నీటి గుంతలో పడి..

ABN , First Publish Date - 2020-12-11T05:01:27+05:30 IST

నీటి గుంతలో పడి..

నీటి గుంతలో పడి..
నీటి గుంతలో పడి మృతిచెందిన గణేశ్‌, నందీశ్వర్‌

  • ఇద్దరు బాలుర మృతి
  • మట్టి అమ్మకాల కోసం తవ్విన గుంత కారణంగా ప్రమాదం
  • అక్రమ తవ్వకాలపై పోలీసులకు గ్రామస్థుల ఫిర్యాదు

నందిగామ: సరదాగా ఆడుకుంటూ వెళ్లిన ఇద్దరు బాలురు నీటి గుంతలో పడి ఇద్దరు మృతిచెందిన సంఘటన నందిగామ మండలం మేకగూడ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేకగూడకు చెందిన నందీశ్వర్‌(8), అదే పంచాయతీ పరిధి సంఘిగూడకు చెందిన గణేష్‌(13) తోటి స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని నీటి గుంత వద్దకు వెళ్లారు. అక్కడ ఆడుకుంటున్న క్రమంలో ఈత రాక, నీటి గుంత లోతు తెలియక దానిలో మునిగి మృతిచెందారు. వెంటనే తోటి స్నేహితులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకునే లోపే  బాలురు మునిగిపోయారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృతదేహాలను వెలికితీయించి షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. బాలుడు నందీశ్వర్‌ తండ్రి సుభాష్‌ 15సంవత్సరాల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌ నుంచి మేకగూడకు వలస వచ్చి సమీపంలోని నాట్కో పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గణేష్‌ తల్లి పుష్పమ్మ తన భర్తకు దూరంగా ఉంటూ రెండు సంవత్సరాల క్రితం సంఘిగూడలోని తల్లి ఇంట్లో ఉంటూ నాట్కో పరిశ్రమలో పనిచేస్తోంది. సుభాష్‌ తన పక్కనే నివాసముంటున్న సోదరుడు రమేష్‌ ఇంట్లో కొడుకు నందీశ్వర్‌ను వదిలి గురువారం ఉదయం ఓ గ్రామంలో జరిగిన వివాహానికి వెళ్లాడు. నందీశ్వర్‌, గణేష్‌ ఇద్దరూ కలిసి నీటి గుంత వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పడి మృతిచెందారు. కాగా మేకగూడకు చెందిన శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి తన పొలంలోంచి మట్టిని అక్రమంగా తరలించి విక్రయిస్తుంటాడని, మట్టి కోసం లోతైన గుంత తీయడంతో దానిలో నీరు నిండి ఈ ఇద్దరు బాలురు మృత్యువాత పడ్డారని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బాలుర మృతికి కారణమైన శేఖర్‌రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఘటనపై మృతుడు నందీశ్వర్‌ పెదనాన్న రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ధనుంజయ తెలిపారు.

Updated Date - 2020-12-11T05:01:27+05:30 IST