ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-09-06T09:23:06+05:30 IST

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అడిషనల్‌ డీఆర్‌డీవో స్టీవెన్‌నీల్‌, డీఎల్‌పీవో చంద్రశేఖర్‌ హెచ్చరించారు.

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే చర్యలు

పెద్దేముల్‌ : ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అడిషనల్‌ డీఆర్‌డీవో స్టీవెన్‌నీల్‌, డీఎల్‌పీవో చంద్రశేఖర్‌ హెచ్చరించారు. పెద్దేముల్‌ మండలం ఇందూరు గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. అయితే కొందరు ఆభూమి తమదని ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేయించిన ఫెన్సింగ్‌ స్తంభాలను కూలగొట్టారు. పెద్దేముల్‌ మండల కేంద్రంలో కంపోస్టుషెడ్డును కొందరు ధ్వంసం చేశారు.


ఆయా విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్‌ పౌసుమిబసు స్పందించారు. వెంటనే అడిషనల్‌ డీఆర్‌డీవో స్టీవెన్‌నీల్‌, డీఎల్‌పీవో చంద్రశేఖర్‌ను అక్కడికి పంపించి విచారణ చేయించారు. పెద్దేముల్‌ పంచాయతీ కార్యదర్శి సుధారాణి, ఇందూరు పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ బాధ్యులపై పెద్దేముల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఎస్‌ఐ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-06T09:23:06+05:30 IST