-
-
Home » Telangana » Rangareddy » cylinder gas prices story
-
వంటగ్యాస్ బాదుడు
ABN , First Publish Date - 2020-12-20T04:34:32+05:30 IST
వంటగ్యాస్ బాదుడు

- పేద, మధ్యతరగతి వర్గాల నడ్డివిరుస్తున్న ప్రభుత్వం
- ఒక్క నెలలోనే మూడుసార్లు గ్యాస్‌ధరలు పెంపు
- విలవిల్లాడుతున్న సామాన్య ప్రజలు
ఘట్‌కేసర్ రూరల్: కేంద్రప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరుస్తోంది. కరోనాతో ఉపాధిలేక విలవిల్లాడుతున్న సామాన్యులు పెరిగిన గ్యాస్ ధరలతో విసిగిపోతున్నారు. నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్‌ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పేదలకు వంట గ్యాస్ అందించడమే లక్ష్యమని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం గ్యాస్ ధరలను అమాంతం పెంచి సామాన్యుడు వంట చేసుకోలేని పరిస్థితుల్లోకి నెట్టింది. గ్యాస్‌ధరలు పెంచుతుండటంతో పేద, మద్యతరగతి వర్గాల ప్రజలు తిరిగి పాత పద్ధతిలో కట్టెలపొయ్యిపై వంట చేసుకునే రోజులు వస్తాయేమోనని వాపోతున్నారు. ప్రభుత్వాలు ఒకవైపు పెట్రోల్, డీజిల్, మరోవైపు వంటగ్యాస్ ధరలు పెంచి పబ్బం గడుపుకుంటూ తమకు మోయలేని భారాన్ని నెత్తిన పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటగ్యాస్ సబ్సిడీసైతం ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నదని మహిళలు వాపోతున్నారు. ఈనెలలోనే వంటగ్యాస్ మూడుసార్లు పెరిగింది. ఈనెల మొదటి వారంలో రూ.646ఉండగా మరుసటి వారంలో రూ.696 అయింది. ప్రస్తుతం గ్యాస్‌ధర రూ.746.50పైసలకు అమాంతం పెంచేశారు. ఇందులో సబ్సీడి రూ.140 రావాల్సివుండగా నెలరోజులు గడుస్తున్న సబ్సిడీ మాత్రం రాలేదు. అప్పుచేసి గ్యాస్ కొనుగోలు చేస్తే సకాలంలో సబ్సిడీ అందక ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్‌ను ఉచితంగానే ఇస్తున్నప్పటికీ నెలనెలా గ్యాస్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రం ధరలు తడిసిమోపెడవుతున్నాయని సామాన్యప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
ధరలు ఆకాశాన్నంటుతున్నాయి: మడ్డి లతవెంకటేష్‌గౌడ్, గృహిణి, పంచాయతీ సభ్యురాలు, మర్రిపల్లిగూడ
వరుసగా పెరుగుతున్న వంటగ్యా్‌సతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నెలలో మూడుసార్లు గ్యాస్‌ధరలు పెంచారు. ఇలా పెంచుతూపోతే గ్యాస్‌పై వంట చేయడం కష్టంగా మారుతోంది.. ఇప్పటికైనా ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను తగ్గించి పేద, మద్య తరగతి ప్రజలను ఆదుకోవాలి.
గ్యాస్‌సబ్సిడీ సకాలంలో రావడంలేదు: నార్కెట్‌పల్లి సబిత, సీఐటీయూ నాయకురాలు
వంటగ్యాస్ సబ్సిడీ సకాలంలో బ్యాంక్‌లో జమకావడం లేదు. ప్రారంభంలో గ్యాస్‌సబ్సిడీ రెండు, మూడు నెలలు సకాలంలో బ్యాంక్‌లో జమ చేశారు. కానీ ప్రస్తుతం నెలరోజుల నుంచి సబ్సిడీ జమకావడం లేదు. నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్‌ధరలను పెంచి తీవ్రఇబ్బందులకు గురిచేస్తున్నారు.
కనెక్షన్లు ఉచితంగా ఇచ్చి ఏం ప్రయోజనం? : కళ్లె శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్ పంపిణీ చేస్తోంది. మరోవైపు గ్యాస్‌ధరలు పెంచి సిలిండర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెంచిన గ్యాస్ ధరలతో పేద, మద్య తరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సివస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధిచెప్తారు. కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యులు పెంచిన గ్యాస్‌ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయి.