బీఎస్‌-4 వాహనాల రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి.. నెలాఖరు గడువు

ABN , First Publish Date - 2020-03-12T06:46:40+05:30 IST

కాలుష్యాన్ని వెదజల్లుతున్న బీఎస్‌-4 వాహనాలకు కాలం చెల్లింది. ఈనెలాఖరులోగా రిజిస్ర్టేషన్‌ చేయించని వాహనాలను తుక్కు కింద

బీఎస్‌-4 వాహనాల రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి.. నెలాఖరు గడువు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కాలుష్యాన్ని వెదజల్లుతున్న బీఎస్‌-4 వాహనాలకు కాలం చెల్లింది. ఈనెలాఖరులోగా రిజిస్ర్టేషన్‌ చేయించని వాహనాలను తుక్కు కింద అమ్ముకోవాల్సి ఉంటుంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న బీఎస్‌-4 వాహనాలను నిషేధించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజిస్ర్టేషన్‌ కాని బీఎస్‌-4 వాహనాలు ఏప్రిల్‌ ఒకటి నుంచి రోడ్డెక్కితే సీజ్‌ చేయనున్నారు. నూతన టెక్నాలజీతో తయారైన బీఎస్‌-6 వాహనాలకే రిజిస్ర్టేషన్‌ చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ మేరకు ఇప్పటివరకు రిజిస్ర్టేషన్‌ కాని బీఎస్‌-4 వాహనాలను ఈనెల 31 వరకు రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. డీలర్లకు అవగాహన కల్పిస్తూ వాహనదారులు రిజిస్ర్టేషన్‌ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ద్విచక్ర వాహనాలతోపాటు ఇతర వాహనాలు 20వేల వరకు రిజిస్ర్టేషన్‌ కాలేదు.


ఇందులో వివిధ కారణాలతో మరో 2వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వాహనాలన్నీ మార్చి 31లోపే రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ర్టేషన్‌ చేయరు. దీంతో అవి తుక్కుకు వేసుకోవాల్సిందే.. అలాగే రిజిస్ర్టేషన్‌ చేయని వాహనాలకు బీమా చేయరు. ప్రమాదానికి గురైన సమయంలో ఎలాంటి పరిహారం అందదు. నిబంధనల ప్రకారం వాహనాలను కొనుగోలు చేసిన వెంటనే నెల రోజులలోపు వాహనదారుడు తన పేరు మీద ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలి. 

బీఎస్‌-4 వాహనాలతో కాలుష్యం

బీఎస్‌-4 వాహనాల నుంచి వచ్చే పొగ అధికంగా ఉంటుంది. సల్పర్‌ 500 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) విడుదలవుతుంది. ప్రస్తుతం వాహనాల్లో వాడుతున్న బీఎస్‌-4 ఇంధనంలో 50 శాతం సల్పర్‌ ఉండటమే ఇందుకు కారణం. దీని వల్లే కాలుష్యం భారీగా వెలువడుతుంది. దీనిని తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ఏప్రిల్‌ 1 నుంచి మార్కెట్‌లోకి బీఎస్‌-6 పెట్రోల్‌, డీజిల్‌ను అందుబాటులోకి తెస్తుంది. శుద్ధి చేసిన ఈ ఇంధనంతో సల్ఫర్‌ 10శాతం మాత్రమే ఉంటుంది. అందుకే కాలుష్యం తక్కువ. బీఎ్‌స-4తో పోలిస్తే బీఎస్‌-6 వాహనాల్లో నైట్రోజన్‌ ఆక్సైడ్‌ విడుదల కూడా ఐదు రెట్లు ఎక్కువ. ఇంధనానికి అనుగుణంగా కేంద్రం బీఎస్‌-6 వాహనాలను తీసుకు వచ్చింది. 

లీటర్‌ పెట్రోల్‌ ఉండాల్సిందే..

ప్రస్తుతం బీఎస్‌-4 వాహనాల ట్యాంకులో ఉన్న పెట్రోల్‌ చివరి బొట్టు వరకు బండి నడుస్తుంది. అప్పటికీ మొరాయిస్తే.. చౌక్‌ను పైకి లేపితో కొంతదూరం వెళ్లవచ్చు. కానీ.. బీఎస్‌-6 వాహనాల్లో అలా కుదరదు. కనీసం ట్యాంకులో లీటర్‌ పెట్రోల్‌ ఉండాల్సిందే. చౌక్‌ వ్యవస్థ లేక పోవడమే ఇందుకు కారణం. ఇంధనం ట్యాంకు నుంచి నేరుగా ఇంజన్‌కు చేరేలా కనెక్ట్‌ చేసి ఉంటుంది. దీని వల్ల నేరుగా ఇంజన్‌కు ఇంధనం చేరి పొగ తక్కువగా వస్తుంది. శుద్ధిచేసిన ఇంధనం వాడకం, బీఎస్‌-6 ఇంజన్‌ స్టార్ట్‌ చేసిన సమయంలో శబ్ధం వెలువడదు. 

మార్కెట్‌లోకి బీఎస్‌-6 వాహనాలు 

బీఎస్‌-4 వాహనాలను నిషేధించిన నేపథ్యంలో కంపెనీలో బీఎస్‌-6 పేరిట నూతన టెక్నాలజీతో కొత్త వాహనాలను తయారు చేశాయి. ఇప్పటికే ఈ వాహనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. పలు షోరూముల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. 

పెరిగిన రిజిస్ర్టేషన్లు

ఏప్రిల్‌ ఒకటి తర్వాత బీఎస్‌-4 వాహనాలు రోడ్డెక్కితే చర్యలు తప్పవని ఆర్టీఏ అధికారులు తేల్చి చెప్పడంతో వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. రెండు నెలల క్రితం రోజుకు 400-500 మధ్యన రిజిస్ర్టేషన్లు అయ్యేవి. ప్రస్తుతం రోజుకు 1,200 వరకు రిజిస్ర్టేషన్లు అవుతున్నాయి. బుధవారం కొండాపూర్‌లో 600, ఇబ్రహీంపట్నంలో 500, షాద్‌నగర్‌లో 200 వరకు రిజిస్ర్టేషన్లు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. వాహన రిజిస్ర్టేషన్లకు సంబంధించి ఇంతకుముందు 2 గంటల వరకు ఉంటే.. ప్రస్తుతం 5 గంటల వరకు పెంచారు. స్లాట్లు బుకింగ్‌ టైమ్‌ పెంచడంతో రిజిస్ర్టేషన్ల సంఖ్య పెరిగింది. 

20వ తేదీలోగా 

రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలి

ప్రవీణ్‌రావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ 

బీఎస్‌-4 వాహనాల రిజిస్ర్టేషన్‌కు సమయం ఈనెలాఖరు వరకు ఉన్నప్పటికీ..  ఈనెల 20 తేదీ వరకు రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్టు కమిషనర్‌ ప్రవీణ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ట్రాన్స్‌ఫోర్టు కార్యాలయంలో డీలర్లు, ఫైనాన్సర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఎస్‌-4 వాహనాలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి రోడ్డుపైకి వస్తే.. సీజ్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీలర్లు 31వ తేదీ వరకు వాహనాలను అమ్ముకోవచ్చని, రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఇంకా 20 వేల వరకు రిజిస్ర్టేషన్‌ కానివి ఉన్నాయని, అందులో 2 వేల వరకు కొన్ని సమస్యలతో రిజిస్ర్టేషన్లు ఆగివున్నాయని తెలిపారు.


తాత్కాలిక రిజిస్ర్టేషన్‌ అయిన వాహనాలు కూడా మార్చి 31 లోగా పర్మినెంట్‌ రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువుకు ముందుగా రిజిస్ర్టేషన్‌ చేయించుకోవడం వల్ల ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కర పత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. రిజిస్ర్టేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కొన్ని వాహనాలు కూడా వివిధ కారణాల వల్ల రిజిస్ర్టేషన్‌ కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని, మోటర్‌ ఇన్‌స్పెక్టర్‌ ముందు వాహనాన్ని చూపించకపోవడం, రెండో వాహనానికి సంబంధించి టాక్స్‌ చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల రిజిస్ర్టేషన్‌ కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కొందరు దరఖాస్తు పత్రం ఇచ్చి ఫొటో దిగకుండా వెళ్లిపోయారని, దీనివల్ల రిజిస్ట్రేషన్‌ కాలేదన్నారు. రిజిస్ర్టేషన్‌ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకున్నారో అక్కడికి వెళ్లి వాహనదారులు వివరాలు తెలుసుకోవాలని సూచించారు. వాహన నెంబరు రాకుంటే.. వెంటనే సంబంధిత అధికారిని సంప్రదించాలని తెలిపారు. తాత్కాలిక రిజిస్ర్టేషన్‌ అయ్యాక వాహనానికి పైనాన్స్‌ కిస్తు ఉండి... ఆ కిస్తు కట్టకుంటే.. ఫైనాన్స్‌ వాళ్లు వాహనాన్ని తీసుకెళ్తారని, నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే.. పైనాన్సర్లపేరిట వాహనాన్ని రిజిస్ర్టేషన్‌ చేసుకునే అవకాశముందన్నారు.


డీలర్లు, ఫైనాన్సర్లు, కొనుగోలుదారులు అందరు అప్రమత్తమై వెంటనే వాహనాలను రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకోని వాహనదారులకు ఇప్పటికే కమిషనర్‌ కార్యాలయం నుంచి ఎస్‌ఎంఎస్‌లు పంపించడం జరిగిందని తెలిపారు. ఎన్ని వాహనాలు వచ్చినా రిజిస్ర్టేషన్‌ చేసేందుకు అధికారులు రెడీగా ఉన్నారని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎట్టి పరిస్థితిలో తేదీ పొడిగించే అవకాశం లేదని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-03-12T06:46:40+05:30 IST