బీజేపీ ఆకర్ష్‌

ABN , First Publish Date - 2020-12-06T05:35:15+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించిన భారతీయ జనతాపార్టీ వైపు ఇతర పార్టీలకు చెందిన అనేకమంది నేతలు ఆకర్షితులవుతున్నారు.

బీజేపీ ఆకర్ష్‌

  • కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలే లక్ష్యం 
  • కొండా, చంద్రశేఖర్‌, కాసానితో చర్చలు 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) గ్రేటర్‌ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించిన భారతీయ జనతాపార్టీ వైపు ఇతర పార్టీలకు చెందిన అనేకమంది నేతలు ఆకర్షితులవుతున్నారు. వచ్చే పార్ల మెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవు తున్న బీజేపీ.. ఆయా పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యంగా కొందరు కాంగ్రెస్‌ నేతలతోపాటు అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన నేతలతో కూడా చర్చలు మొదలు పెట్టింది. గ్రేటర్‌ ఎన్నికల ముందు బీజేపీలో చేరేందుకు సంకోచించిన ఆయాపార్టీలకు చెందిన పలువురు నేతలు ఇప్పుడు కాషాయ కండువా కప్పుకునేందుకు ఆసక్తిచూపుతున్నట్లు సమాచారం. ఉమ్మడిజిల్లాలో ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలతో బీజేపీ ముఖ్యనేతలు నేరుగా చర్చలు జరుపుతున్నారు. ఇందులో కొందరి పేర్లు ప్రము ఖంగా వినిపిస్తున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని తేలిపోవడంతో ఆ పార్టీ నుంచి కొందరు బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. రెండురోజులుగా ఆయన  బీజేపీని పొగుడ్తూ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెడుతున్నారు. కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు. అయితే  గ్రేటర్‌ ఎన్నికల తరువాత ఆయన స్వరం మారింది. బీజేపీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాంగ్రెస్‌ కనుక టీఆర్‌ఎస్‌తో కలిస్తే తాను బీజేపీలో చేరుతానని బహి రంగంగానే ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీలో క్రమ శిక్షణ లేదనే విషయాన్ని కూడా బహిరంగంగానే ప్రకటించారు. అలాగే మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ కూడా బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, టీఆర్‌ఎస్‌ తరపున పోటీచేసి పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన చంద్రశేఖర్‌ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తర పున పెద్దపల్లి పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవల ఆయన్ని బీజేపీ నేతలు సంప్రదించారు. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల తరువాత కూడా ఆయనకు బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. ఆయన్ని బీజేపీలోకి తీసుకోవడం ద్వారా దళితులకు కూడా దగ్గర కావాలని బీజేపీ భావిస్తోంది. 

వాస్తవానికి గతంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో సత్సంబంధాలు కలిగిన చంద్రశేఖర్‌ ఒక సమయంలో టీఆర్‌ఎస్‌లో ఒక వెలుగు వెలిగారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడుని చేస్తామని వికారాబాద్‌లో కేసీఆర్‌ ప్రకటించడంతో చంద్రశేఖరే సీఎం అవుతారని భావించారు. అయితే తరువాత కాలంలో పార్టీలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఇపుడు ఆయన్ని బీజేపీలోకి తీసుకువచ్చేందుకు కమలనాథులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. దుబ్బాక ఎన్నికల నాటి నుంచి బీజేపీ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల ఆయన ఇంటికి ఇద్దరు బీజేపీ నేతలు వచ్చి చర్చలు జరిపినట్లు తెలిసింది. బీసీ వర్గాల్లో పట్టున్న కాసానిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆ వర్గాల ఓటు బ్యాంకు మరింత పెంచుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న మరికొందరు సీనియర్‌ నేతలకు కూడా బీజేపీ గాలం వేస్తున్నట్లు సమాచారం. అయితే మరికొందరు మాత్రం బేషరతుగా బీజేపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 

Read more