-
-
Home » Telangana » Rangareddy » Discussion in Tandoor Council
-
తాండూరు కౌన్సిల్‌లో రచ్చరచ్చ..
ABN , First Publish Date - 2020-12-29T04:40:56+05:30 IST
తాండూరు కౌన్సిల్‌లో రచ్చరచ్చ..

- నిబంధనలు పాటించాలంటూ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
- ఎజెండా ప్రతులను చింపేసిన సీపీఐ, కాంగ్రెస్, టీజేఎస్ కౌన్సిలర్లు
- కౌన్సిల్ హాల్‌లో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
- ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్సీ వర్గం
- ఎమ్మెల్సీతో వాదనకు దిగిన విపక్షాలు
- బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ కౌన్సిలర్ల బైఠాయింపు
- కౌన్సిల్‌లో బయటపడిన వర్గ విభేదాలు.. సమావేశం రసాభాస
తాండూరు : తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. సోమవారం చైర్‌పర్సన్‌స్వప్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రూపొందించిన ఎజెండా నిబంధనలకు విరుద్ధంగా ఉందని, చెత్త ఎజెండాగా అభివర్ణించారు. దీంతో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన అధికార పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే తీరును తప్పుబట్టి నిరసనకు దిగారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ కౌన్సిలర్లు ఏకంగా ఎజెండా పత్రులను కౌన్సిల్‌హాల్‌లో చించేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో ఎమ్మెల్సీ వర్గానికి చెందిన టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పోడియం వద్దకు వచ్చి ఎమ్మెల్యేతో వాదనకు దిగారు. ఒకవైపు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కూడా కౌన్సిల్‌లో ఆగ్రహంతో ఊగిపోయారు. కౌన్సిల్ సాక్షిగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఒకవైపు వాదనలు జరుగుతుండగానే, ఎజెండా అంశాలను ఆమోదిస్తున్నామని చైర్‌పర్సన్ పేర్కొన్నారు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే పది నిమిషాల్లోనే కౌన్సిల్ సమావేశం ముగించారు. వెంటనే కౌన్సిల్ హాల్‌లో నుంచి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, చైర్‌పర్సన్ స్వప్న బయటికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, విపక్ష పార్టీల కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్‌లోనే ఉండిపోయారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి డౌన్ డౌన్, చైర్‌పర్సన్ స్వప్న డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మున్సిపాలిటీ ఎదుట కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. తర్వాత బీజేపీ కౌన్సిలర్లు కూడా విపక్ష కౌన్సిలర్లతో కలిసి మున్సిపాలిటీ ఎదుట నిరసన చేపట్టారు. ఈనెల 23న కౌన్సిల్ సమావేశం పెట్టి ఏ కారణంచేత వాయిదా వేశారని కౌన్సిలర్లు సోంశేఖర్, అసీఫ్, శ్రీనివా్‌సరెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌లు కమిషనర్‌ను నిలదీశారు. అయితే తిరిగి సోమవారం సమావేశానికి గాను మరో ఎజెండాను తయారు చేసి అందులో తాండూరులో రోడ్ల మరమ్మతులకు సంబంధించి, మీ-సేవా సెంటర్‌లో ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు, పట్టణంలో ఎంట్రెన్స్ వద్ద స్వాగతతోరణాల దిమ్మెల ఏర్పాటు మూడు అంశాలను ఎజెండా నుంచి తొలగించారు. ఎట్టకేలకు రెండో ఎజెండా అంశాలను ఆమోదం తెలిపాయి. కౌన్సిల్ పనితీరు ఏకపక్షంగా ఎజెండా తయారీ అంశాలపై కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, టీజేఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రంలో 18 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి ఇవ్వడంతోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
టీఆర్‌ఎస్ కార్యకర్తల బాహాబాహీ
ఓవైపు తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడీగా జరుగగా, సమావేశం హాల్ ఎదుట ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన మక్సూద్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గానికి చెందిన నహీం ఒకరిపై ఒకరు నెట్టేసుకున్నారు. మున్సిపాలిటీ వద్ద కొద్దిసేపు ఉధ్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు గుమిగూడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పార్టీ సీనియర్లు ఇద్దరికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. చైర్‌పర్సన్ ఛాంబర్‌లో కూడా ఈ ఇరువర్గాలు గొడవపడ్డారు.
సమస్యలు పరిష్కరించాలి
యాలాల : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాండూరు నియోజకవర్గ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కు సోమవారం వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్ల ప్రొబెషనరీ కాలాన్ని రెండేళ్లకు కుదించి, రెగ్యూలర్ పేస్కేల్, సర్వీస్ బుక్‌తో అమలు చేసేలా కృషి చేయాలని కోరారు.