మోక్షమెప్పుడో?

ABN , First Publish Date - 2020-05-19T09:40:56+05:30 IST

కరోనా కల్లోలం విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇంకెంతో కాలం లేదు. ఈసారైనా కొత్త భవనంలోకి

మోక్షమెప్పుడో?

అసంపూర్తిగా డిగ్రీ కళాశాల భవన నిర్మాణం

నిధులు లేక మూడేళ్లుగా ఆగిన పనులు  

త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం 

ప్రశ్నార్థకంగా డిగ్రీ విద్యార్థుల భవితవ్యం

పట్టించుకోని ఉన్నత విద్యాశాఖ అధికారులు

చోద్యం చూస్తున్న ప్రజాప్రతినిధులు


ఇబ్రహీంపట్నం: కరోనా కల్లోలం విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇంకెంతో కాలం లేదు. ఈసారైనా కొత్త భవనంలోకి వెళ్లకపోతామా అని డిగ్రీ విద్యార్థులు కన్న కలలు కల్లలుగానే మిగిలిపోనున్నాయి. మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనం ఇంకా అంసంపూర్తిగానే ఉంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతోనే నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. రూ.2.25కోట్ల అంచనాతో 2016 డిసెంబర్‌లో ఇబ్రహీంపట్నం పట్టణంలోని వినోభానగర్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అప్పట్లో డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదట్లో పనులు చకచకా కొనసాగినా ఈ తరువాత పనుల్లో వేగం తగ్గి పూర్తిగా నిలిచిపోయాయి.


ప్రస్తుతం డిగ్రీ తరగతులు ఇబ్రహీంపట్నం టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనంలో షిఫ్ట్‌ల పద్ధతిలో కొనసాగుతున్నాయి. ఉదయం ఉదయం 8 నుంచి మధ్నా హ్నం 12.30 గంటల వరకు జూనియర్‌ కళాశాల తరగతులు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు డిగ్రీ తరగతుల బోధన కొనసాగుతోంది. దీంతో ఉదయం మారుమూల గ్రామాల నుంచి ఇంటర్‌ విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరుకాలేక ఇబ్బందులు పడుతున్నారు. అటు మధ్యాహ్నం తరగతులకు హాజరు కాలేక డిగ్రీ విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. చాలీచాలని తరగతి గదుల్లో డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్నారు. కనీసం ల్యాబ్‌, లైబ్రరీకి గదులు లేక ఇరుకు గదిలో రెండు ల్యాబ్‌లు చొప్పున నడుపుతున్నారు.


రెండేళ్ల క్రితం కళాశాలలో కొత్త కోర్సులనూ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో సరిపడా గదులు లేక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీంతో డిగ్రీ కళాశాల విద్యార్థులు నూతన భవనంలోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తున్నారు. కానీ, పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిణామాలతో విద్యార్థులు, అధ్యాపకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని కళాశాల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.


విద్యార్థుల  జీవితాలతో ఆటలు

విద్యా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. మూడున్నరేళ్ల క్రితం డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. కానీ, ఇప్పటికీ భవన నిర్మాణం పూర్తి కాలేదంటే ఈ విషయంలో ఎవరిని తప్పుబట్టాలి. గొప్పలకుపోతున్న ప్రభుత్వం కనీసం భవన నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడం హాస్యాస్పదం. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

- జి.బీరప్ప, ఏబీవీపీ నాయకులు

Updated Date - 2020-05-19T09:40:56+05:30 IST