సర్పంచ్‌ భర్తపై దాడికి యత్నం.. మాటమార్చడంతో తిరగబడ్డ గ్రామస్థులు

ABN , First Publish Date - 2020-07-27T16:50:09+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని హున్సలో సర్పంచ్‌ భర్తపై గ్రామస్థులు తిరగబడ్డారు. ఓ దశలో దాడికి యత్నించారు. ఇచ్చిన హామీని నెరవేర్చక పోవడంతో పదవి వచ్చక మాట మారుస్తావా అంటూ నిలదీశారు.

సర్పంచ్‌ భర్తపై దాడికి యత్నం.. మాటమార్చడంతో తిరగబడ్డ గ్రామస్థులు

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌

ఎన్నికల్లో రెండెకరాల 7 గుంటల భూమిని గ్రామానికి ఇస్తానని హామీ


బోధన్‌ (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని హున్సలో సర్పంచ్‌ భర్తపై గ్రామస్థులు తిరగబడ్డారు. ఓ దశలో దాడికి యత్నించారు. ఇచ్చిన హామీని నెరవేర్చక పోవడంతో పదవి వచ్చక మాట మారుస్తావా అంటూ నిలదీశారు. వివరాల్లోకి వెళ్తే.. బోధన్‌ మండలం హున్స గ్రామ సర్పంచ్‌ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చారు. పార్టీలకు అతీతంగా చీల గంగామణి గంగారంను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా తనను ఎన్నుకుంటే గ్రామానికి 2ఎకరాల 7గుంటల భూమిని కేటాయిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఏకతాటిపైకి వచ్చి సర్పంచ్‌ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. ఎన్నికలు జరిగి దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో ఇప్పటికే రెండుమూడు పర్యాయాలు సర్పంచ్‌ భర్తను గ్రామస్థులు వివిధ కులాల పెద్దలు కూర్చోపెట్టి ఈ వ్యవహారంపై నిలదీశారు. 


అయితే, నేడు రేపు అంటూ నెట్టుకొస్తుండడంతో గ్రామస్థులు ఓపిక నశించి ఆదివారం సర్పంచ్‌ భర్తను నిలదీశారు. దీంతో ఇటీవల రైతు వేదిక నిర్మాణానికి తన పొలాన్ని కేటాయిస్తున్నట్లు పేర్కొని భూమిపూజ సైతం చేశారు. కానీ ఆ స్థలం రైతువేదిక నిర్మాణానికి అనుకూలంగా లేదని అధికారులు తేల్చడంతో పక్కనే ఉన్న మరో భూమిని కేటాయించాలని సర్పంచ్‌ భర్తను కోరగా ఆయన నిరాకరించడంతో వివాదం ముదిరింది. ఆదివారం సర్పంచ్‌ భర్తను ఇదే విషయమై నిలదీయగా మాటమాట పెరిగి ఓ దశలో దాడి వరకు దారితీసింది. గ్రామ సర్పంచ్‌ భర్తపై గ్రామస్థులంతా తిరగబడ్డారు. ఎన్నికల్లో 2 ఎకరాల 7గుంటల భూమిని ఇస్తామని హామి ఇస్తేనే సర్పంచ్‌ పదవి ఇచ్చామని ఇప్పుడు ఎందుకు ఇవ్వవని గ్రామస్థులంతా నిలదీశారు. ఓ దశలో ఆయనపై చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారంతో గ్రామంలో ఉద్రిక్తంగా మారింది.

Updated Date - 2020-07-27T16:50:09+05:30 IST