మృత్యు దారి

ABN , First Publish Date - 2020-12-04T05:22:09+05:30 IST

హైదరాబాద్‌ - బీజాపూర్‌ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది.

మృత్యు దారి
మల్కాపూర్‌ వద్ద ప్రమాదకరంగా ఉన్న మలుపు

  • రక్తమోడుతున్న హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే
  • మూడేళ్లలో 444 రోడ్డు ప్రమాదాలు..
  • 184 మంది మృతి, 561 మందికి గాయాలు
  • రోడ్డు విస్తరణలో తీవ్ర జాప్యం
  • నిత్యం చోటు చేసుకుంటున్న ప్రమాదాలు
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు


కొన్ని హైవేలు మృత్యు కుహరాలుగా తయారయ్యాయి. పేరుకు జాతీయ రహదారులే కానీ.. ఇరుకు రోడ్లు, ప్రమాదకర మూల మలుపులతో   ప్రయాణికులను బలికొంటున్నాయి. రహదారులపై ఎలాంటి సూచికలూ లేకపోవడంతో రోజూ భయంకరమైన ప్రమాదాలు  జరుగుతున్నాయి. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : హైదరాబాద్‌ - బీజాపూర్‌ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ఈ రోడ్డును నేషనల్‌ హైవేగా ప్రకటించినా విస్తరణకు నోచుకోవడం లేదు. రహదారి విస్తరణ పనులు మధ్యలోనే ఆపేశారు. అసలే ఇరుకురోడ్డు.. ఆపై ఎన్నెన్నో మలుపులు.. గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం చేయా లంటే జంకుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. కనీసం గుంతలైనా పూడ్చాలన్న ఆలోచన కలగడం లేదు. పెరిగిన రవాణా అవస రాలకు తగ్గట్టుగా రోడ్డు లేదు. దీనిపైనే నిత్యం వేలసంఖ్యలో వాహ నాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎం పీలు, మంత్రులు ఈ రోడ్డు మార్గం నుంచే ప్ర యాణిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించు కోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. బుధవారం మల్కాపూర్‌- కందాడ మధ్యన జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఒకే కుటుం బంలో ఏడుగురు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. పాలకుల పట్టింపులేని తనంతో ఇంకా ఈ రోడ్డుపై ఎంతమంది బలవుతారో అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. 


ఆగిన రోడ్డు విస్తరణ పనులు

హైదరాబాద్‌-మన్నెగూడ జాతీయరహదారి 163, ఔటర్‌ రింగురోడ్డు అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా మార్చాలని గతంలో కేంద్రం నిర్ణ యించింది. 2017-18 కంటే ముందే ఈ రోడ్డు ఎన్‌హెచ్‌ఏఐ ఆధీనంలోకి వెళ్లింది. డీపీఆర్‌ రూపొందించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 67.71 హెక్టార్ల విస్తీర్ణంలో భూసేకరణ చేప ట్టింది. ఏమైందో తెలియదు కానీ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. రూ.740 కోట్లతో ఏడాదిలోగా పనులను పూర్తి చేయాలని మళ్లీ నిర్ణయించింది. కానీ.. ఇప్పటివరకు రోడ్డు విస్తరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 


ఈ మలుపులు... యమపురికి పిలుపులు

లంగర్‌హౌజ్‌ నుంచి మన్నెగూడ వరకు ఉన్న రోడ్డు మలుపులు యమపురికి పిలుపులుగా మారాయి. టీప్‌ఖాన్‌ పూల్‌ బ్రిడ్జీ, బండ్లగూడ, హైదరషాకోట్‌, మిలటరీ స్కూల్‌, ఆరెమైసమ్మ, అప్పా జంక్షన్‌, రాణెఇంజన్‌వాల్‌, అమ్డాపూర్‌ చౌరస్తా, హిమాయత్‌నగర్‌చౌరస్తా, స్వామినారాయణ గురుకుల్‌, ఎన్‌కేపల్లిచౌరస్తా, అజీజ్‌నగర్‌ చౌరస్తా, మృగవని జాతీయపార్కు,  మొయునాబాద్‌  పోలీస్‌ స్టేషన్‌, కనక మామిడి, అప్పారెడ్డిగూడ, కేతిరెడ్డిపల్లి, ముడిమ్యాల, తోల్‌ కట్టా, కందవాడ, మల్కాపూర్‌, ఇబ్రహీంపల్లి, దామరగిద్ద, మీర్జాగూడ, ఖానాపూర్‌, కండ్లపల్లి వరకు అత్యంత ప్రమాదకరమైన మలుపులున్నాయి. ఈ మలుపుల వద్ద రోడ్డుప్రమాదాలు తరచూ నెలకొంటున్నాయి. గత మూ డేళ్లలో చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 444 రోడ్డు ప్రమాదాలు జరగగా 184మంది మృతి చెందగా 561 మంది గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తల్లిదండ్రులు మృతి చెందటంతో పిల్లలు అనాథలుగా మారారు. 


