-
-
Home » Telangana » Rangareddy » bjp
-
ప్రభుత్వం చెబుతున్నవన్నీ డొల్లే..
ABN , First Publish Date - 2020-12-11T04:56:16+05:30 IST
ప్రభుత్వం చెబుతున్నవన్నీ డొల్లే..

- బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్
ఇబ్రహీంపట్నం: రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నవన్నీ డొల్ల మాటలేనని సన్న రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముత్యాల భాస్కర్ అన్నారు. రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తూ తప్పుడు ప్రచారానికి ఒడిగడుతోందని విమర్శించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు బూడిద నర్సింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రావుల మల్లేష్ పాల్గొన్నారు.
హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి
యాచారం : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హమీని నెరవేర్చలేకపోయారని, ఉచితంగా యూరియా పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పి ఎందుకు ఇవ్వలేకపోతున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవి ప్రశ్నించారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ సన్న వరి పండించాలని రైతులకు చెప్పిన ప్రభుత్వం నేడు వాటిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క యాచారం మండలంలో వందల క్వింటాళ్ల సన్న వరి ధాన్యం పొలాల వద్ద పడిఉన్నా అధికారులకు పట్టింపులేకుండపోయిందని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం వ్యవసాయ బిల్లు తెస్తే, దాన్ని రద్దు చేయాలని టీఆర్‌ఎస్ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, సర్పంచ్ ముదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తక్కళ్లపల్లి, తక్కళ్లపల్లి తండాల ఉపసర్పంచ్‌లు పగడాల శ్రీశైలం, విజయ్‌నాయక్, నరేష్, నాయకులు రమేష్, దయాకర్, రాజు, సంగం శ్రీనాథ్, సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.