బంద్‌కు సన్నద్ధం

ABN , First Publish Date - 2020-12-07T05:30:00+05:30 IST

కేంద్రం అమల్లోకి తెచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నేడు చేపడుతున్న భారత్‌ బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు, పలు సంఘాలు మద్ధతు ప్రకటించాయి.

బంద్‌కు సన్నద్ధం
తాండూరులో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు

  • నేడు భారత్‌బంద్‌ 
  • రైతన్నలకు మద్దతుగా రాజకీయ పార్టీల హైవేల దిగ్బంధం
  • షాద్‌నగర్‌లో  కేటీఆర్‌, రేవంత్‌రెడ్డి 
  • శామీర్‌పేటలో భట్టి విక్రమార్క



కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు నేడు భారత్‌ బంద్‌ను చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. పలువురు రాష్ట్ర నేతలతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  నేతలు జాతీయ రహదారుల దిగ్బంధంలో  పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. వామపక్ష అనుబంధ సంఘాలతో పాటు పలు ఉద్యోగ, ప్రజాసంఘాలు కూడా రైతుల బంద్‌కు మద్దతు పలికాయి.


(ఆంధ్రజ్యోతి,రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : కేంద్రం అమల్లోకి తెచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నేడు చేపడుతున్న భారత్‌ బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు, పలు సంఘాలు మద్ధతు ప్రకటించాయి. రైతులకు మద్దతు తెలుపుతూ  టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలతోపాటు పలు సంఘాలు దీక్షలో పాల్గొనాలని నిర్ణయించాయి. నూతన వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా రైతుసంఘాలు చేపడుతున్న భారత్‌ బంద్‌కు అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. భారత్‌ బంద్‌ జరిగే సమయంలో ఎక్కడ వాహనాలు అక్కడే నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. వామపక్ష అనుబంధ సంఘాలతో పాటు పలు ఉద్యోగ సంఘాలు కూడా  రైతుల బంద్‌కు మద్దతు పలికాయి. ఇదిలా ఉంటే రైతాంగానికి మద్దతు తెలుపుతూ పలువురు రాష్ట్రనేతలు ఉమ్మడి జిల్లాలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జాతీయరహదారుల దిగ్బంధంలో పలువురు నేతలు పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌తో పాటు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి షాద్‌నగర్‌లో వేర్వేరుగా జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనను న్నారు. షాద్‌నగర్‌లో హైదరాబాద్‌- బెంగుళూరు జాతీయరహదారిపై మంత్రి కేటీఆర్‌ ధర్నా చేయనున్నారు. అలాగే షాద్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ వద్ద రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ నేతలతో కలిసి ధర్నాలో పాల్గొననున్నారు. అలాగే శామీర్‌పేటలోని రాజీవ్‌ రహదారిపై  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధర్నాకు దిగనున్నారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మహేశ్వరంలోని శ్రీశైలం హైవేపై జరిగే ఆందోళన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇదిలాఉంటే నేడు జరిగే భారత్‌ బంద్‌ సమయంలో మార్పులు చేసినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు బంద్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాలుగు గంటల పాటు బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. 


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులకు మద్దతుగా మంగళవారం నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం వికారాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌, అఖిల పక్షాల ఆధ్వర్యంలో వేర్వేరుగా బంద్‌ సన్నాహక సమావేశాలు నిర్వహించారు.  రైతులకు మద్దతుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని నిర్ణయించాయి. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ బంద్‌ నిర్వహించి రైతులకు తమ సంఘీభావం తెలియజేయనున్నారు. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలతోపాటు పలు వ్యవసాయ, కార్మిక, ప్రజాసంఘాలు కూడా భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బంద్‌ లో పాల్గొననుండగా, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, టీజేఎస్‌, వ్యవసాయ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి బంద్‌లో పాల్గొంటారు. కాంగ్రెస్‌ తరపున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి, ఇతర రాజకీయ పక్షాల నాయకులు పాల్గొననున్నారు. హైదరాబాద్‌ - బీజాపూర్‌ అంతరాష్ట్ర రహదారిపై పరిగి నియోజకవర్గం నాయకులు, కొడంగల్‌ - కరణ్‌కోట్‌ రహదారిపై కొడంగల్‌, తాండూరు నియోజకవర్గాల నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి..  రైతులకు తమ సంఘీభావం తెలియజేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇదిలాఉంటే, బంద్‌ను పురస్కరించుకొని ఆర్టీసీ బస్సులు నడిపించాలా, వద్దా అనే యోచనలో అధికారులు ఉన్నారు. 


Updated Date - 2020-12-07T05:30:00+05:30 IST