మా ఊరికి రావొద్దు

ABN , First Publish Date - 2020-03-25T10:58:17+05:30 IST

మా ఊరికి ఎవరూ రావొద్దు.. మా ఊరిమీదుగా ఎవరూ వెళ్లొద్దు.. అంటూ పలు గ్రామాల సరిహద్దులను మూసే స్తు న్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలుగ్రామాల్లో దారులను

మా ఊరికి రావొద్దు

గ్రామాల సరిహద్దుల మూసివేత

బారికేడ్లు, ముళ్ల కంచెలు, గోతులతో అడ్డగింత

సడక్‌ బంద్‌తో గ్రామాల్లో కట్టుదిట్టం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ / ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌/ ఘట్‌కేసర్‌ రూరల్‌ : మా ఊరికి ఎవరూ రావొద్దు.. మా ఊరిమీదుగా ఎవరూ వెళ్లొద్దు.. అంటూ పలు గ్రామాల సరిహద్దులను మూసే స్తు న్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలుగ్రామాల్లో దారులను దిగ్బంధం చేశారు. రోడ్లపై ముళ్ల కంప వేసి వాహనాల రాకపోకలకు అడ్డుకట్ట వేశారు. మరికొన్చిచోట్ల మొద్దులు అడ్డుపెట్టారు. బారికేడ్లు అడ్డమేసి సడక్‌ బంద్‌ చేపట్టారు. రంగారెడ్డి చేవెళ్ల మండల కేంద్రంలో బీజాపూర్‌ జాతీయ రహదారిపై వాహనాలు వెళ్లకుండా క్రైన్‌ను అడ్డంగా పెట్టారు. అలాగే షాద్‌నగర్‌ నుంచి కంది వెళ్లే దారిలో పోలీసులు రోడ్డుకు అడ్డంగా స్టాపర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి పల్గుట్ట గ్రా మంలో నుంచి వాహనాలు వెళ్లకుండా గ్రామస్థులు రోడ్డుకు అడ్డంగా కంప చేశారు. మరోచోట రోడ్డుపై పూలు కుప్పలుగా పోసి మా గ్రామానికి ఎవరూ రావద్దని కోరారు.


అలాగే న్యాలట, రామన్నగూడ, మల్లారెడ్డిగూడ, అంతారం గ్రామస్థులు రోడ్డుకు అడ్డంగా రాళ్లు ముళ్లకంప వేశారు. శంషాబాద్‌ మండలంలోని సుల్తాన్‌పల్లి, పెద్దషాపూరు, కవ్వగూడ, నర్కూడ, పాల్మాకుల, పిల్లోనిగూడ గ్రామాల్లో సడక్‌ బంద్‌ చేశారు. షాబాద్‌ మండలంలోని సంకేపల్లి, మల్లారెడ్డి, హైతాబాద్‌, బొబ్బిలి గామంలో రోడ్డుపై కంప వేశారు. కడ్తాల మండలం దేవుని పడకల్‌, తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో ఎవరూ బయటకు వెళ్ల కుండా దిగ్బంధం చేశారు. కొత్తూరు మండలంలోని ఎస్బీపల్లితో పాటు ఆయా గ్రామాల్లోకి ఎవరూ రాకుండా రోడ్లపై ముళ్ల కంప అడ్డంగా వేశారు. కొందుర్గు మండలం విశ్వనాథ్‌పూర్‌, కేశంపేటం మండలం కొండారెడ్డిపల్లి, ఫరూక్‌నగర్‌ మండలం దూసకల్‌లోకి ఇతర గ్రామాల నుంచి ఎవరూ రావద్దంటూ రోడ్డుపై ముళ్లచెట్లను అడ్డం వేశారు. మంచాల మండల మండలం చీదేడు, యాచారం మండలంలో కొత్తపల్లిలో రోడ్లపై కంచెలు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో సాగర్‌ ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు అడ్డంగా పెట్టి వాహనాలను వెనక్కి పంపించారు. గ్రామాల్లో కరోనా వైరస్‌పై భయం నెలకొంది. స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. 


