కరోనాతో మరో నలుగురు మృతి.. ఆ యువకుడికి కరోనా ఎలా వచ్చిందో ఆరా తీస్తే..
ABN , First Publish Date - 2020-06-11T18:44:29+05:30 IST
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతోంది. బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరో నలుగురు బలయ్యారు.

ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 43 కేసులు నమోదు
అత్యధికంగా మేడ్చల్‌లో 25, రంగారెడ్డిలో 17, వికారాబాద్‌లో ఒకరు
రంగారెడ్డి (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతోంది. బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరో నలుగురు బలయ్యారు. ఇందులో మేడ్చల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా, రంగారెడ్డిజిల్లాలో ఒకరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 28కి చేరుకుంది.
43 కేసులు నమోదు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 25 కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. అందులో బాలాపూర్‌లో 2, ఇబ్రహీంపట్నంలో 1, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 2, నార్సింగిలో 3, సరూర్‌నగర్‌లో 3, ఆమనగల్లులో 2, మహిళార్‌దేవ్‌పల్లిలో 1, శేరిలింగంపల్లిలో 2, షాబాద్‌లో ఒక కొత్త కేసు నమోదైంది. అలాగే వికారాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు కేసుల సంఖ్య 734 చేరుకుంది. ఇందులో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 410, మేడ్చల్ జిల్లాలో 276, వికారాబాద్ జిల్లాలో 48 కేసులున్నాయి.
ఆమనగల్లులో మరో రెండు..
ఆమనగల్లు పట్టణంలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈనెల 7న శ్రీకాంత్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విధితమే. దీంతో ఆయన కుటుంబసభ్యులు, కోనాపూర్‌లోని నలుగురు బంధువులు, బాధితుడికి వైద్యం చేసిన డాక్టర్‌తో కలిపి మొత్తం 16మంది నుంచి మంగళవారం ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు గాంధీకి పంపించారు. బుధవారం కరోనా సోకిన వ్యక్తి భార్యకు, అతని అన్న కుమారుడికి పాజిటివ్ వచ్చినట్లు పరీక్షల్లో తేలిందని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ బాల నరేంద్ర తెలిపారు. వీరిని 108లో గాంధీకి తరలించారు.
కరోనా చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
శంకర్‌పల్లి మండలం రావులపల్లికి చెందిన ఓ వ్యక్తి (48) కరోనా సోకి గాంధీలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. ఇతను గ్రా మంలో ఆటోడ్రైవర్‌గా పని చేస్తూ ప్రతిరోజూ నగరంలోని గుడిమాల్కపూర్ మార్కెట్‌కు పూలు తీసుకవెళ్లేవాడు. ఈక్రమంలో ఈనెల 3న కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో మరో కేసు
వికారాబాద్ జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా నుంచి విముక్తి పొందిన తర్వాత మళ్లీ జిల్లాలో తొమ్మిది పాజిటివ్ కేసులు రాగా, బుధవారం మరో కేసు నమోదైంది. దోమ మండలం దొంగఎన్కేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఇంతవరకు కులకచర్ల మండలం, బండి వెల్కిచర్లలో ముగ్గురు, తాండూరులో ఇద్దరు, ధారూరు మండలం గట్టేపల్లిలో ఒకరు, యాలాల్ మండలం దౌలాపూర్‌లో ముగ్గురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దొంగ ఎన్కేపల్లిలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి సంబంధించి 90మంది కాంటాక్టులను గుర్తించిన అధికారులు వారిని హోంక్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న డాక్టర్ మునీబ్, ఎస్‌ఐ సురేష్ గ్రామంలో పర్యటించారు.
గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో...
గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో ఒక కరోనా కేసు నమోదైంది. కె.వి.రెడ్డినగర్‌కు చెందిన ఓ యువకుడి(24)కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఓ అపార్ట్‌మెంటులో నివాసం ఉండే సదరు యువకుడు నగరంలోని ఓ వర్క్‌షాప్‌లో పనిచేస్తుండేవాడు. యువకుడి సోదరుడు(32) ఓ ప్రయివేటు సంస్థలో పనిచేస్తుండగా అతనితోపాటు పనిచేసే ఓ వ్యక్తికి కరోనా రావడంతో అనుమానంతో అతను కూడా ఈ నెల 7న తమ్ముడిని వెంట పెట్టుకుని ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. మరుసటిరోజు యువకుడికి(24) తుమ్ములు, దగ్గు రావడంతో అతనికి కూడా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అన్న వైద్య పరీక్షల నిమిత్తం తమ్ముడు ఆసుపత్రికి వెళ్తే కరోనా సోకింది. యువకుడికి కరోనా ఎలా సోకిందని ఆరా తీయగా యువకుడు(24) పనిచేసే వర్క్‌షాప్‌లో గతంలో ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్లు తెలిసింది. దీనితో అప్రమత్తమైన అధికారులు కె.వి.రెడ్డినగర్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అపార్ట్‌మెంట్‌కు వెళ్లే దారిని మూసివేశారు.