ఎడాపెడా కోతలు

ABN , First Publish Date - 2020-05-30T09:18:43+05:30 IST

అసలేవేసవి. మండుటెండలకు తోడు ఉక్కపోతతో జనం ఓవైపు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అప్రకటిత విద్యుత్‌ కోతలు మరింత

ఎడాపెడా కోతలు

తాండూరులో గంటలతరబడి కరెంటు కోతలు 

ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం


తాండూరు : అసలేవేసవి. మండుటెండలకు తోడు ఉక్కపోతతో జనం ఓవైపు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అప్రకటిత విద్యుత్‌ కోతలు మరింత ఇబ్బం దులపాలు చేస్తున్నాయి. తాండూరులో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు వేళాపాళా లేకుండాఎడాపెడా కరెంటు కోతలు విధించారు. దీంతో ఉక్కపోత తట్టుకోలేక ఆరుబయటికి కొందరు రాగా, మరికొందరు ఇంటి మిద్దెలపై వెళ్లిపడుకున్నారు.


ఒకలైన్‌ కరెంటు ఉంటే మరో లైన్‌ ఉండటం లేదు. శుక్రవారం ఉదయం కూడా కరెంటు కోత విధించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 2.30 గంటల వరకు అంతరాయం ఏర్పడింది. పగటి సంగతి ఎలా ఉన్నా రాత్రివేళ మాత్రం విద్యుత్‌ అంతరాయం కలిగించొద్దని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, పెద్దేముల్‌ మండలంలో మధ్యాహ్నం ప్రతి అరగంటకోసారి విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ఇష్టానుసారంగా ఎల్‌సీలు తీసుకుని ప్రైవేటు వ్యక్తుల సేవల్లో మునిగి తేలుతున్నారు. మండల ఏఈ తన వద్ద ఉన్న డిపార్ట్‌మెంట్‌ ఫోన్‌ను అసలు ఎత్తరని ప్రజలు నేరుగా శుక్రవారం కొండాపూర్‌లో ప్రజలు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.


విద్యుత్‌ ఎన్నిసార్లు అంతరాయం ఏర్పడుతుందో తెలియని పరిస్థితి. లైన్‌మెన్‌ వచ్చి తరచూ విద్యుత్‌ లైన్లపై చెట్టుకొమ్మలు పడ్డాయని, 33 కేవీలో ఇన్‌కమింగ్‌ పోయిందని సమాధానం ఇస్తున్నారు. మం డల జనరల్‌ బాడీ సమావేశంలో కూడా పలువురు ప్రజా ప్రతినిధులు పెద్దేముల్‌ విద్యుత్‌ శాఖ ఏఈ వైఖరిని తప్పుబట్టినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. తాండూరులో ఏఈ, ఏడీ, డీఈ వంటి అధికారులు ఉన్నప్పటికీ సకాలంలో విద్యుత్‌ సరఫరాను అందించలేకపోతున్నారు. 


తాండూరులో 42 డిగ్రీలో ఉష్ణోగ్రత నమోదు

తాండూరులో ఎండ వేడిమి తీవ్రంగా ఉంది. శుక్రవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయంనుంచే ఎండ తీవ్రత పెరుగుతూ సాయంత్రం 6 గంటలు దాటినా వేడి తగ్గడం లేదు.  దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. ప్రధాన వీధుల్లో జన సంచారం పెద్ద లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Updated Date - 2020-05-30T09:18:43+05:30 IST