నేటినుంచి పాఠ్యపుస్తకాల పంపిణీ

ABN , First Publish Date - 2020-07-22T10:12:15+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందనేది స్పష్టత రాకపోయినా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య

నేటినుంచి పాఠ్యపుస్తకాల పంపిణీ

దౌల్తాబాద్‌లో మంత్రి సబితారెడ్డి శ్రీకారం


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందనేది స్పష్టత రాకపోయినా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. విద్యా బోధనపై ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించిన విద్యాశాఖ ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించింది.  18 మండలాల పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాల్లో చాలావరకు వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. 1061 ప్రభుత్వ, ఎయిడెడ్‌, గురుకుల, మోడల్‌, కేజీబీవీ, ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి.


కొత్త విద్యాసంవత్సరంలో 5,90,390 పాఠ్య పుస్తకాలు అవసరమని గుర్తించగా, ఇంతవరకు 5,75,390 పాఠ్య పుస్తకాలు సరఫరా చేశారు. ఇంకా 15 వేలు సరఫరా కావాల్సి ఉంది. కాగా ఇదివరకే గురుకుల, మహాత్మా జ్యోతిరావు పూలే, మైనార్టీ గురుకుల, ఎస్టీ ఆశ్రమ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొనే కార్యక్రమాలకు పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు ఎక్కువ సంఖ్యలోనే హాజరవుతుంటారు. ఇలాంటి సమయంలో కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడమనేది ప్రశార్థకంగా మారుతోంది.


రవాణా ఖర్చులపై స్పష్టత కరువు

ఇదిలా ఉంటే, జిల్లా కేంద్రానికి సరఫరా చేసిన పాఠ్య పుస్తకాలను అక్కడి నుంచి మండల వనరుల కేంద్రాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేసేందుకు అయ్యే రవాణా ఖర్చులపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వలేదు. సరఫరా కోసం రూ.2లక్షలకుపైగా ఖర్చువుతుంది. ప్రతి ఏటా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. రవాణా ఖర్చుల విషయం తేల్చకుండానే నిర్ణీత గడువులోగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఏమి చేయాలో తెలియక అధికారులు తర్జభర్జన పడుతున్నారు.

Updated Date - 2020-07-22T10:12:15+05:30 IST