అనంతగిరిలో ఔషధ వనం!

ABN , First Publish Date - 2020-11-22T04:36:49+05:30 IST

‘‘అనంతగిరి కా హవా లాకో మరీజోంకా దవా...’’ అన్న నానుడిని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

అనంతగిరిలో ఔషధ వనం!
అనంతగిరి ఔషధ వనంలో నాటిన నల్లజీడి మొక్కలు

  • 750 ఎకరాల అటవీ స్థలం ఎంపిక
  • ఈ ఏడాది 100 ఎకరాల్లో 28 రకాల మొక్కలు
  • ఐదేళ్లలో పూర్తిస్థాయిలో ఔషధ మొక్కల పెంపకం


అటవీ ప్రాంతంలోని ఔషధ చెట్ల గాలిని పీల్చితే ఏ రోగాలూ దరి చేరవని పెద్దలు చెబుతారు.. అలాంటి మొక్కలకు ప్రసిద్ధిగాంచింది వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో మరిన్ని ఔషధ మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 750 ఎకరాలను ఎంపిక చేసింది.


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : ‘‘అనంతగిరి కా హవా లాకో మరీజోంకా దవా...’’ అన్న నానుడిని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అనంతగిరి అటవీ ప్రాంతం సందర్శకులకు ఆహ్లాదంతోపాటు ఆరోగ్యం కూడా పంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అనేక రకాల ఔషధ మొక్కలతో అలరారుతున్న ఈ అటవీ ప్రాంతాన్ని ఔషధ మొక్కల నగరిగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వికారాబాద్‌ జిల్లా కేంద్రం పక్కనే ఉన్న అనంతగిరి అటవీప్రాంతం అనాదిగా ఔషధ మొక్కలకు ప్రసిద్ధిగాంచింది. అనంతగిరిలోని చెట్లగాలి పీల్చే వారికి ఏ రోగాలు కూడా దరిచేరవనే నానుడి చాలా కాలంగా వాడుకలో ఉంది. వివిధ రకాల వ్యాధులను నయం చేయడంతో పాటు జీవుల ఆయుష్షు పెంచే శక్తి ఇక్కడి మొక్కలకు ఉందని ప్రజలు విశ్వసిస్తారు. 1940 ప్రాంతంలో క్షయవ్యాధి విజృంభించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అనంతగిరికి విహారానికి వచ్చిన అప్పటి నిజాం నవాబు చాలారోజుల పాటు ఇక్కడే ఉండి అటవీ ప్రాంతమంతా తిరిగి ఇక్కడ ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని గుర్తించారు. సాధారణంగా వేరేచోట వీచే గాలికి, అనంతగిరిలో వీచేగాలికి తేడా ఉందని తెలుసుకున్న ఆయన క్షయ రోగుల కోసం ఇక్కడ ఆసుపత్రి నిర్మించారు. ఈ ఆసుపత్రికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా రోగులు వచ్చేవారు. లక్షలాది మంది క్షయ రోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆసుపత్రిగా అనంతగిరి టీబీ ఆసుపత్రికి పేరుంది. ఆ తరువాత ఔషధ మొక్కలు ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతం గురించి పాలకులు అంతగా పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం సాఽధించిన తరువాత ప్రభుత్వం అనంతగిరి కొండలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 


750 ఎకరాల్లో ఔషధ మొక్కల పెంపకం


అనంతగిరి అటవీ ప్రాంతం 3,800 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ వివిధ రకాల ఔషధ మొక్కల పెంపకం చేపట్టేందుకు 750 ఎకరాలను ఎంపిక చేశారు. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లతో ఆకట్టుకునే అనంతగిరి ప్రాంతం పర్యాటక కేంద్రంగా పేరొందింది. అనంతగిరిని ఆహ్లాదం, ఆరోగ్యం పంచే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అనంతగిరిలో ఆయూష్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. అనంతగిరి అటవీ ప్రాంతంలో ఏయే ఔషధ మొక్కలు ఉన్నాయనే విషయమై ఇటీవల మెడిసినల్‌ ప్లాంట్స్‌ బోర్డు సభ్యులు సర్వే నిర్వహించారు. త్వరలో బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా సర్వే నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ అడవిలో 200 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో 750ఎకరాల్లో ఔషధ మొక్కలు నాటేలా జిల్లా అటవీ శాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళిక  సిద్ధం చేశారు. యాదాద్రి తరహాలో దట్టమైన అడవి ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలం పక్కనే ఉన్న అటవీ ప్రాంతం లోనే ఔషధ మొక్కలు నాటడానికి ఎంపిక చేశారు. మొదటగా ఈ ఏడాది 100 ఎకరాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఔషధ మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటివరకు సంపంగి, జీడి, అశ్వగంధ, నేలవాము, గోరింట, నిమ్మగడ్డి, వట్టివేరు, పొడగ, గురువింజ, బాదం, రావి, పనస, నల్లజీడి, బూరుగ, వస, వట్టి తదితర మొక్కలు నాటారు. ఇంకా ఎంపిక చేసిన మరికొన్ని మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చేఏడాది మరో 150 ఎకరాలు, ఆపై వచ్చే ఏడాదిలో 500 ఎకరాల్లో ఔషధ మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇక్కడ పెంచే ప్రతీ ఔషధ మొక్క దగ్గర ఆ మొక్క పేరు, వర్గం, ఉపయోగాల గురించి సందర్శకులు తెలుసుకునేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.  పర్యాటకులు, సందర్శకులు సందర్శించేందుకు వీలుగా ఈ వనంలో 1.5 కిలోమీటర్ల దూరం వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించనున్నారు. ఔషధ వనం అభివృద్ధికి రూ.50లక్షలతో రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. 


వనంలో 48 రకాల ఔషధ మొక్కలు


అనంతగిరిలో వివిధ రకాల ఔషధ మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రస్తుతం 48 రకాల ఔషధ మొక్కలను ఎంపిక చేశారు. అల్లనేరేడు, వేరుమద్ది, ఉసిరి, రావి, నెమలినార, చిల్లగింజ, దర్శనం, చింత, టేకు, తెల్లమద్ది, కానుగ, తెల్ల విరుగుడు, వేప, కాచు, నారవేప, జీడి, దొరిసేన, చిన్నంగి, ఇప్ప, మర్రి, మేడి, మామిడి, గన్నేరు, కరక్కాయ, ఇనుముద్ది, ముష్టి గంగ, పెద్ద గుమ్ముడు టేకు, జిల్లేడు అజఘ్నం, అంకుడు, పెద్ద రేగు, పరాకి, అడ్డాకు, కలే, చిం దుగ, చిరుమాను, చారుమామిడి, మోదుగ, పసుపు, పెద్దమాను, తదితర మొక్కలను పెంచనున్నారు. ఐదేళ్లలో తీగ, గడ్డిజాతి ఔషధ మొక్కలతో పాటు చాలా అరుదైన ఔషధ మొక్కలను కూడా ఇక్కడ పెంచాలనే యోచనలో సంబంధిత అధికారులు ఉన్నారు. 

Updated Date - 2020-11-22T04:36:49+05:30 IST