ప్రాణాలు మింగుతున్న నాగరగూడ బ్రిడ్జి

షాబాద్‌ మండలం నాగరగూడ బ్రిడ్జి అమాయకుల ప్రాణాలను మింగేస్తుంది. షాద్‌నగర్‌ నుంచి కంది వరకు ముంబై బైపాస్‌ జాతీయ రహదారి పనులను నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.200 కోట్లతో డిసెంబరు 9న 2012లో ప్రారంభించారు. నాలుగు లేన్ల రోడ్డుకు చేవెళ్లలో శంకు స్థాపన చేశారు. షాద్‌నగర్‌ నుంచి సంగారెడ్డి జిల్లా కంది వరకు 67 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు పూర్తి చేశారు. కానీ.. నాగరగూడ వద్ద ఈసీ వాగుపై బ్రిడ్జిని సగం నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి యమపురిని తలపిస్తుంది. ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడంతో రాత్రి వేళలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆటో బోల్తా పడి వికారాబాద్‌కు చెందిన జాక్విన్‌ అనే వ్యక్తి మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిడ్జి నిర్మా ణాన్ని త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 


విస్తరణకు నోచుకోని కొత్తూర్‌- షాద్‌నగర్‌ పాత హైవే.. 

కొత్తూర్‌ వైజంక్షన్‌ నుంచి నందిగామ, చంద్రాయన్‌గూడ మీదుగా షాద్‌నగర్‌కు వచ్చే పాత జాతీయరహదారి పూర్తిగా దెబ్బతిన్నది. మొదట నేషనల్‌ హైవే-7గా పిలువబడే ఈ రోడ్డు అధ్వాన్న స్థితికి చేరుకున్నా... పట్టించుకునే నాథుడే లేడు. ఈ రహదారిని డబుల్‌ రోడ్డుగా మార్చాల్సిన అవసరం ఉన్నా... నేటికీ ఆ ప్రయత్నం చేయడంలేదు. హైదరాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వచ్చే వాహనాలు పాత జాతీయ రహదారిపైనే వస్తుం టాయి. అలాగే ముంబై బైపాస్‌కు వెళ్లే వాహనాలు సైతం షాద్‌నగర్‌ చౌరస్తా మీదుగా ఎలికట్ట చౌరస్తా నుంచి చేవెళ్ల వైపు వెళ్తుంటాయి. షాద్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు ఇదే రోడ్డు గుండా వెళ్తాయి. అయితే రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రహదారి డబుల్‌ రోడ్డుగా మార్చాల్సి ఉండగా.. నేటివరకు ఆ ఊసే లేదు. బీటీ రెన్యువల్‌ కోసం రూ.3 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నా... నేటివరకు ఎలాంటి పనులు జరగడంలేదు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గత రెండు నెలల్లో మొత్తం 34 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 13 మంది మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు.


రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వినతి

చేవెళ్ల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజా ప్రతినిఽధులు గురువారం ఉదయం ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యను కలిశారు. హైదరాబాద్‌- బీజాపూర్‌ హైవే విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని వినతి చేశారు. దీనికి వారు స్పందించారు. త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు  తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేను కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ నాయకులు మల్గారి రమణారెడ్డి, మర్పల్లి కృష్ణారెడ్డి, దేవర కృష్ణారెడ్డి, మాసన్నగారి మాణిక్యరెడ్డి, కవ్వగూడెం ప్రతాప్‌రెడ్డి, పడాల ప్రభాకర్‌, పడాల రాములు, పెద్దోళ్ల ప్రభాకర్‌, మద్దెల జంగయ్య తదితరులున్నారు. 


విస్తరించకుంటే పెద్దఎత్తున ఆందోళన

ప్రమాదభరితంగా మారిన హైదరాబాద్‌ బీజాపూర్‌ జాతీయ రహ దారి విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ చేవెళ్లలో అఖిలపక్షం, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు సమావేశ మయ్యారు. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు ఆరు లేన్ల రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రోడ్డు విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని లేదంటే.. రిలే దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు.  అడహక్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఆర్డీవో, కలెక్టర్‌, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రికి వినతిపత్రం సమర్పించనున్నట్లు, ఏడు రోజుల్లో విస్తరణ పనులు చేపట్టకుంటే.. ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మల్కాపూర్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు సున్నపు వసంతం, ఆ పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి, చేవెళ్ల సర్పంచ్‌ శైలజాఆగిరెడ్డి, యాలాల మహేశ్వర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పాండు రంగారెడ్డి, ఆంజనేయులుగౌడ్‌, కె.రామస్వామి, సుధాకర్‌గౌడ్‌, గుండాల రాములు, బురాన్‌ ప్రభాకర్‌, కడమంచి నారాయణదాస్‌, బేగరి రాజు, మల్లేష్‌, శ్రీనివాస్‌, లక్ష్మీ, రాజుగౌడ్‌, విజయ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:22:09+05:30 IST