పలుచోట్ల సడక్‌బంద్‌

కరోనా మహమ్మారి విజృభిస్తున్న నేపథ్యంలో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ చోట్ల తమ గ్రామాలకు రావొద్దని ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, యువకులు మంగళవారం స్వచ్ఛందగా గ్రామ సరిహద్దులను మూసివేశారు. కొన్నిచోట్ల బారికేడ్లు, మరికొన్ని గ్రామాల్లో ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. అవుశాపూర్‌లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, స్థానిక సర్పంచు ఏనుగు కావేరిమశ్ఛేందర్‌రెడ్డి గ్రామ సరిహద్దుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఇతరులెవరూ తమ గ్రామానికి రావొద్దని దండం పెట్టి హితవు పలికారు. కాచవానిసింగారంలో సర్పంచు కొంతం వెంకట్‌రెడ్డి, పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామసరిహద్దుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఇతర గ్రామాలవారిని తమ గ్రామంలోకి అనుమతించలేదు. మర్రిపల్లిగూడ వద్ద యువకులు బారికేడ్లతో పాటు ముళ్ల కంచెలను ఏర్పాటు చేసి ఇతర గ్రామాల వారు తమ గ్రామం నుంచి వెళ్లొదని ప్రయాణికులకు విజ్ఞ్ఞప్తి చేశారు. అదే విధంగా మేడ్చల్‌ మండలం ఎల్లంపేట గ్రామంలోకి ఎవరూ రావద్దని గ్రామ సరిహద్దులో జేసీబీతో రోడ్డుకు అడ్డంగా గోతు తవ్వారు.


రోడ్లకు అడ్డంతో కట్టడి 

పెరుగుతున్న కరోనా ప్రభావంతో వికారాబాద్‌ జిల్లా ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తమ గ్రామాలకు ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. కొత్తగా తమ గ్రామాలకు ఎవరూ రాకుండా రోడ్లకు అడ్డంగా ముళ్ల కంచె, చెట్లు అడ్డంగా వేసి కాపలా కాస్తున్నారు. కోట్‌పల్లి మండలంలో బీరోల్‌, కరీంపూర్‌, రాంపూర్‌, కంకణాలపల్లి, జిన్నారం, బార్వాద్‌, మోత్కుపల్లి, నాగసాన్‌పల్లి, లింగంపల్లి గ్రామాలకు వచ్చే రోడ్లకు అడ్డంగా ముళ్ల కంచె, చెట్లు, డ్రమ్ములను అడ్డంగా ఏర్పాటు చేశారు. పూడూరు మండలంలో మైసమ్మగడ్డ తండా, తిర్మలాపూర్‌, దోమ మండలంలో మల్లేపల్లి, బషీరాబాద్‌ మండలంలో నవాంద్గి, మోమిన్‌పేట్‌ మండలంలో ఎన్కేపల్లి, దోమ మండలంలో జహంగీర్‌ సాబ్‌ తండా, కులకచర్ల మండలంలో మక్త వెంకటాపూర్‌, తిర్మలాపూర్‌, నవాబుపేట్‌ మండలంలో చించల్‌పేట్‌, వికారాబాద్‌ మండలంలో బూర్గుపల్లి, ద్యాచారం గ్రామాల్లోకి కొత్తగా ఎవరూ రాకుండా కట్టడి చేశారు. వికారాబాద్‌ పట్టణంలో కూడా కొన్ని కాలనీల్లో ఇతరులు రాకుండా రోడ్లకు అడ్డంగా కంచె వేశారు. 


సర్పంచ్‌ అనుమతి తప్పనిసరి

దోమ మండలం జహంగీర్‌ సాబ్‌ తండాలో సర్పంచ్‌ అనుమతి తీసుకున్న తర్వాతే గ్రామంలోకి రావాలని సూచిస్తూ గేటు వద్ద ప్లకార్డు ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు లేవని సర్టిఫికెట్‌ తీసుకున్న అనంతరమే గ్రామంలోకి అడుగు పెట్టాలని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-03-25T10:58:17+05:30 IST