రంగారెడ్డిలో రోజురోజుకు కోరలు చాస్తున్న కరోనా!

ABN , First Publish Date - 2020-05-11T15:58:44+05:30 IST

రంగారెడ్డి : జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి మరింత పెరుగుతుంది. చాపకింద నీరులా విజృంభిస్తున్న ఈ మహమ్మారిని

రంగారెడ్డిలో రోజురోజుకు కోరలు చాస్తున్న కరోనా!

రంగారెడ్డి : జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి మరింత పెరుగుతుంది. చాపకింద నీరులా విజృంభిస్తున్న ఈ మహమ్మారిని అరికట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనావ్యాప్తి ఆగడం లేదు. రోజు రోజుకు కోరలు చాస్తున్న కరోనా భూతానికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో తాజాగా ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో సరూర్‌నగర్‌లోని జేబీకాలనీకి చెందిన డయాలసిస్‌ రోగి(78) మృతి చెందాడు. మృతుడి కుమారుడి నమూనాలు సేకరించగా అతనికి పాజిటివ్‌గా తేలింది.


అలాగే సరూర్‌నగర్‌ విజయపురి కాలనీకి చెందిన ఓ కుటుంబంలో ఇప్పటికే ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా కుటుంబ సభ్యుల నమూ నాలు తీసి ల్యాబ్‌కు పంపించగా అతని ఇంట్లో నాలుగేళ్ల బాలుడికి పాజిటివ్‌గా తేలింది. వనస్థలిపురంలోని హిల్‌ కాలనీలోఇప్పటికే కరోనా వైరస్‌ సోకిన మహిళ నుంచి డ్రైవర్‌కు ఇతని భార్యకు కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. మొత్తం జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 99కి చేరుకుంది. 


ఉమ్మడి జిల్లాలో 217 కేసులు..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 217 కేసులు నమోదయ్యాయి. వీరిలో 12 మంది మృతి చెందారు. మృతుల్లో రంగారెడ్డిలో 5, మేడ్చల్‌లో 6, వికారాబాద్‌లో ఒకరున్నారు. పాజిటివ్‌ కేసుల్లో రంగారెడ్డిలో 99, మేడ్చల్‌లో 80, వికారాబాద్‌లో 38 ఉన్నాయి. 


వనస్థలిపురంలో ఇంటింటి సర్వే..

జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదైన వనస్థలిపురంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. వంద మంది ఆరోగ్య కార్యకర్తలు జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3,800 మంది వివరాలను సేకరించారు. ఇంట్లో కుటుంబసభ్యులు ఎంత మంది ఉన్నారు.. వారు చేసే పని, ఎక్కడికైనా వెళ్లి వచ్చారా? ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారా? వంటి వివరాలను సేకరించారు.

Updated Date - 2020-05-11T15:58:44+05:30 IST