పాడైన రోడ్ల పనులు పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2020-09-01T08:33:11+05:30 IST
ఇటీవల వికారాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు పాడైన రోడ్లు, తెగిన వంతెనల

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : ఇటీవల వికారాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు పాడైన రోడ్లు, తెగిన వంతెనల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహబూబ్‌నగర్- చించోలి రోడ్డుకు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయగా, వర్షాలకు పాడైన రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.5.20 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారని తెలిపారు.
రూ.52 కోట్లతో చేపట్టిన తాండూరు రోడ్డు పనుల్లో అసంపూర్తిగా మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆమె అఽధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు మార్గంలో రూ.15 కోట్లతో నిర్మిస్తున్న మూడు బ్రిడ్జిల్లో ఒకటి పూర్తికాగా, మరో రెండు బ్రిడ్జిల పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో పనుల్లో జాప్యం చోటు చేసుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్- తాండూరు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.
కాగ్నా నది వద్ద తాత్కాలికంగా రూ.9 లక్షలతో పనులు చేపట్టి వాహనాల రాకపోకలు కొనసాగేలా చేశామని, జీవన్గి వద్ద రూ.1.25 కోట్లు, నాగసమందర్ వద్ద తాత్కాలిక పనులకు రూ.33 లక్షలు, బ్రిడ్జి నిర్మాణానికి రూ.9 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించగా, రూ.1.80 కోట్లతో కొత్తగా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుకు 1.2 కిలోమీటర్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని వివరించారు. కరోనా విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో భారీ వర్షాలు కురిసి నష్టం వాటిల్లిందని చెప్పారు. జిల్లాలో ఇది వరకు ప్రారంభమైన 97 రైతు వేదికల పనులు ఈనెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆమె ఆదే శించారు.
పంట నష్టంపై మంత్రి ఆరా..
వర్షాలకు జరిగిన పంట నష్టంపై మంత్రి సబితారెడ్డి ఆరా తీశారు. పంటల వారీగా సమగ్ర నివేదిక రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు ఎవరైనా రైతుబీమాలో నమోదు కాకపోతే ఏఈవోల వద్ద తమ వివరాలు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, కలెక్టర్ పౌసుమిబసు, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కొప్పుల మహేష్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, టీఎస్‌ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, జడ్పీ వైస్‌చైర్మన్ విజయకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య పాల్గొన్నారు.
నేటి నుంచి ప్రారంభమయ్యే ఆన్‌లైన్ తరగతులకు విద్యార్థులు, తల్లిదండ్రులు సిద్ధం కావాలని మంత్రి సబితా అన్నారు. టీవీలో ప్రసారమయ్యే పాఠాలను పిల్లలు తప్పనిసరిగా వినేలా తల్లిదండ్రులు చొరవచూపాలన్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకుని రోజువారీ చదువులు ఎలా కొనసాగుతున్నాయనేది పరిశీలించాలన్నారు. కాగా ధారూరు మండలం మన్‌సాన్‌పల్లి వాగు వద్ద వరద ఉధృతికి తెగిన వంతెనను మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిశీలించారు. వాహనాల రాకపోకల పునరుద్ధరణకు వీలుగా వంతెన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.