బీజేపీలో కొత్త జోష్‌

ABN , First Publish Date - 2020-12-07T04:43:49+05:30 IST

బీజేపీలో కొత్త జోష్‌

బీజేపీలో కొత్త జోష్‌

  • పార్టీ బలోపేతానికి నాయకుల సమాలోచనలు

షాద్‌నగర్‌ అర్బన్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో షాద్‌నగర్‌ బీజేపీలో కొత్త జోష్‌ నెలకొంది. నగరంలో పార్టీ సాధించిన సీట్లతో నాయకులు ఆనందంలో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇక్కడి నాయకులు ఇన్‌ఛార్జిలుగా ఉండి ప్రచారం నిర్వహించిన డివిజన్లలో బీజేపీ గెలవడం వారిలో ఉత్సాహాన్ని నింపింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా పార్టీ బలోపేతానికి ఉద్యుక్తానికి సమాలోచనలు మొదలుపెట్టారు. వివిధ పార్టీల్లో మండల, జిల్లాస్థాయి హోదాల్లో ఉండి బీజేపీలోకి రావాలనుకుంటున్న వారికి స్వాగతం పలికేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇన్‌చార్జిగా పనిచేసిన రాంనగర్‌, గాంధీనగర్‌, కవాడిగూడ, ముషీరాబాద్‌, అడిక్‌మెట్‌ స్థానాల్లో పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, పి.వెంకటేశ్వర్‌రెడ్డి, విజయభాస్కర్‌ పనిచేశారు. ఈ ఐదు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అలాగే బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.శ్రీవర్ధన్‌రెడ్డి ఇన్‌ఛార్జిగా ఉన్న జూబ్లీహిల్స్‌ లోనూ బీజేపీ గెల్చింది. బీజేపీ సీనియర్‌ నాయకుడు కొప్పుల రవీందర్‌రెడ్డి పనిచేసిన సైదాబాద్‌లోనూ గెలుపొందింది. దుబ్బాక ఉపఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48స్థానాల్లో గెలుపొందడంతో షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కొందుర్గు మాజీ ఎంపీపీ మణికొండ రంగయ్యగౌడ్‌, షాద్‌నగర్‌ పంచాయతీ సమితి మాజీ అధ్యక్షుడు అమర్నాథ్‌రెడ్డి తనయుడు దుష్యంత్‌రెడ్డి బీజేపీలో చేరారు. పార్టీలోకి వలసలను ప్రోత్సహించేందుకు సన్నద్ధమవుతున్నారు. పల్లెల్లోనూ పార్టీ బలోపేతానికి నాయకులు కలసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.

Updated Date - 2020-12-07T04:43:49+05:30 IST