కొత్తచట్టం రైతులకు ఉపయోగం

ABN , First Publish Date - 2020-12-26T04:11:07+05:30 IST

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులకు

కొత్తచట్టం రైతులకు ఉపయోగం
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ లక్ష్మణ్‌

  • ఏడాదికి ప్రతి రైతుకు ఆరు వేల ఆర్థిక సాయం
  • రాజకీయ స్వార్థంతోనే ప్రతిపక్ష పార్టీ నాయకుల కుట్రలని ధ్వజం
  • ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌


చేవెళ్ల : ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులకు 6 వేల రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగిందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్‌ గార్డెన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులతో పరస్పర చర్చలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నాయకులతో కలిసి ఆయన వీక్షించారు. దీంతోపాటు మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి లక్ష్మణ్‌ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని అన్ని రాష్ర్టాల్లో రైతుల మధ్య ఉన్న దళారి వ్యవస్థను నిర్మూలించేందుకు కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ సంస్కరణలను తీసుకువచ్చిందన్నారు. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రైతుల కోసం పీఎం కిసాన్‌ బీమా పథకాన్ని అమలు చేస్తుందన్నారు. రైతులకు నేరుగా బ్యాంకు రుణాలు అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. రాజకీయ స్వార్థం కోసం రైతు సంక్షేమాన్ని, అభివృద్ధిని దెబ్బతీసేందుకు ప్రతిపక్షపార్టీలు కుట్రలు పన్నుతు న్నాయని స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్‌లు ఎప్పటిలాగే పనిచేస్తాయని, అందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. నూతన చట్టంతో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు మరింత బలోపేతం అవుతాయన్నారు. వాస్తవాలను పక్కనపెట్టి అవాస్తవాలతో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టు పార్టీలు రైతులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. పంటలకు బీమా చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే రైతులకు పరిహారం అందిస్తుందన్నారు. రైతులకు భూసార కార్డులను అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రైతులకు చేరవేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

అంతకుముందు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు -రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా జిల్లాకు నీరందిస్తామని చెప్పిన సీఎం... తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. కనీసం ప్రాజెక్టుకు నిధులు కూడా కేటాయించలేదని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషిచేస్తున్నారని తెలిపారు. కొత్త చట్టం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంతకుముందుకు పార్టీ నాయకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి జనార్దన్‌రెడ్డి, దళిత మోర్చా అధ్యక్షుడు కొప్పు బాష, జిల్లా అధికార ప్రతినిధులు శ్రీధర్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పాపయ్యగౌడ్‌, రాష్ట్ర నాయకులు కె.ప్రకాశ్‌, అంజన్‌కుమార్‌గౌడ్‌, జంగారెడ్డి, శ్రీనివాస్‌, విఠల్‌రెడ్డి, పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, నాయకులు, కుంచం శ్రీనివాస్‌గుప్తా, ఏ. శ్రీనివాస్‌, దమోదర్‌రెడ్డి, మల్లారెడ్డి, బోజిరెడ్డి, శ్రీనివాస్‌, సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, అనంత్‌రెడ్డి,  కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 


వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని ప్రసంగం

చేవెళ్ల మండలకేంద్రంలోని కేజీఆర్‌ గార్డెన్‌లో శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ కోసం భారీ స్ర్కీన్‌ను ఏర్పాటు చేశారు. ఓబీసీ మోర్చా జాతీయఅధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. తదనంతరం ప్రధాని ప్రసంగాన్ని పార్టీ నాయకులకు, రైతులకు లక్ష్మణ్‌ వివరించారు. Updated Date - 2020-12-26T04:11:07+05:30 IST