సాగు మొదలైంది.. సాయం కరువైంది!

ABN , First Publish Date - 2020-12-07T05:00:22+05:30 IST

వానాకాలం సీజన్‌ ముగిసింది. రైతు బంధు కొందరికే అందింది.

సాగు మొదలైంది.. సాయం కరువైంది!

  • యాసంగి పనులు ప్రారంభమైనా ఇంకా రైతు బంధు ఊసెత్తని సర్కార్‌..
  • జిల్లాలో రైతుబంధు డబ్బుల కోసం అన్నదాతల ఎదురు చూపులు 
  • పంట పెట్టుబడి కోసం వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు



రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం అందరికీ అందడం లేదు. వానాకాలం సీజన్‌ ముగిసి యాసంగి సీజన్‌ మొదలైనా మొదటి విడత పెట్టుబడి సాయం ఇప్పటి వరకు అందలేదు. అయితే.. వానాకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయమే పూర్తిస్థాయిలో అందలేదు. ఇక యాసంగి సాయం ఎప్పుడిస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలు వస్తయా? రావా? అనే అయోమయం నెలకొన్నది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : వానాకాలం సీజన్‌ ముగిసింది. రైతు బంధు కొందరికే అందింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పఽథకం ఖరీఫ్‌లో చాలామందికి వర్తించలేదు. జిల్లాలో 3,04,026 మంది రైతులు ఉండగా రూ.369.86 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 2,63,271 మంది రైతులకు రూ.337.55 కోట్లు ఈ-కుబేర్‌ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా 40,755 మంది రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. వారంతా డబ్బుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. యాసంగి పంట సాగు ప్రారంభమైన తరుణంలో డబ్బులు వస్తయా? రావా? అని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పంట సాగు పూర్తికాగా యాసంగి పంటల సాగుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే.. వానాకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందలేదు. ఇక యాసంగి సాయం ఎప్పుడిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతులకు వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో పంటల సాగు కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడిని అందిస్తుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ముగిసి, యాసంగి సీజన్‌ ప్రారంభమైనప్పటికీ ఇంకా పెట్టుబడి సాయానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. పెట్టుబడి సాయం కింద రూ.5 వేల చొప్పున వానా కాలం, యాసంగి రెండు పంటలకు కలుపుకుని రూ.10 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి వానాకాలం పంటలకు  సంబంధించి నియం త్రిత సాగు విధానాన్ని అమలు చేసింది. మొక్కజొన్న పం టను పూర్తిగా తగ్గించాలని సర్కార్‌ నిర్ణయించడంతో పత్తి, వరి, కంది పంట లను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. కానీ... ప్రకృతి వైపరీత్యాల కారణంగా అధిక వర్షా లకు పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులకు పెట్టబడులు రాని పరిస్థితులు నెలకొన్నాయి. పంట నష్టాన్ని అంచనా వేసిన ప్పటికీ.. ఇప్పటివరకు రైతులకు చిల్లి గవ్వ పరిహారం కూడా అంద లేదు. వానాకాలం సీజన్‌ ముగియడంతో...  యాసంగి సాగుకు రైతులు సన్నద్ధం అవుతు న్నారు. వ్యవసాయాధికారులు యాసంగి పంటల సాగు 2020-21 సంవత్సరం ప్రణాళికను సిద్ధం చేశారు. సాగుబడికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులను తెప్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. జిల్లాలో ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిశాయి. సాగునీటికి ఇబ్బందులు లేకపోవడంతో యాసంగిలో వరి సాగు గణనీయంగా పెరగనుంది. రంగారెడ్డి జిల్లాలో 94,737 ఎకరాల విస్తీర్ణంలో వరి, గోధుమలు, జొన్నలు, సజ్జలు, చిరుధాన్యాలు, శనగలు, ఉలవలు, పెసర్లు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పశుగ్రాసంతోపాటు ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇందుకుగాను 24500.90 క్వింటాళ్లలో విత్తనాలు అవసరం కానున్నట్లు అంచనా రూపొందించారు. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో రైతులు యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. దుక్కులు దున్ని విత్తులు వేసేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది రైతులు ఇప్పటికే విత్తనాలు విత్తారు. పంట పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులందరూ ప్రభుత్వం అందించే రైతుబంధు డబ్బుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తమకు అందాల్సిన రైతుబంధు సాయాన్ని త్వరగా తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


2019 వానాకాలం రైతుబంధు వివరాలు

మొత్తం రైతులు : 2,81,766

కేటాయించిన డబ్బులు : రూ. 359.88 కోట్లు

డబ్బులు అందిన రైతులు : 2,30,169

ఈ-కుబేర్‌ ద్వారా ఖాతాల్లోకి జమ :  రూ.257.18 కోట్లు


2020 వానాకాలం రైతుబంధు వివరాలు

మొత్తం రైతులు : 3,04,026

కేటాయించిన డబ్బులు : రూ. 369.86 కోట్లు

డబ్బులు అందిన రైతులు : 2,63,271

ఈ-కుబేర్‌ ద్వారా ఖాతాల్లోకి జమ : రూ.337.55 కోట్లు


2019 యాసంగి రైతు బంధు వివరాలు

డబ్బులు అందిన రైతులు : 1,87,804

ఈ-కుబేర్‌ ద్వారా ఖాతాల్లోకి జమ : రూ182.38 కోట్లు

Updated Date - 2020-12-07T05:00:22+05:30 IST