కొండెక్కిన కోడి

ABN , First Publish Date - 2020-05-17T09:36:21+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయ్‌. ప్రస్తుత వేసవి సీజన్‌లో చికెన్‌ ధరలు తగ్గాల్సిందిపోయి ఒక్కసారిగా

కొండెక్కిన కోడి

చికెన్‌ ధరలకు రెక్కలు !

కరోనా ప్రభావంతో నెలక్రితం కిలో రూ. 20 నుంచి 40

శనివారం కిలో స్కిన్‌లెస్‌  రూ.276 మేడ్చల్‌జిల్లాలో  రూ.290

నేడు ధర మరింత పెరిగే ఛాన్స్‌!

చికెన్‌ తినలేమంటున్న పేద, మధ్యతరగతి ప్రజలు

పప్పన్నంతోనే సరిపెట్టుకుంటున్న వైనం


నెల రోజుల క్రితం కిలో రూ.20 నుంచి 40కి పలికిన చికెన్‌ ధర ప్రస్తుతం ఏకంగా 

స్కిన్‌లెస్‌ రూ.276 నుంచి 290 వరకు పెరిగింది. ఇది చికెన్‌ ప్రియులకు భారంగా 

మారింది.  కొవిడ్‌-19 విస్తరిస్తున్న నేపథ్యంలో  చికెన్‌ తింటే కరోనా వస్తుందన్న దుష్ప్రచారంతో  దానిని కొనుగోలు చేసేవారు కరువయ్యారు. దీంతో పౌల్ర్టీఫామ్‌ యజమానులు చేసేదేమీ లేక కొన్నిచోట్ల  ఉచితంగా పంపిణీ చేసినా  తీసుకునే నాథుడే లేడు.  కరోనా ప్రారంభంలో పాతాళానికి పడిపోయిన చికెన్‌ ధరలు క్రమంగా పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. రికార్డు స్థాయిలో శనివారం స్కిన్‌లెస్‌ కిలో చికెన్‌  రూ. 276 నుంచి 290 వరకూ విక్రయించారు.  మున్ముందు రూ. 300 వరకూ పెరిగే అవకాశం ఉందని  వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే అసలే కరోనా దెబ్బతో ఆర్థిక  పరిస్థితి అంతంత మాత్రమే  ఉండగా అంత ధరపెట్టి చికెన్‌ తినే పరిస్థితి లేక  నిరుపేద కుటుంబాలు పప్పుచారుతోనే సరిపెట్టుకుంటున్నాయి.


పరిగి/మర్పల్లి /షాద్‌నగర్‌ అర్బన్‌ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయ్‌. ప్రస్తుత వేసవి సీజన్‌లో చికెన్‌ ధరలు తగ్గాల్సిందిపోయి ఒక్కసారిగా పెరుగడంతో చికెన్‌ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోరా వైర్‌స వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్‌ మొదటివారం వరకు చికెన్‌ ధరలు పూర్తిగా పడిపోయాయి. కిలో రూ.20 నుంచి 40 వరకూ బోర్డులు పెట్టి ఆఫర్లు ఇచ్చినా కొనే నాథుడే కరువయ్యాడు.  కొన్నిచోట్ల వందకు రెండు, మూడు కోళ్లను  విక్రయించిన సంఘటనలూ ఉన్నాయి. అదే యాభైరోజుల వ్యవధిలోనే చికెన్‌ధరలు అకాశాన్నంటాయి. కోళ్ల పెంపకంలో మంచి లాభాలు ఉంటాయని భావించిన రైతులు ఆసక్తితో పోటీపడి కోళ్ల పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటున్నారు.


ప్రతిఏటా ఇదేసమయంలో పూర్తిగా ధరలు పడిపోయేవని, కరోనా ప్రభావంతో కొద్ది రోజులక్రితం  నష్టాలను చవిచూసినా ప్రస్తుత ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయని పౌల్ర్టీ రైతులు పేర్కొంటున్నారు.అయితే ధరల పెరుగుదలతోతినేవారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పరిగి, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌, షాద్‌నగర్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, తదితర పట్టణాల్లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. కిలో చికెన్‌ గత ఏడాదితో పోలిస్తే  ప్రస్తుత ధరతో రెండింతలు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో కిలోచికెన్‌ లైవ్‌ రూ.90, విత్‌స్కిన్‌ రూ.121, స్కిన్‌లెస్‌ రూ.150లు ఉండేది. ప్రస్తుతం లైవ్‌కు రూ.167, విత్‌స్కిన్‌కు రూ.240, స్కిన్‌లెస్‌ కిలోకు రూ.276 వరకు ఉంది.  మేడ్చల్‌  జిల్లాలో  ప్రస్తుతం లైవ్‌కు రూ.172, విత్‌స్కిన్‌కు రూ.250, స్కిన్‌లెస్‌ కిలోకు 290 వరకు విక్రయిస్తున్నారు. దీంతో చికెన్‌ తినే కుటుంబాలు బావురుమంటున్నాయి. ఈసారి పౌలీ్ట్రఫామ్‌లో కోళ్ల ఉత్పత్తి తగ్గిందని కొందరు, ఎండలకు రోగాలబారిన పడి చనిపోవడం వల్లనే ధరలు పెరుగుతున్నాయని మరికొందరు పేర్కొంటున్నారు.


ఏదీఏమైనా వేసవిలో చికెన్‌కు ఇంత ధర ఎప్పుడు చూడలేమని చికెన్‌ ప్రియులు పేర్కొంటున్నారు. సండే రోజు జిల్లాలో కిలో చికెన్‌ రూ.300 చేరే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే అసలే కరోనా దెబ్బతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండగా అంత ధర పెట్టి చికెన్‌ తినే పరిస్థితి లేక నిరుపేద కుటుంబాలు పప్పుచారుతోనే సరిపెట్టుకుంటున్నాయి. 

 

వేసవిలో ఇంత ధరలా?: గట్యానాయక్‌, పరిగి

వేసవి సీజన్‌లో చికెన్‌కు ఇంత ధర ఎప్పుడు చూడలేదు. వానా, చలికాలంలో ధరలు పెరిగేవి. వేసవిలో తగ్గేవి. ధరలు పెరిగిన కారణంగా తినలేని పరిస్థితి. ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్‌ రూ.276 ఉంది. గతనెల క్రితం రూ.20నుంచి40కి  విక్రయించారు. 


ఉత్పత్తి తగ్గడం వల్లనే..ఇస్మాయిల్‌, చికెన్‌షాపు యజమాని,పరిగి 

ఈసారి వాతరణం అను కూలించలేదు. దీనివల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో ధరలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి చికెన్‌ ధరలు పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి గిరాకీ కూడా తగ్గింది. 


చికెన్‌ అమ్మకాల్లో మోసం చేస్తే చర్యలు:  జి.తేజిరెడ్డి కమిషనర్‌,పరిగి

రాష్ట్రంలో చికెన్‌ కంపెనీలు నిర్ణయించిన ధరలకే విక్రయించాలి. అంతకంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి షాపుకు మొదట్లో తాము నోటీసులు జారీచేశాం. 

Updated Date - 2020-05-17T09:36:21+05:30 IST