ధరల దడ

ABN , First Publish Date - 2020-03-24T07:35:57+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రభావంతో జిల్లాలో ఒక్కసారిగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో వ్యాపారులు జనాన్ని...

ధరల దడ

  • లాక్‌డౌన్‌ ప్రకటించడంతో నిత్యావసరాలకు ఎగబడిన జనం
  • అవసరాలకు మించి కొనుగోలు
  • అమాంతం ధరలు పెంచిన వ్యాపారులు
  • రూ.80 పలికిన కిలో టమాట 
  • ఘాటెక్కిన పచ్చిమిర్చి.. ఏడిపించిన ఉల్లి
  • లీటర్‌ పాల ప్యాకెట్‌పై అదనంగా రూ.10 వసూలు

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ / కందు కూరు : లాక్‌డౌన్‌ ప్రభావంతో జిల్లాలో ఒక్కసారిగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో వ్యాపారులు జనాన్ని నిలువునా దోచుకుంటున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రజలెవరూ బయటకు రాలేదు. ఈ కర్ప్యూ ఒక్కరోజు ఉంటుందనుకుంటున్న తరుణంలోనే సీఎం కేసీఆర్‌ ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా మిగతావి మూసివేయాలని, వ్యక్తులు గుంపులుగా తిరుగొద్దని, ఇంటికొకరు మాత్రమే నిత్యావసర వస్తువుల కోసం బయటకి వెళ్లాలని సూచించారు. పాలు, కూరగాయలు, మందులు, అత్యవసర వస్తువులు తప్ప ఇతర రాష్ర్టాల నుంచి ఏవీ రావని ప్రకటించారు. అయితే జనం మాత్రం వీటిని పట్టించుకోలేదు. సోమవారం విపరీతంగా రోడ్లమీదకు వచ్చారు. అవసరానికి మించి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. దీంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు.


కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలడంతో.. ప్రజలందరూ నాన్‌వెజ్‌ తినడం మానేశారు. అందులోనూ ముఖ్యంగా చికెన్‌ జోలికి వెళ్లడమే లేదు. జిల్లాలో లాక్‌డౌన్‌ చేయడంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి ఇదే అదునుగా భావించిన.. కూరగాయల దుకాణాదారులు ధరలను విపరీతంగా పెంచేశారు. మూడురోజుల క్రితం కిలో టమాట ధర రూ.10 ఉండగా.. ఇప్పుడు కిలో రూ. 60 నుంచి 80 వరకూ ధర పలుకుతున్నది. సోమవారం చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌లో 25 కిలో టమాట బాక్స్‌ రూ.600 నుంచి రూ. 800 పలికింది. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన రైతులు పొలాలకు వెళ్లక పోవడంతో టమాటను కోయలేదు. మార్కెట్‌కు అరకొర టమాట తరలించారు. కేవలం గంట వ్యవధిలోనే  వ్యాపారులు కొనుగోలు చేశారు. పచ్చి మిర్చి ఘాటెక్కింది. కిలో రూ.80కి విక్రయించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లికి బ్రేక్‌ పడటంతో ధర మళ్లీ పెరిగింది. నిన్న మొన్నటి వరకు రూ.25-30 కిలో అమ్ముడుపోయిన ఉల్లి.. ప్రస్తుతం ధర రెట్టింపు అయ్యింది. షాద్‌నగర్‌లో కిలో రూ.60 వరకు పలికింది. ఆలుగడ్డ రూ.50, బెండ రూ. 50 అమ్ముడు పోయింది. కొన్నిచోట్ల కిరాణా సరుకులు కూడా స్వల్పంగా పెంచేశారు. లీటర్‌ పాల ప్యాకెట్‌పై అదనంగా రూ. 10 వసూలు చేశారు. 


చర్యలేవి?

నిత్యావసర వస్తువుల ధరలు పెరగవని, ఎవరైనా పెంచి అమ్మినా,  కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని స్వయంగా సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. కానీ.. సీఎం మాటలు బేఖాతర్‌ చేశారు. ఇష్టానుసారంగా ధరలను పెంచి సరుకులను విక్రయించారు. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా ప్రజలు పాలు, కూరగాయలు, కిరాణాషాపులపై ఎగబడటంతో ఇదే అదునుగా భావించి ధరలను పెంచి సరుకులను విక్రయిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


కూరగాయల ధరలు రెట్టింపు

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కూరగాయల ధరలు, పాలు, పెరుగు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు రెట్టింపు చేసి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య కుటుంబీకులకు కూరగాయలు కొనడం భారంగా మారింది. ప్రతినిత్యం పాలు ఎంతో అవసరం. వాటి ధర కూడా రెట్టింపు చేయడంతో ఏమి తోచని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి ధరలను అదుపు చేయాలి.

సుభాషిణి, గృహిణి, షాద్‌నగర్‌ 


కూరగాయల ధరలు పెంచడం దారుణం

రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ నివారణ కోసం లాక్‌డౌన్‌ చేపట్టడం అభినందనీయం. కాగా ప్రస్థుతం మరో పదిరోజులు లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో కూరగా యల ధరలు, పాలు, పెరుగు ధరలు విపరీతంగా పెరిగి పోవడం శోచనీయం. సామాన్య మానవునికి ఇది భారంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకుని కూరగాయల ధరలను అదుపులో పెట్టాలి.   

 వెంకటేష్‌, కార్మికుడు, షాద్‌నగర్‌


Updated Date - 2020-03-24T07:35:57+05:30 IST