మళ్లీ మొదటికొచ్చిన ప్రకృతి వనం స్థలసమస్య
ABN , First Publish Date - 2020-09-20T09:34:21+05:30 IST
మండల కేంద్రమైన బషీరాబాద్ గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం స్థలం కేటాయింపుపై సమస్య మళ్లీ మొదటికొచ్చింది...

బషీరాబాద్ : మండల కేంద్రమైన బషీరాబాద్ గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం స్థలం కేటాయింపుపై సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గత నెల రోజులుగా స్థానిక తహసీల్దార్ షౌఖత్‌అలీ, సిబ్బంది పలుచోట్ల స్థలాలను పరిశీలించినా ఏదో ఒక సమస్య వచ్చిపడుతుంది. ఈ క్రమంలో రాజకీయ వత్తిడి పెరిగి రెవెన్యూ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. తాజాగా తహసీల్దార్ స్థానిక పీహెచ్సీ భవనం వెనక నిజాం కట్టడాలు ఉన్న ప్రాంతంలో స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఈ స్థలం సరైంది కాదని, భవిష్యత్‌లో ఆసుపత్రి భవన నిర్మాణాలకు అవసరమైతే ఇబ్బందులు వస్తాయని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అంతేగాకుండా సర్వే నంబర్ 61లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంపై ఆ స్థలం ఖాళీ చేయించి కేటాయించాలని కలెక్టర్, డీపీవో, ఆర్డీవోలకు ఫ్యాక్స్ ద్వారా ఓ ముఖ్యనేత, కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు వినతిపత్రాలు కూడా పంపినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే శుక్రవారం రోజు తాండూరు ఆర్డీవో ఆశోక్‌కుమార్ బషీరాబాద్‌కు వచ్చి తహసీల్దార్ షౌఖత్‌అలీ, ఎంపీవో రమే్‌షతో కలిసి ఆప్రభుత్వ భూమిని పరిశీలించి వెళ్లినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉంది..? ఏ మేరకు కబ్జాకు గురైందనే దానిపై వెంటనే సర్వే చేయించి నివేదిక పంపాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు సర్వేయర్ ఫ్రభు, రెవెన్యూ సిబ్బంది సర్వేచేశారు. ఈ సర్వే నంబర్ 61లో 17 ఎకరాల 24 గుంటలు ప్రభుత్వ భూమి ఉండగా అందులో ఇప్పటికే ఎంపీడీవో, తహసీల్దార్, పాత పోలీ్‌సస్టేషన్, బస్టాండ్, వ్యవసాయ కార్యాయలం, ఆర్అండ్బీ విశ్రాంతి భవనం, పాఠశాల, గ్రామ పంచాయతీ భవనాలు వంటి పలు ప్రభుత్వ కట్టడాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. బస్టాండ్ సమీపంలోని రోడ్డు పక్కన రైల్వేగేటు వరకు ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాగా, పలువురు ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు సర్వేలో గుర్తించినట్లు రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఈ సర్వే నివేదికను ఉన్నతాధికారులకు పంపి తదుపరి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.