పేరుకే పెద్దాస్పత్రి..

ABN , First Publish Date - 2020-12-28T05:42:52+05:30 IST

పేరుకే పెద్దాస్పత్రి..

పేరుకే పెద్దాస్పత్రి..
తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి

  • సిబ్బందే లేరు!.. కీలక పోస్టులన్నీ ఖాళీ ప్రజలకు వైద్యమందేదెలా?
  • ఖాళీల భర్తీపై చొరవ చూపని వైనం  తాండూరు జిల్లా ఆస్పత్రిపై చిన్నచూపు

తాండూరు: ‘ప్రతి కుటుంబానికి ఓ ఫ్యామిలీ డాక్టర్‌ అన్నట్టు వైద్యసేవలందించాలి. ప్రతీ పౌరుడి ఆరోగ్య వివరాలను నమోదు చేయాలి. తెలంగాణను ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ప్రతీ వ్యక్తి హెల్త్‌ ప్రొఫైల్‌ ఉండాలి. ప్రజల వైద్య ఖర్చులకు వెనుకాడేది లేదు’ అని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. అయితే తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని రూ.7కోట్లతో ఏర్పాటు చేశారు. అందులో చాలా ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేసింది. నియామకమైన వారు ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడకపోవడమో మరే కారణమో తెలియదుగానీ ఖాళీలు మాత్రం భర్తీ కాలేదు. ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి పంపుతూనే ఉన్నారు.  


భారీగానే ఖాళీల జాబితా..

ప్రధాన పోస్టులు 28 ఖాళీలున్నాయి. నర్సులు, స్టాఫ్‌నర్సులు, నాల్గోతరగతి సిబ్బంది, టెక్నికల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆస్పత్రికి ప్రతిరోజు రెండు నుంచి మూడు వేల మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు. సరిపడినంతమంది వైద్యుల్లేక ప్రజలకు మెరుగైన సేవలందడం లేదు.


ఎక్కడెక్కడి నుంచో రోగులు..

తాండూరు ప్రాంతంలోని నాలుగు మండలాలు, పట్టణంతోపాటు సరిహద్దులోని కర్ణాటక ప్రాంతానికి చెందిన చించోళి, గుర్మిట్కల్‌ నియోజకవర్గాల నుంచి, కొడంగల్‌ నియోజకవర్గంలోని కొడంగల్‌, బొంరా్‌సపేట్‌, మద్దూరు మండలాల నుంచి నిత్యం రోగులు, డెలివరీలకు ఈ ఆస్పత్రికే వస్తుంటారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన రోగులూ వస్తుంటారు. రోజూ వేలాది మంది రోగులకు వైద్య సేవలందిస్తున్న ఈ ఆస్పత్రిలో ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేరోహిత్‌రెడ్డి ఖాళీల భర్తీకి ప్రత్యేక చొరవ చూపించాలని ప్రజలు కోరుతున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలందిస్తున్న జిల్లాస్పత్రిలో ఖాళీలను వెంటనే భర్తీచేసేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

Updated Date - 2020-12-28T05:42:52+05:30 IST