అల్లాపూర్‌లో ఇరువర్గాల ఘర్షణ
ABN , First Publish Date - 2020-10-27T11:09:40+05:30 IST
దసరా పర్వదినాన ఇరువర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో ఆదివారం దసరా పండుగ కావడంతో రెండు వర్గాలు వేర్వేరుగా ఆలయాల వద్ద శమ్మీ పూజలు నిర్వహించారు

13 మందిపై కేసు నమోదు
తాండూరు రూరల్ : దసరా పర్వదినాన ఇరువర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో ఆదివారం దసరా పండుగ కావడంతో రెండు వర్గాలు వేర్వేరుగా ఆలయాల వద్ద శమ్మీ పూజలు నిర్వహించారు. ఇందులో ఓ వర్గం శివాలయానికి తాళం వేసి ఆంజనేయస్వామి ఆలయం వద్ద కమిటీ సభ్యులతో కలిసి కూర్చున్నారు. మరోచోట జమ్మి పూజలు చేసిన సర్పంచ్ నందిని యాదయ్యగౌడ్ వర్గానికి చెందిన కొందరు శివాలయానికి వెళ్లారు. ఆలయానికి తాళం వేసి ఉండటంతో సర్పంచ్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న మరో వర్గాన్ని నిలదీశారు. పండుగపూట ఆలయానికి తాళం ఎందుకు వేశారని ప్రశ్నించారు.
దీంతో సర్పంచ్, మాజీసర్పంచ్ల మధ్య మాటామాట పెరిగింది. దీంతో ఘర్షణకు దారి తీసింది. ఈ విషయమై అదేరోజు రాత్రి ఇరు వర్గాలు కరన్‌కోట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ఎస్ఐ ఏడుకొండలు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి పోలీసు సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చ జెప్పి వెళ్లిపోయారు. అర్ధరాత్రి మళ్లీ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా సోమవారం సర్పంచ్ భర్త యాదయ్యగౌడ్ తాండూరుకు వెళుతుండగా, మరోవర్గం వారు రాళ్లతో దాడి చేశారు. బాధి తుడు దాడిచేసిన ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే గొడవలో చెంగోల్ గ్రామానికి చెందిన గోపాల్‌గౌడ్ తన బంధువని ఓ న్యాయవాది పోలీసుస్టేషన్‌కు చేరుకుని విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో అసభ్యంగా మాట్లాడారు. అక్కడ ఉన్న కుర్చీలను ధ్వంసం చేశాడు. దీంతో న్యాయవాదిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.