంగారెడ్డి జిల్లా చేగూర్ గ్రామంలో ఓ మహిళ కరోనా బారిన పడి మృతి చెందిన విషయం విధితమే. శనివారం కలెక్టర్ అమయ్‌కుమార్ గ్రామ సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించారు. అక్కడ పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకున్న కలెక్టర్ శాంతివనంలో పనిచేసే కార్మికులను క్వారంటైన్లో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ మేరకు సుమారు 800 మంది కార్మికులను క్వారంటైన్ చేసినట్లు షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందూనాయక్ తెలిపారు.
వారి చేతులపై క్వారంటైన్ ముద్రలు వేసినట్లు వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చేగూర్ గ్రామ సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. అలాగే చందూనాయక్ నేతృత్వంలో గ్రామం నడిబొడ్డున వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 140 మంది ఆశావర్కర్లు, 58 మంది ఏఎన్ఎంలు తదితర వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామంలో మరెవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా..? అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరు అనారోగ్యంతో కనిపించినా... వెంటనే పరీక్షలు నిర్వహించాలని చందూనాయక్ సిబ్బందిని ఆదేశించారు.
పోలీసులు సైతం గ్రామానికి ఉదయమే చేరుకుని ఇతర వాహనాలను గ్రామంలోకి రాకుండా నియంత్రిస్తున్నారు. గ్రామస్థులు బయటకు వెళ్లకుండా, ఇతర గ్రామాల ప్రజలు చేగూర్ గ్రామంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. మహిళ మృతితో గ్రామం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.
షాద్‌నగర్ పట్టణంలోనూ చేగూర్ ఘటన భయాందోళనకు దారి తీసింది. ఇటీవల షాద్‌నగర్ పట్టణంలో ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించడం... తిరిగి చేగూర్ గ్రామంలో ఓ మహిళ మృతి చెందడం ఇక్కడి ప్రజలను భయకంపితులను చేస్తుంది. కరోనా వ్యాధి మరింత ప్రబల కుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అటు చేగూర్ ప్రజలతో పాటు షాద్‌నగర్ ప్రజలు కోరుతున్నారు.