కొవిడ్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-06-16T10:10:07+05:30 IST

కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ రోజురోజుకూ

కొవిడ్‌ పరీక్షలు

నేటి నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో షురూ.. 

18 వేల మందికి టెస్టులు చేసే అవకాశం 

కరోనా ప్రభావిత ప్రాంతాలు, కంటైన్‌మెంట్‌ జోన్లకు ప్రాధాన్యం

అధికారులు, ల్యాబ్‌టెక్నీషియన్లకు పూర్తయిన ట్రైనింగ్‌ 

నమూనాల సేకరణకు నోడల్‌ పాయింట్ల గుర్తింపు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ ప్రతినిధి) : కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు తీవ్రమవుతున్నాయి. ఈనేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇందులోభాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 18వేల వరకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 6 నుంచి 8 వేలు, మేడ్చల్‌ జిల్లాలో ఏడు వేలు, వికారాబాద్‌ జిల్లాలో 3వేల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాలు, కంటైన్‌మెంట్‌ జోన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. నమూనాల సేకరణకు నోడల్‌ పాయింట్లను గుర్తించారు. అధికార యంత్రాంగం  ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ల్యాబ్‌టెక్నీషియన్లకు ట్రైనింగ్‌ ఇచ్చారు. నేటి నుంచి నమూనాలను సేకరించనున్నారు. 


రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌ శేరిలింగంపల్లి, చేవెళ్ల, కల్వకుర్తి, షాద్‌నగర్‌ నియోజవర్గాల్లో 6 నుంచి 8 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఒక్కో నియోజవర్గంలో సుమారు 800 మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రానున్న వారం పది రోజుల్లో కరోనా వైర్‌సను కంట్రోల్‌ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎల్బీనగర్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల నియోజకవర్గాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలోని ల్యాబ్‌టెక్నీషియన్లకు ట్రైనింగ్‌ ఇచ్చారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారు. ఎక్కడెక్కడ తిరిగారనే విషయాలను తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. బాలాపూర్‌, జల్‌పల్లి, పహాడిషరీఫ్‌, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లో ఎక్కువ నమూనాలను సేకరించాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నుంచి జాబితాను సేకరిస్తున్నారు. కరోనా పరీక్షల్లో భాగంగా ఇంటింటికీ తిరిగి నమూనాలు తీయడం సాధ్యమయ్యే పని కాదు. దీంతో జిల్లాలోని కొన్నిచోట్ల కరోనా నోడల్‌ పాయింట్లను ఎంపిక చేశారు. కొండాపూర్‌, వనస్థలిపురం, బాలాపూర్‌, చేవెళ్ల, రాజేంద్రనగర్‌, నార్సింగిలోని గండిపేట ప్రాథమిక కేంద్రాల్లో నమూనాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి (మంగళవారం) నమూనాలను సేకరించాలని నిర్ణయించారు. కరోనా టెస్టులు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతికోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో త్వరలో పరీక్షలు జరగనున్నాయి. 


వికారాబాద్‌ జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో 3 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండగా, ఒక్కో నియోజకవర్గం పరిధిలో వెయ్యి మంది వరకు పరీక్షలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలకు, కాంటాక్టుల కాలనీలు, గ్రామాలకు పరీక్షల్లో ప్రాధాన్యమిస్తారు. రానున్న వారం, పది రోజుల్లో జిల్లాలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం.. ఇక్కడ నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించే బాధ్యత ప్రభుత్వ పరంగా నిర్వహిస్తారా ? లేక ఏదైనా ప్రైవేట్‌ ఆసుపత్రి, ల్యాబ్‌లకు అప్పగిస్తారా అనేది ఇంకా తెలియలేదు.


