ఇంటి అనుమతులకు ఇక్కట్లు!

ABN , First Publish Date - 2020-12-12T05:10:08+05:30 IST

మున్సిపాలిటీల పరిధిలో ఇళ్ల నిర్మాణాల అనుమతులకు ఇక్కట్లు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ సిస్టమ్‌ (టీఎస్‌బీపాస్‌)ను తెరపైకి తెచ్చింది. ఇందులో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఇంటి నిర్మాణానికి వెనువెంటనే అనుమతి లభిస్తుందని.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా, ఎలాంటి అవినీతి అక్రమాలకు చోటులేకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ పథకాన్ని స్వయంగా అమల్లోకి తెచ్చినా.. క్షేత్రస్థాయిలో మాత్రం తిప్పలు తప్పడం లేదు. టీఎస్‌ బీపాస్‌ నవంబరు 16న అమల్లోకి వచ్చినా.. దాదాపు 20 రోజుల నుంచి ఆన్‌లైన్‌ సేవల్లో మోరాయింపు కారణంగా ఒక్కో మున్సిపాలిటీలో రెండు, మూడు ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతులు లభించలేదు.

ఇంటి అనుమతులకు ఇక్కట్లు!

మొరాయిస్తున్న టీఎస్‌ బీపాస్‌ ఆన్‌లైన్‌ సేవలు

సర్వర్‌ మొరాయింపుపై మున్సిపల్‌ శాఖ అధికారుల్లో చలనం కరువు

టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలంటూ చేతులు దులుపుకొంటున్న వైనం

ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో వందల సంఖ్యలో పెండింగ్‌లో దరఖాస్తులు

ఇంటి అనుమతులు దొరకక ప్రజల ఇక్కట్లు

బోధన్‌, డిసెంబరు 11 : మున్సిపాలిటీల పరిధిలో ఇళ్ల నిర్మాణాల అనుమతులకు ఇక్కట్లు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ సిస్టమ్‌ (టీఎస్‌బీపాస్‌)ను తెరపైకి తెచ్చింది. ఇందులో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఇంటి నిర్మాణానికి వెనువెంటనే అనుమతి లభిస్తుందని.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా, ఎలాంటి అవినీతి అక్రమాలకు చోటులేకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ పథకాన్ని స్వయంగా అమల్లోకి తెచ్చినా.. క్షేత్రస్థాయిలో మాత్రం తిప్పలు తప్పడం లేదు. టీఎస్‌ బీపాస్‌ నవంబరు 16న అమల్లోకి వచ్చినా.. దాదాపు 20 రోజుల నుంచి ఆన్‌లైన్‌ సేవల్లో మోరాయింపు కారణంగా ఒక్కో మున్సిపాలిటీలో రెండు, మూడు ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతులు లభించలేదు. ఇళ్ల నిర్మాణాల కోసం ఒక్కో మున్సిపాలిటీలో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇళ్ల నిర్మాణాల అనుమతులను కేవలం టీఎస్‌ బీపాస్‌ ద్వారా మాత్రమే పొందాలని మున్సిపల్‌ అధికారులు సూచిస్తుండడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 

పేరు గొప్ప.. ఊరు దిబ్బలా అమలు

టీఎస్‌ బీపాస్‌ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణాల అనుమతులు సులభతరమయ్యాయని.. ఇంటి నిర్మాణదారులు ఏ ఒక్కరికీ నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని స్వయాన మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. గతంలో మాదిరిగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం మున్సిపాలిటీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అవినీతికి ఆస్కారం లేదని చెప్పిన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో టీఎస్‌బీపాస్‌ అమలు మాత్రం పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగానే ఉంది. ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం బిల్డింగ్‌ ప్లాన్‌లు రూపొందించి, ఇంజనీర్‌లు డ్రాయింగ్‌ ప్లాన్‌తో ఆన్‌లైన్‌లో టీఎస్‌ బీపాస్‌ అనుమతుల కోసం పెడితే ఆన్‌లైన్‌ సేవలు మోరాయిస్తున్నాయి. ఎక్కడి టీఎస్‌ బీపాస్‌ కింద అనుమతులు లభించడం లేదు. డ్రాయింగ్‌ బిల్డింగ్‌ పర్మిష న్‌కు ఆన్‌లైన్‌లో ఎక్కడా సహకారం లభించడం లేదు. పాత పద్ధతి ద్వారా ఇంటి నిర్మాణాలకు అనుమతులు చేసుకుందామంటే మున్సిపల్‌ అధికారులు ఒప్పుకునే పరిస్థితులు లేవు. టీఎస్‌ బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో డ్రాయింగ్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ లభించకపోవడం, ఇంటి నిర్మాణదారులను నిరాశకు గురిచేస్తోంది. ఇంటి నిర్మాణదారులు బిల్డింగ్‌ ప్లాన్‌లను రూపొందించి, ఇంజనీర్‌ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేసినా కనీస స్పందన కరువవుతోంది.  

బోధన్‌లో ముచ్చటగా మూడే అనుమతులు

టీఎస్‌బీ పాస్‌ అమల్లోకి వచ్చాక బోధన్‌ మున్సిపాలిటీలో ముచ్చటగా మూడే మూడు ఇళ్ల నిర్మాణాలకు టీఎస్‌ బీపాస్‌లో  అనుమతులు లభించాయి. వీటిలో రెండింటికి అప్రూవల్‌ లభించగా ఒకటి రిజక్ట్‌ అయ్యింది. ఇక ఆ తరువాత టీఎస్‌ బీపాస్‌ ఆన్‌లైన్‌ సేవలు మోరాయిస్తుండడంతో ఆన్‌లైన్‌లో ఎక్కడా అనుమతులు లభించడం లేదు. దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. టీఎస్‌ బీపాస్‌ ఆన్‌లైన్‌ సేవలు మోరాయిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతోంది. ఇళ్ల నిర్మాణాల అనుమతులకు ఎన్ని రోజులు వేచిచూసేదని నిర్మాణదారులు ప్రశ్నిస్తున్నా రు. టీఎస్‌ బీపాస్‌ సేవలను మెరుగుపర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్‌ సేవలు మోరాయిస్తున్నా మున్సిపల్‌ అధికారులు కనీసం స్పందించక పోవడంతో పాటు టోల్‌ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని చేతులు దులుపుకుంటుండడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. 

సాంకేతిక సమస్యలపై ఫిర్యాదు చేశాం

ఆంజనేయులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, బోధన్‌ మున్సిపాలిటీ

 ఈ సమస్య మా దృష్టికి కూడా వచ్చింది. టీఎస్‌ బీపాస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. బోధన్‌ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు మూడింటికి మాత్రమే టీఎస్‌బీపాస్‌లో అప్రూవల్‌ లభించింది. టీఎస్‌ బీపాస్‌ సేవలు మోరాయించడంపై టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయడంతోపాటు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.

Updated Date - 2020-12-12T05:10:08+05:30 IST