-
-
Home » Telangana » Rangareddy » bjp strike at collecterate
-
టీఆర్‌ఎస్‌కు కొమ్ముకాస్తున్నారు
ABN , First Publish Date - 2020-12-15T05:46:27+05:30 IST
టీఆర్‌ఎస్‌కు కొమ్ముకాస్తున్నారు

- ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలపై ఎమ్మెల్సీ రాంచందర్ ఫైర్
- సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్
- బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా లో పాల్గొన్న ఎమ్మెల్సీ
- ఘట్‌కేసర్, శామీర్‌పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు టీఆర్‌ఎస్ పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, పింఛన్‌దారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్‌జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు తమ హక్కులను సాధించుకునేందుకు ప్రభుత్వంపై పోరాటం చేయడం మానేసి, ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో నడుస్తున్న రైతు ఉద్యమం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగుల పక్షాన పోరాడాల్సిన సంఘాలు, సంస్థలన్నీ టీఆర్‌ఎ్‌సకు కొమ్ముకాస్తున్నాయని, వీరికి మద్దతుగా పోరాడేది బీజేపీనేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తుందని, ఇప్పటివరకు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ప్రకటించిందని, తెలంగాణలో మాత్రం పీఆర్సీ, ఐఆర్, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జారీ చేసిన హెల్త్ కార్డులతో ఎలాంటి ఉపయోగం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై, ఉద్యోగాల భర్తీపై తాను ఎన్నో సార్లు శాసనమండలిలో ప్రస్తావించి, ప్రభుత్వాన్ని నిలదీశానని తెలిపారు. ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కొంపల్లి మెహన్‌రెడ్డి, డాక్టర్ ఎస్.మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని, ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మోసం చేసిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆర్భాటంగా హామీలు గుప్పిస్తూ, మరిచిపోవడం పరిపాటిగా మారిందని తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, అంతర్‌జిల్లాబదిలీలు, 70ఏళ్లు నిండిన పింఛన్‌దారులకు క్వాంటమ్ ఆఫ్ పింఛన్‌ను వర్తింపచేయాలని, రెండువిడతల డీఏను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. ధర్నా అనంతరం అదనపు కలెక్టర్ కె.విద్యాసాగర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొల్లి మాధవి, జయకృష్ణ, వినాయకనగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మీ, యువజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రసాద్, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లాల తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
ఘట్‌కేసర్ రూరల్/శామీర్‌పేట: నిరుద్యోగ యువత, ప్రైవేటు ఉపాధ్యాయులకు మద్దుతుగా బీజేపీ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడికి తరలివెళ్తున్న ఆ పార్టీనాయకులను ఘట్‌కేసర్, శామీర్‌పేట మండలాల్లో ఆయా పోలీ్‌సస్టేషన్ పరిధిలో సోమవారం ముందుస్తు అరెస్టు చేశారు. బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సాయంత్రం వారిని సొంత పూచికత్తుపై విడుదల చేశారు.