కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

ABN , First Publish Date - 2020-04-25T09:16:37+05:30 IST

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని, అన్ని శాఖల అధికారులు 24గంటలు పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలి

మే నెలలో కూడా ఉచిత బియ్యం, నగదు

6 నుంచి 10వ తరగతి పిల్లలకు టీస్యాట్‌లో పాఠాల బోధన

ఆన్‌లైన్‌లో టెన్త్‌ పాఠ్యపుస్తకాలు

నెలకు 15వేల కోట్ల నష్టం ఉన్నా ప్రజా ఆరోగ్యంపై దృష్టి

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి


వికారాబాద్‌ : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని, అన్ని శాఖల అధికారులు 24గంటలు పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అధికారులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పండగలు, శుభకార్యాలకు దూరంగా ఉండాలని, వచ్చే రంజాన్‌లో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. హైదరాబాద్‌, సూర్యాపేట, వికారాబాద్‌, గద్వాల్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, ఈ జిల్లాలకు ప్రత్యేక అధికారులను సైతం నియమించారన్నారు. వికారాబాద్‌ జిల్లాలో కరోనా కేసులు తగ్గాయని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇంకా కొన్ని రోజులు ఇళ్లకే పరిమితం కావాలన్నారు.


అవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావద్దని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆ విధంగానే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు. గతంలో రాష్ట్రంలో వరి 37 లక్షల టన్నులు పంట పండితే.. ఈ ఏడాది 80 లక్షల టన్నుల పంట పండిందన్నారు. దానికి కారణం కాళేశ్వరం, చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండడమేనన్నారు. మే 1 నుంచి రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచుతామని, రైతులు ఒక్కసారిగా రాకుండా వారికి సమయం ఉన్నప్పుడు వచ్చి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. ఇంటిఅద్దె విషయంలోనూ ఎవరూ బలవంతం చేయొద్దని.. మార్చి, ఏప్రిల్‌, మే నెలకు సంబంధించిన రెంట్‌ను ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్ధతిలో తీసుకోవాలన్నారు.


ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఫీజులు పెంచొద్దని, ట్యూషన్‌ ఫీజు సైతం నెలనెలా తీసుకోవాలన్నారు. ట్యూషన్‌ ఫీజులపై ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 18004 257462కు ఫోన్‌ చేయాలని సూచించారు.  ప్రభుత్వానికి రూ. 1500 వేలకోట్ల నష్టం ఉన్నప్పటికీ ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టిందన్నారు. టీ స్యాట్‌ ద్వారా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించడం జరుగుతుందన్నారు. అదేవి ధంగా టెన్త్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠ్యపుస్తకాలు ఉంచడం జరిగిందన్నారు. మార్కెట్‌లో ఎవరైనా ఎక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అమ్మితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూటర్లకు రవాణా అనుమతులు ఉన్నాయని, దుకాణాలకు నిత్యా వసర సరుకులను సరఫరా చేసుకోవచ్చన్నారు.


ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్‌లైన్‌ నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఆనంద్‌, ఎస్పీ నారాయణ, జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య,  డీఎంహెచ్‌వో దశరథ్‌, డీఏవో గోపాల్‌, ఉద్యాన శాఖ అధికారి మాలిని, మునిసిపల్‌ చైర్మన్‌ మంజుల రమేష్‌, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-04-25T09:16:37+05:30 IST