కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-06-18T10:09:40+05:30 IST

కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిత్యం కొవిడ్‌-19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి.

కరోనా ఉధృతి

అనూహ్యంగా పెరుగుతున్న కేసులు

కరోనాతో రంగారెడ్డిలో ఒకరి మృతి

ఒక్కరోజే 45 కేసులు నమోదు

ఉమ్మడి జిల్లాలో 994కు చేరుకున్న బాధితులు


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ / ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి/ ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ / కొడంగల్‌/ షాద్‌నగర్‌/ పరిగి : కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిత్యం కొవిడ్‌-19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఒక్కరోజే 45పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్య ధికంగా మేడ్చల్‌జిల్లాలో 23 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిజిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. షాద్‌నగర్‌ పట్టణంలోని క్రిష్టియన్‌కాలనీకి చెందిన 43 ఏళ్ళ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపింది.


ఈ నెల 13న స్థానిక క్రిష్టియన్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం విధితమే. అయితే బుధవారం కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి సదరు వ్యక్తితో కలిసి కారులో ప్రయాణించాడని, దీంతో అతనికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అలాగే సరూర్‌నగర్‌లో 6, నార్సింగిలో 2, షాద్‌నగర్‌ 3, మహిళార్‌దేవ్‌పల్లి 4, శేరిలింగంపల్లిలో 3 కేసులు నమోద య్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 994కి చేరుకుంది. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 528, మేడ్చల్‌లో 414, వికారాబాద్‌లో 52 నమోదయ్యాయి. 


మేడ్చల్‌జిల్లాలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 24గంటల్లో జిల్లాలో మొత్తం 23 పాజిటివ్‌ కేసుల వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాలో 414 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 21మంది మృతి చెందారు. జిల్లాలో యాక్టివ్‌ కేసులు 276వరకు ఉన్నాయి. వీటిలో గ్రేటర్‌ పరిధిలోనే 225 ఉన్నాయి. మొత్తం 117మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు. 


వికారాబాద్‌ జిల్లాలో బుధవారం కొత్తగా మరో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మూడు కేసులు నమోదు కాగా, బొంరాస్‌పేట్‌ మండల కేంద్రంలో ఒక పాజిటివ్‌ నిర్ధారణ చేశారు. వికారాబాద్‌ పట్టణంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబంలో ముగ్గురికి జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో ముందు జాగ్రత్తగా కొవిడ్‌ పరీక్షలు చేసుకోవడంతో పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ కుటుంబానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌కు వెళ్లి రాగా, అతడికి అక్కడే కరోనా సోకి, ఆ యువకుడి నుంచి ఆ కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా సంక్రమించింది.

Updated Date - 2020-06-18T10:09:40+05:30 IST