సీఎం గారూ.. మీ హామీ ఏమైంది?
ABN , First Publish Date - 2020-06-16T10:13:30+05:30 IST
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మూడేళ్లలో పూర్తి చేస్తామని టీఆర్‌ఎస్ హామీ ఇచ్చి ఐదేళ్లయినా ఇంకా పది

ఐదేళ్లు గడిచినా పది శాతమైనా పూర్తికాని పనులు
డిండికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధం
లేకుండా ప్రత్యేక నీటి కేటాయింపులు చేయాలి
ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి
వికారాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మూడేళ్లలో పూర్తి చేస్తామని టీఆర్‌ఎస్ హామీ ఇచ్చి ఐదేళ్లయినా ఇంకా పది శాతం పనులైనా పూర్తికాలేదని ఐఏసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు నీరందించే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు కరివెన వద్ద సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి అయిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడారు. గెస్ట్‌హౌస్ కట్టుకుని కుర్చేసుకుని కూర్చొని, పదిహేను రోజులకు ఒకసారి వచ్చి ఇక్కడే నిద్రపోతానన్న సీఎం కేసీఆర్.. తన మాట నిలబెట్టుకోలేదని, గడచిన అయిదేళ్లలో ఒక్కసారి మాత్రమే వచ్చారన్నారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడం వల్ల అంచనా వ్యయం రూ.35,200 కోట్ల నుంచి అమాంతం రూ.65వేల కోట్లకు పెరిగిందని, పెరిగిన అంచనా వ్యయం రూ.30 వేల కోట్లు కేవలం ప్రభుత్వ ఆలస్యం, కేసీఆర్ అసమర్థత వల్ల రాష్ట్ర ప్రజలపై భారం పడనుందని తెలిపారు.
గడిచిన అయిదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా 3,854 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు రోజుకు మూడు టీఎంసీలు కేటాయించాల న్నారు. వెంటనే నిధులు విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు జల దోపిడీని అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూరాల ఆధారంగా 30 వరద రోజుల్లో రోజుకు ఐదు టీఎంసీల వంతున 150 టీఎంసీల నీరు పొందేలా కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధం లేకుండా డిండికి ప్రత్యేక నీటి కేటాయింపులు చే సేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.