మరింత కట్టడి...

ABN , First Publish Date - 2020-04-14T11:48:14+05:30 IST

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఆశించినస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు.

మరింత కట్టడి...

రేపటి నుంచి వికారాబాద్‌లో ఎవరూ బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు

లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినం చేసేలా ఆదేశాలు వికారాబాద్‌ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది.


 రోజురోజుకూ  పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజలతోపాటు అధికారుల్లో ఆందోళన మొదలైంది. పదిరోజుల కిందట వరకు అతి తక్కువ పాజిటివ్‌ కేసులు ఉన్న జిల్లా.. ఇప్పుడు రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా వికారాబాద్‌ పట్టణంలో కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం నిషేధాజ్ఞలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమైంది. 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఆశించినస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. వికారాబాద్‌ జిల్లాలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండ టంతో అధికారులు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇతర ప్రాంతాల్లో కరోనాను కట్టడి చేయగలుగుతున్నా జిల్లాకేంద్రంలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా పకడ్బందీ ఆంక్షలు విధించాలని జిల్లా యం త్రాంగం నిర్ణయం తీసుకుంది.


పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌జోన్లుగా ప్రకటించి ప్రజల రాకపోకలపై నిషేధం విధించినా పలుచోట్ల ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితిని గుర్తించిన యంత్రాంగం బుధవారం నుంచి వికారాబాద్‌ పట్టణంలో మెడికల్‌ దుకాణాలు, ఆసుపత్రులు మినహా మిగతా వాటిని మూసివేయనున్నారు. కరోనా నియంత్రణకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వస్తే భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎంత చెబుతున్నా కొందరు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న ఈ సమయంలో కూడా ప్రజలు బయటకు వస్తే పరిస్థితి మరింత సమస్యగా మారే అవకాశం ఉందని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి వచ్చే సోమవారం వరకు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అత్యవసర సేవలు, పాలు, మెడిసిన్‌ అవసరమైన వారికి పంపిణీ చేసే బాధ్యతను వార్డు కౌన్సిలర్లకు అప్పగించారు. వార్డులవారీగా వలంటీర్లను నియమించి వారి ద్వారా సరఫరా చేయనున్నారు. ఆంక్షలను అతిక్రమించి ఎవరైనా బయటకు వస్తే కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. 


జిల్లా కేంద్రంలో మరో నలుగురికి పాజిటివ్‌ 

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మరో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వెంకటేశ్వర కాలనీలో ఇది వరకు పాజిటివ్‌ నమోదైన కుటుంబంలోనే మరో ముగ్గురికి రాగా, బీటీఎస్‌ కాలనీలో పాజిటివ్‌ వచ్చిన కుటుంబంలో మరొకరికి కరోనా సంక్రమించినట్లు గుర్తించారు. వికారాబాద్‌ పట్టణంలో ఇంతవరకు 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  కాగా, కొత్తగా నమోదైన ఈ నాలుగు కేసులతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది. రెండు రోజుల వ్యవధిలోనే వికారాబాద్‌లో 19 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం పట్ల ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.


వీటిలో రెండు కేసులు మినహా మిగతా 17 పాజిటివ్‌ కేసులు కాంటాక్టుల ద్వారా సంక్రమించినవే కావ డం గమనార్హం. జిల్లాలో తాండూరులో మూడు, పరిగిలో రెండు, మర్పల్లిలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైన విష యం తెలిసిందే. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 25కు చేరుకోగా, ఈ కేసుల్లో వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధుడు ఆదివారం మృతి చెందాడు. పాజిటివ్‌ కేసులు నమోదైన కుటుంబాలతోపాటు అనుమానితుల నుంచి సేకరించి వైద్యపరీక్షలకు పంపించిన వాటిల్లో ఇంకా 39 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లాల్లో వికారాబాద్‌ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. ఇదిలాఉంటే, మధుకాలనీ, రిక్షా కాలనీల్లో మదర్సాల్లోనే హోంక్వారంటైన్‌లో ఉన్న 26 మందిని సోమవారం అనంతగిరి హరిత రిసార్ట్స్‌ క్వారంటైన్‌కు తరలించారు. 


వికారాబాద్‌ పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ ఆరా

పదిరోజుల కిందట అయిదు కేసులకు పరిమితమైన వికారాబాద్‌ పట్టణం.. రెండు రోజుల వ్యవధిలో 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రారంభంలో కరోనా కేసులు అంతగా నమోదు కాని వికారాబాద్‌ పట్టణంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంపై సీఎం కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలిసింది. కరోనా కేసులు పెరగడానికి దారితీసిన కారణాలను తెలుసుకున్న ఆయన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి సబితారెడ్డి కలెక్టరేట్‌లో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, కలెక్టర్‌ పౌసుమి బసు, ఎస్పీ నారాయణ, అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, డీఎంహెచ్‌వో దశరథ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు తదితరులతో కలిసి సమీక్ష నిర్వహించారు. నమోదైన పాజిటివ్‌ కేసులు, ఇంకా రావాల్సిన నమూనాల ఫలితాలు, నిత్యావసరాల పంపిణీ, లాక్‌డౌన్‌ అమలుతీరుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ మరింత పకడ్బందీగా అమలు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.


మల్లగుల్లాలు పడుతున్న అధికారులు

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. కేసులు పెరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఢిల్లీ మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారిని కట్టడి చేయడం, వారు కలిసిన వారిని సకాలంలో గుర్తించి వారిని హోంక్వారంటైన్‌ చేసినా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నారు. హోంక్వారంటైన్‌లో ఉన్న సమయంలో సరైన తీరులో కట్టడి చేయని కారణంగానే కాంటాక్టు కేసులు పెరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


అంతే కాకుండా పాజిటివ్‌ కేసు నమోదైన వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించి మిగతా కుటుంబ సభ్యులందరినీ ఒకే ఇంట్లో హోంక్వారంటైన్‌ చేయడం వల్ల వారిలో ఒకరికొకరికి ఈ వైరస్‌ సంక్రమించి కేసులు పెరగడానికి దోహదపడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పాజిటివ్‌ కేసు నమోదైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి మిగతా కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌ చేయకుండా ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకున్నట్లయితే కేసులు ఈస్థాయిలో పెరిగి ఉండేవి కాదన్న వాదన కూడా వినపడుతోంది.


Updated Date - 2020-04-14T11:48:14+05:30 IST