రైతు కష్టం.. పంట నష్టం.. వానాకాలంలో ముంచెత్తిన వర్షాలు

ABN , First Publish Date - 2020-12-31T05:16:07+05:30 IST

ఈ ఏడాది కురిసిన వర్షాలు ఉమ్మడి జిల్లా రైతులకు భారీ నష్టాలను మిగిల్చాయి.

రైతు కష్టం.. పంట నష్టం.. వానాకాలంలో ముంచెత్తిన వర్షాలు
మర్పల్లిలో నీట మునిగిన పత్తిపంట (ఫైల్‌)

నీట మునిగిన పంటలు 

దెబ్బతిన్న పెసర, పత్తి, కంది, వరి పంటలు 

నష్టాల్లో రైతన్న 


ఈ ఏడాది కురిసిన వర్షాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులకు భారీ నష్టాలను మిగిల్చాయి. వానాకాలంలో ముందస్తుగా కురిసిన వర్షాలకు అష్టకష్టాలు పడి పంటలు వేస్తే చేతికందకుండా వరదలు నిండా ముంచేశాయి. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతన్న అతలాకుతల మయ్యాడు. ఈసారి సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురవడంతో వరి, పత్తి, కంది, పెసర, కూరగాయ పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేసినా.. ఇంతవరకు వారికి ఎలాంటి నష్ట పరిహారం అందలేదు. రైతులకు ఈ ఏడాది చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ప్రారంభంలో అన్నదాతల్లో ఆశలు రేపిన వర్షాలు.. పంటలు చేతికొచ్చే సమయంలో ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఈసారి గణనీయంగా పంట ఉత్పత్తులు చేతికందుతాయని రైతులు ఆశ పడితే.. వారి ఆశలను భారీ వర్షాలు అడియాశలు చేశాయి. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో ప్రధాన పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. 


వికారాబాద్‌ జిల్లాలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం చోటు చేసుకుంది. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 1,43,227 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పత్తి పంట 86,998 ఎకరాలు, కంది 33,142 ఎకరాలు, పెసర 13,701 ఎకరాలు, వరి 8,191, మొక్కజొన్న 310, సోయా 300, అలసంద 280, మినుములు 109, చెరుకు 41 ఎకరాల్లో నష్టం చోటు చేసుకుంది. కురిసిన వర్షాలకు 75,560 మంది రైతులు 1,43,227 ఎకరాల్లో పంటలు నష్టపోయారు. రూ.200 కోట్లకు పైగా జిల్లాలో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. 


అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 1,20,774ఎకరాల్లో వివిధరకాల పంటలను రైతులు నష్టపోయారు. వరి 24,525 ఎకరాలు, పత్తి 82,870ఎకరాలు, కంది 6,303 ఎకరాలు, మొక్కజొన్న 1,503ఎకరాలు, జొన్న 192 ఎకరాలు, కూరగాయలు 4,833 ఎకరాలు, పూలు 529 ఎకరాల్లో నష్టం జరిగింది. భారీ వర్షాలతో రైతులకు రంగారెడ్డి జిల్లాలో రూ.173కోట్ల మేర పంటనష్టం జరగగా, రూ.17.15 కోట్ల విలువైన కూరగాయలు, రూ.1.90 కోట్ల విలువైన పూల పంటలను రైతులు నష్టపోయారు. 


మేడ్చల్‌ జిల్లాలో 1745 ఎకరాల్లో వరి, 237 ఎకరాల్లో పత్తి, 225 ఎకరాల్లో కంది పంటలకు నష్టం జరిగింది. చేతికొచ్చే సమయంలో పంటలు పూర్తిగా నీట మునిగి తీవ్ర నష్టం జరగడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపించారు. తాము నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేసినా ఇంత వరకు వారికి ఎలాంటి నష్ట పరిహారం చేతికందలేదు.


పెరిగిన సాగు విస్తీర్ణం

ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. సాధారణ సాగు విస్తీర్ణం కంటే పంటలు సాగు చేసిన విస్తీర్ణం పెరగడం విశేషం. వానాకాలంలో వికారాబాద్‌ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 4,25,399.32 ఎకరాలు ఉండగా, ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 5,50,106.21 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. పత్తి 2,53,017 ఎకరాలు, కంది 1,70,627 ఎకరాలు, పెసర 22,733 ఎకరాలు, వరి 68,297 ఎకరాలు, మినుములు 10,252.16 ఎకరాలు, సోయాబీన్‌ 2,061.03 ఎకరాల్లో పండించారు. అదే యాసంగి సీజన్‌లోనూ జిల్లాలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గత ఏడాది 63,254.70 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈ ఏడాది 1,02,159.07 ఎకరాల్లో సాగు చేయగా, వాటిలో శనగ 15,098 ఎకరాలు, వేరుశనగ 16,735 ఎకరాలు, వరి 59,179 ఎకరాలు, జొన్న 5,601 ఎకరాల్లో సాగు చేశారు. 


రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి జిల్లా వానాకాలం ప్రణాళిక సాగు విస్తీర్ణం 3,99,561 ఎకరాలు ఉండగా, 4,71,795.22 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి 71,613.11 ఎకరాలు, కంది 69,808.21 ఎకరాలు, పత్తి 2,73,227 ఎకరాలు, జొన్న 28,425.02 ఎకరాలు, పెసర 518.37 ఎకరాలు, మినుము 140.05 ఎకరాలు, ఆముదం 341.23 ఎకరాలు, ఇతర పంటలు 27,725 ఎకరాల్లో సాగు చేశారు. అదే యాసంగి సాధారణ సాగు అంచనా 94,737ఎకరాలు ఉండగా, 24,500.90 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, వాటిలో శనగ 4,604.10 ఎకరాలు, వేరుశనగ 5,882.85 ఎకరాలు, వరి 11,638.75 ఎకరాలు, ఇతర పంటలు 2,300 ఎకరాల్లో సాగు చేశారు. 


మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ జిల్లాలో వానాకాలం ప్రణాళిక సాగు విస్తీర్ణం 17,955 ఎకరాలు ఉండగా, 23,320.15 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. జిల్లాలో ఎక్కువగా వరి పంటతో పాటు కూరగాయలు, పూలు, పండ్ల తోటలు సాగు చేస్తారు. యాసంగిలో 11,050 ఎకరాల ప్రణాళిక సాగు విస్తీర్ణం ఉండగా, 10,595 ఎకరాల్లో పంటలు సాగుచేశారు. హైదరాబాద్‌ పట్టణ ప్రజలు వినియోగించే కూరగాయలు, పూలు, పండ్లలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే సరఫరా అవుతాయి.


రైతులకు పెట్టుబడి సాయం

సాగు పెట్టుబడి కోసం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తోంది. వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరాకు రూ.5 వేల వంతున అందజేస్తోంది. వికారాబాద్‌జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2,24,954మంది రైతులకు రూ.307.63 కోట్లు కేటాయించగా, వారిలో 2,10,743 మంది ఖాతాల్లో రూ.294.5 కోట్లు జమయ్యాయి. యాసంగిలో పంటలు సాగు చేసేందుకు జిల్లాలో 2,30,639 మంది రైతులకు రూ.310,76,81,571 పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వానాకాలంతో పోలిస్తే ఈ సీజన్‌లో మరో 7వేల మంది రైతులకు కొత్తగా రైతుబంధు సహాయం అందనుంది. 


రంగారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్‌లో 3,04,026 మంది రైతులకు రూ.369.86 కోట్లు కేటాయించగా, 2,63,271 మంది రైతులకు రూ.337.55 కోట్ల పెట్టుబడి సాయం అందింది. అదే యాసంగి సీజన్‌లో మంగళవారం ఎకరాలలోపు ఉన్న 85,804 మంది రైతుల ఖాతాల్లో రూ.25.79 కోట్ల పెట్టుబడి సాయం జమ చేశారు. 


మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో వానాకాలం సీజన్‌లో 33,334 మంది రైతులకు రూ.34.85 కోట్ల పెట్టుబడి సాయం విడుదల చేయగా, వారిలో 23,951మంది రైతులు రూ.25.35 కోట్ల రైతుబంధు తీసుకున్నారు. యాసంగి సీజన్‌లోనూ రూ.34.85 కోట్లు సర్కార్‌ విడుదల చేసింది. 

ఇదిలాఉంటే, రైతుబంధు పథకం వర్తించే రైతులందరికీ ప్రభుత్వం రూ.5 లక్షల వంతున బీమా చేయించింది. వికారాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది 1,22,834 మంది రైతులకు బీమా వర్తింపజేశారు. ఇంతవరకు మృతి చెందిన 103మంది రైతులకు రూ.515 లక్షలు పరిహారంగా అందజేశారు. ఇదిలాఉంటే, పీఎం కిసాన్‌ పథకం ద్వారా జిల్లాలో 1,42,003 మంది రైతులకు ఎకరాకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేల వంతున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోంది. 


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో

పంట సాగు, నష్టం వివరాలు (ఎకరాల్లో)

పంట     సాగు             నష్టం

వరి     1,52,623.11             34,461

పత్తి     5,27,244     1,70,105

కంది     2,42,221.21             39,670



Updated Date - 2020-12-31T05:16:07+05:30 IST