ప్రమాదాలకు నిలయంగా అజీజ్‌నగర్‌ చౌరస్తా

ABN , First Publish Date - 2020-11-27T04:51:58+05:30 IST

ప్రమాదాలకు నిలయంగా అజీజ్‌నగర్‌ చౌరస్తా

ప్రమాదాలకు నిలయంగా అజీజ్‌నగర్‌ చౌరస్తా
అజీజ్‌నగర్‌ చౌరస్తాలో ఇష్టానుసారం రోడ్డు దాటుతున్న వాహనదారులు

  • హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై డివైడర్‌ లేక నిత్యం ప్రమాదాలు
  • ఇష్టానుసారం రోడ్డు దాటుతున్న వాహనదారులు
  • రోడ్డుపైనే పార్కింగ్‌తో ట్రాఫిక్‌కు ఇబ్బందులు రెట్టింపు

మొయినాబాద్‌ రూరల్‌: అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల పట్టింపులేని ధోరణితో మండలంలోని అజీజ్‌నగర్‌ చౌరస్తా నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చౌరస్తా వద్ద ఉన్న దుకాణదారులు భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై అజీజ్‌నగర్‌ చౌరస్తా వద్ద డివైడర్‌ లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. డివైడర్‌ లేక వాహదారులు రోడ్డు మఽధ్యలో నుంచే ఇష్టం వచ్చినట్లు తిప్పుతుండడంతో ఇటు నగరం నుంచి వచ్చే వాహనాలతో పాటు మొయినాబాద్‌ నుంచి నగరానికి వెళ్లే వాహనాదారులకూ తిప్పలు తప్పడం లేదు. దీంతో రోజూ ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. అజీజ్‌నగర్‌ చౌరస్తాపై గతంలో డివైడర్‌ ఉండేది. రోడ్డు మరమ్మతుల కోసం అధికారులు రోడ్డు కొంతమేర ఎత్తుపెంచారు. దీంతో ఉన్న డివైడర్‌ బీటీలో కూరుకుపోయింది. దాని స్థానంలో కొత్తగా ఎత్తు పెంచి మరో డివైడర్‌ను నిర్మిచంలేదు. దీంతో వాహనాదారులు ఇష్టారాజ్యంగా వాహనాలు మలుపుతున్నారు. 

రోడ్డుపైనే వాహనాల పార్కింగ్‌

అజీజ్‌నగర్‌ చౌరస్తా రద్దీగా ఉండే ప్రదేశం. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి కావడంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలను సాగిస్తుంటారు. అజీజ్‌నగర్‌ చౌరస్తాపై హోటళ్లతో పాటు పలు వ్యాపార సమూహాలు ఉన్నాయి. దుకాణాలకు వచ్చే కొనుగోలుదారులు తమ కార్లు, బైక్‌లను రోడ్డుకు ఆనుకునే నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వ్యాపార సముదాయాల నిర్వాహకులు వారి షాపుల ఎదుట వాహన పార్కింగ్‌కు స్థలం కేటాయించక హైవే ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డివైడర్‌ లేకపోవడం, రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌తో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. రెండు ప్రధాన హోటళ్లు ఈ చౌరస్తాపైనే ఉండడంతో అక్కడ మొత్తం రద్దీగా ఉంటోంది. అయితే ఈ హోటళ్లకు వచ్చే ప్రజల వాహనాలకు పార్కింగ్‌ లేకపోవడం చాలా ఇబ్బందిగా మారుతోంది. సెల్లార్‌ పార్కింగ్‌ ఉన్నా ఎక్కువ మంది వాహనదారులు రోడ్డుపైన వాహనాలను నిలిపివేస్తున్నారు. పోలీసు అధికారులు హోటల్‌ యాజమనులపై చర్యలు తీసుకొని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. 

చౌరస్తాలో వెంటనే డివైడర్‌ను నిర్మించాలి

అజీజ్‌నగర్‌ చౌరస్తా అత్యంత రద్దీ ప్రాంతం. ఇక్కడ డివైడర్‌ లేక ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు తమ వాహనాలను రోడ్డు మధ్యలో నుంచి ఇష్టం వచ్చినట్లు మలుపుతుండడం ప్రమాదాలకు కారణమౌతోంది. అంతే కాకుండా హోటళ్లకు వచ్చే వాహనాలను పార్కింగ్‌ సౌకర్యం  హోటళ్ల యజమాన్యం కల్పించుకోవాలి. అధికారులు స్పందించి ఇక్కడ వెంటనే డివైడర్‌ను నిర్మించి ప్రమాదాలను నివారించాలి.

- శ్రీనివా్‌సరెడ్డి, అజీజ్‌నగర్‌ 

Updated Date - 2020-11-27T04:51:58+05:30 IST