బఫర్‌జోన్‌ భూముల ఆక్రమణ

ABN , First Publish Date - 2020-09-05T08:43:26+05:30 IST

మండలపరిధిలోని చౌదరిగూడ పంచాయతీలో బఫర్‌జోన్లలోని భూములు ఆక్రమ ణకు గురవుతున్నాయి...

బఫర్‌జోన్‌ భూముల ఆక్రమణ

సాగునీటి కాలువకు ఆనుకుని నిర్మాణాలు

నిబంధనలు తుంగలో తొక్కుతున్న ఆక్రమణదారులు


ఘట్‌కేసర్‌ : మండలపరిధిలోని చౌదరిగూడ పంచాయతీలో బఫర్‌జోన్లలోని భూములు ఆక్రమ ణకు గురవుతున్నాయి. నిబంధనల ప్రకారం నీటి కాలువలకు ఇరుపక్కల వంద అడుగుల దూరంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదు. కానీ రియల్‌వ్యాపారులు మాత్రం కాలువలకు ఆనుకుని నిర్మాణాలు చేపడుతూ యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మేడిపల్లి మం డలంలోని ఫీర్జాదిగూడ సమీపంలోని నారాయణరావు చానెల్‌(మూసీపై నిర్మించిన ఆనకట్ట నుంచి ఘట్‌కేసర్‌ మండలం ఏదులాబాద్‌ చెరువులోకి సాగునీరు వస్తుంది)గా పిలవబడే ఈ కాలువ కాచవానిసింగారం, ప్రతాప్‌సింగారం, మత్వెల్లిగూడ, చౌదరిగూడల మీదుగా కుమ్మరికుంట, తాళ్లకుం టలను కలుపుకుంటూ ఏదులాబాద్‌ చెరువులోకి చేరుతుంది. చౌదరిగూడ పంచాయతీలోని మక్త, సదాత్‌అలీగూడలలో ప్రవహించే ఈ కాలువకు ఇరువైపులా పెద్దఎత్తున నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేపట్టారు. మక్త వద్ద నిర్మించిన కట్టడాలను గతంలో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అయినప్పటికీ కొద్దిరోజులకే తిరిగి కాలువకు ఆనుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇంత జరుగుతున్నా సాగునీటి శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఇటీవల మండలంలో ఏర్పడిన ఆయా పార్టీల అఖిలపక్ష కమిటీ సైతం సంబంధిత శాఖల అధికారులకు బఫర్‌జోన్ల ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా స్పందించటం లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టకపోతే సాగునీటి శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు.

Updated Date - 2020-09-05T08:43:26+05:30 IST