వికారాబాద్‌ జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మొదటి విడతలో వికారాబాద్‌లో ఎక్కువ కేసులు నమోదు కాగా, రెండో విడతలో పరిగి నియోజకవర్గంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ 4 నుంచి 19వ తేదీ వరకు మొదటి విడతలో జిల్లాలో 38 కేసులు నమోదు కాగా, గత నెలాఖరు నుంచి ఇప్పటివరకు జిల్లాలో మరో 10 కేసులు నమోదయ్యాయి. మొదటి విడతలో వికారాబాద్‌ పట్టణంలోనే 31 పాజిటివ్‌ కేసులు రాగా, తాండూరులో 4, పరిగిలో 2, మర్పల్లిలో ఒక కేసు నమోదైంది. ఈ కేసుల్లో ఒకరు మృతిచెందగా, మిగతా 37 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. కాగా, రెండో విడతలో కులకచర్ల మండలం, బండివెల్కిచర్లలో 3, దోమ మండలం, దొంగ ఎన్కేపల్లి, ధారూరు మండలం, గట్టేపల్లి, తాండూరుల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది. కాగా, మహారాష్ట్ర నుంచి సొంత గ్రామమైన యాలాల్‌ మండలం, దౌల్తాపూర్‌కు తిరిగి వచ్చిన వలసకూలీల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ వ్యక్తులకు సంబంధించిన కాంటాక్టుల వివరాలు సేకరించి వారిని హోంక్వారంటైన్‌లో ఉంచారు. రోజూ వారి ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారు. కొన్నిరోజులుగా కరోనా లక్షణాలు కనిపించిన వారి నుంచి మాత్రమే నమూనాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. 


మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలోనూ కరోనా ప్రభావం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు ప్రధాన కేంద్రాల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేసేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కరోనా వ్యాధి విస్తరించకుండా పాజిటివ్‌ నమోదైన వ్యక్తి కాంటాక్టు అయిన వారందరికీ కూడా ఇక నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలోని రామాంతాపూర్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కూకట్‌పల్లి పీహెచ్‌సీల పరిధిలో మంగళవారం నుంచి కొవిడ్‌-19 పరీక్షలు చేయనున్నారు. అదేవిధంగా కరోనా పరీక్షలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ చేసుకోవచ్చని నిర్ణయించారు. జిల్లాలోని అపోలో, వింటా, బయోగ్నోసిస్‌,  తదితర ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పరీక్షల నిర్ధారణ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ ల్యాబ్‌ల్లోనూ నేటి నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వైద్య శాఖ అధికారులు సంబంధిత వైద్యులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ మార్గదర్శకాలను వివరించారు. జిల్లాలో ఒక ఏరియా ఆస్పత్రి, రెండు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. కొవిడ్‌-19 పరీక్షలు ఎవరెవరికి చేయాలి? నమూనాలు ఎలా సేకరించాలన్న దానిపై వైద్యులకు అవగాహన కల్పించారు. ఈ పరీక్షల నిర్వహణకు పీహెచ్‌సీలో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లాలో గుర్తించిన ఆస్పత్రుల్లో పరీక్షల నిమిత్తం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 


పరీక్షలకు వైద్యాధికారుల అనుమతి తప్పనిసరి

విపరీతంగా జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉన్నట్లయితే వారిని కరోనా అనుమానితులుగా గుర్తిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు ముందుగా స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారులను సంప్రదించాలి. వీరు కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనుమానించి, పరీక్షలు చేయాలని సంబంధిత అధికారులకు రెఫర్‌ చేయాల్సి ఉంటుంది. వీరంతా కూడా అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చు. నేరుగా వెళ్లి పరీక్షలు చేసుకునే వీలులేదని వైద్యాధికారులు వెల్లడించారు.  


ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లకు అనుమతి

ఇదిలా ఉంటే, ప్రైవేట్‌ ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. కరోనా నిర్థారణ పరీక్ష నిర్వహించడానికి రూ.2,200 ఫీజుగా నిర్ణయించింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరే వారికి ఐసోలేషన్‌కు (ఒక్కరోజు) రూ.4వేలు, వెంటిలేటర్‌ లేకుండా ఐసీయూ సదుపాయానికి రూ.7,500 వేలు, వెంటిలేటర్‌తో ఐసీయూ సదుపాయం కోసం రూ.9 వేలు చార్జీలుగా నిర్ణయించింది. 

Updated Date - 2020-06-16T10:10:07+05:30 IST